పావుశాతానికే ఉర్జిత్‌ మొగ్గు | Sakshi
Sakshi News home page

పావుశాతానికే ఉర్జిత్‌ మొగ్గు

Published Thu, Aug 17 2017 12:16 AM

పావుశాతానికే ఉర్జిత్‌ మొగ్గు - Sakshi

బ్యాంకులు ఇంకా ఎక్కువే తగ్గించొచ్చని అభిప్రాయం
ఎంపీసీ భేటీ మినిట్స్‌తో వెల్లడి


ముంబై: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ నెల 1–2వ తేదీల్లో జరిగిన సమావేశంలో గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ కేవలం 0.25 శాతం వరకే రేట్ల తగ్గింపు ఉండాలని తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించారు. ఆహార ధాన్యాల ధరలు తక్కువగా ఉండడం అసాధారణమని, ఇవి పెరిగేందుకు ఒత్తిళ్లు ఉన్నాయని అభిప్రాయపడిన ఆయన మోస్తరు రేట్ల కోతనే ఎంచుకున్నారు. నాటి సమావేశపు వివరాలు (మినిట్స్‌) తాజాగా వెల్లడయ్యాయి.

ద్రవ్యోల్బణేతర వృద్ధికి పాలసీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కచ్చితంగా బదిలీ చేయడం ఎంతో ముఖ్యమని ఉర్జిత్‌ పటేల్‌ పేర్కొన్నారు. బ్యాంకులకు ఇప్పటికీ రేట్లు తగ్గించేందుకు అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ఎంపీసీ సమావేశంలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా కీలకమైన రెపో, రివర్స్‌ రెపో రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే.

ఆరుగురు సభ్యులకు గాను నలుగురు పావు శాతం తగ్గింపునకు ఓటేయగా, ఒకరు అర శాతం తగ్గింపునకు అనుకూలంగా ఉన్నారు. మరొకరు తటస్థంగా ఉండిపోయారు. అయితే, పారిశ్రామిక, ఇతర వర్గాలు ఇంతకంటే ఎక్కువ తగ్గింపునే ఆశించాయి. ఇటీవలి కాలంలో ఆహార విభాగంలో ప్రతి ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని, సాధారణ వర్షాలే ఉన్నప్పటికీ ఈ విషయంలో మరింత సమాచారం అవసరమని పటేల్‌ అభిప్రాయపడ్డారు. రుణాల వృద్ధి కూడా తక్కువగా ఉండడానికి, మొండి బకాయిల ఒత్తిడే కారణమన్నారు. రుణ వృద్ధికి, పెట్టుబడుల పురోగతికి ఒత్తిడితో కూడిన బ్యాంకుల బ్యాలన్స్‌ షీట్లకు పరిష్కారం కనుగొనడం కీలకమైన అంశంగా పేర్కొన్నారు.   
 

Advertisement

తప్పక చదవండి

Advertisement