రూపాయి.. టపటపా!

Rupee exchange rate on dollar is the lowest level of historic Thursday - Sakshi

కొత్త ఆల్‌టైమ్‌ కనిష్టానికి పతనం; 69.05 వద్ద ముగింపు

ఒకేరోజు 43 పైసలు నష్టం

న్యూఢిల్లీ: రూపాయి అంతకంతకూ పాతాళానికి పడిపోతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ  గురువారం చరిత్రాత్మక  కనిష్ట స్థాయిలో... 69.05 వద్ద ముగిసింది. నిజానికి జూన్‌ 28వ తేదీ ఫారెక్స్‌ మార్కెట్‌ ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూపాయి విలువ 69.10ని తాకింది. అయితే డాలర్లను భారీగా అందుబాటులోకి తెస్తూ (ఆర్‌బీఐ) జోక్యంతో అదే రోజు కొంత కోలుకుంది. అయితే తాజాగా గురువారం ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో పతనమై, ముగింపులో కూడా రికార్డు స్థాయిని నమోదుచేసుకుంది. ఒకేరోజు 43 పైసలు నష్టపోయింది.  

కారణాలు ఇవీ... 
►అమెరికా ఆర్థిక రంగం పుంజుకుంటుందని, వడ్డీరేట్ల పెంపునకు తగిన వాతావరణం ఉందని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ చీఫ్‌ పావెల్‌ అమెరికా సెనేట్‌ ముందు చేసిన ప్రకటన ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌కు ఊతం ఇచ్చింది. డాలర్‌ ఇండెక్స్‌ మళ్లీ కీలక నిరోధ స్థాయి 95ను దాటింది. ఇది రూపాయి పతనానికి దారితీసింది. ఈ వార్త రాసే సమయానికి అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ 95.27 వద్ద ట్రేడవుతుండగా, డాలర్‌ మారకంలో రూపాయి విలువ 69.08 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఒక దశలో డాలర్‌ ఇండెక్స్‌ 95.44ను సైతం తాకింది.  
► మే 29 తరువాత ఒకేరోజు రూపాయి ఈ స్థాయిలో (43 పైసలు) పతనం కావడం ఇదే తొలిసారి.  
►కేంద్రంపై  అవిశ్వాసం శుక్రవారం చర్చకు వస్తుండడం రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.  
►రూపాయిని బలపరిచే విధంగా ఫారిన్‌ ఎక్సే్ఛంజ్‌ మార్కెట్‌లో ఆర్‌బీఐ ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకునే అవకాశం లేదని ట్రేడర్లు, స్పెక్యులేటర్లు భావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  
►బ్యాంకర్లు, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇది ఒక దశలో రూపాయిని 69.07 స్థాయికి సైతం పడగొట్టాయి.  
► గురువారం డాలర్‌ మారకంలో చైనా కరెన్సీ యువాన్‌ మారకపు  విలువ తగ్గింది. వాణిజ్య యుద్ధంలో పట్టు సాధించడానికి చైనా సెంట్రల్‌ బ్యాంకే ఈ నిర్ణయం తీసుకుందన్న వార్తలు వెలువడ్డాయి. దీనితో భారత్‌  కరెన్సీసహా పలు ఆసియా దేశాల కరెన్సీలు పతనమయ్యాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top