ఇక స్మార్ట్ఫోనే బ్యాంకు.. | raghuram Rajan gives a parting gift, turns your smartphone into a bank with UPI | Sakshi
Sakshi News home page

ఇక స్మార్ట్ఫోనే బ్యాంకు..

Aug 26 2016 12:39 AM | Updated on Nov 6 2018 5:26 PM

ఇక స్మార్ట్ఫోనే బ్యాంకు.. - Sakshi

ఇక స్మార్ట్ఫోనే బ్యాంకు..

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు... బ్యాంకు సేవలన్నీ అరచేతిలో ఇమిడిపోయినట్టే.

21 బ్యాంకుల కస్టమర్లకు యూపీఐ సేవలు
రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి...

ముంబై: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు... బ్యాంకు సేవలన్నీ అరచేతిలో ఇమిడిపోయినట్టే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలు పూర్తి స్థాయిలో 21 బ్యాంకుల కస్టమర్లకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఆయా బ్యాంకులకు సంబంధించిన యూపీఐ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో రానున్న మూడు రోజుల్లో అందుబాటులో ఉంటాయని, వాటిని డౌన్‌లోడ్ చేసుకుని సేవలు పొందవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) తెలిపింది. ఈ యాప్ ద్వారా ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తక్షణమే నగదు బదిలీ, అందుకోవడం సాధ్యపడుతుంది. ఏప్రిల్ 11 నుంచి ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా పరీక్షల అనంతరం పూర్తి స్థాయి సేవల ప్రారంభానికి ఆర్‌బీఐ తుది అనుమతి జారీ చేసింది.

 ప్లే స్టోర్‌లో ఉన్నవి ఇవే
ఆంధ్రాబ్యాంక్, యాక్సిక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, భారతీయ మహిళా బ్యాంక్, కెనరా బ్యాంక్, క్యాథోలిక్ సిరియన్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీజేఎస్‌బీ సహకారి బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. కర్ణాటక బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, విజయ బ్యాంకు, యెస్ బ్యాంక్. ఇంకా, ఐడీబీఐ, ఆర్‌బీఎస్ బ్యాంక్‌లు యాప్స్‌ను విడుదల చేయాల్సి ఉంది. అయితే, యూపీఐ ఆధారిత ఇతర బ్యాంకుల యాప్‌లలో ఏదో ఒకదాన్ని డౌన్‌లోడ్ చేసుకుని తమ ఖాతాను అనుసంధానించుకునే అవకాశం ఉంది.

యూపీఐ ప్రత్యేకత...
యూపీఐ సేవల కోసం కస్టమర్ తమ బ్యాంకు వద్ద నమోదు చేసుకోవాలి. కస్టమర్ మొబైల్ నంబర్‌తో మ్యాప్ చేస్తూ వారి పేరిట వర్చువల్ చిరునామా క్రియేట్ అవుతుంది. దీన్నే యూనిక్ ఐడీ అంటారు. దీంతో కస్టమర్లు క్షణాల్లో ఎవరికైనా నగదు బదిలీ చేసుకోవచ్చు. నగదు స్వీకరించవచ్చు. రూ.లక్ష వరకు నగదు చెల్లింపులు చేసుకోవచ్చు. ఒక విధంగా ఇది వ్యాలట్‌లా పనిచేస్తుంది. దుకాణాల్లో, ఈ కామర్స్ సంస్థల ద్వారా ఉత్పత్తులను ఇంటి వద్దే అందుకుని యాప్ ద్వారానే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ఇప్పటి వరకు థర్డ్ పార్టీ చెల్లింపుల కోసం ఖాతాదారుని పేరు, బ్యాంక్ పేరు, శాఖ, ఐఎఫ్‌ఎస్‌సీ వంటి వివరాలు అవసరం అవుతున్నాయి.

కానీ, యూపీఐ విధానంలో వీటితో పనిలేదు. ప్రతి ఒక్కరికీ వర్చువల్ ఐడీ ఉంటుంది. యూపీఐ యాప్ ఓపెన్ చేసి, నగదు మొత్తాన్ని టైప్ చేసి, వర్చువల్ ఐడీ నమోదు చేసి సెండ్ ఓకే చేయాల్సి ఉంటుంది. ఈ చెల్లింపును పూర్తి చేయడానికి యాప్ పిన్ అడుగుతుంది. దాన్ని ఇస్తే లావాదేవీ పూర్తయినట్టే. అలాగే, నగదు పొందాలనుకున్న వారు కూడా యూపీఐ ఆధారిత బ్యాంకు యాప్ ఓపెన్ చేసి ఎవరి నుంచి నగదు అందుకోవాలనుకుంటున్నారో వారి వర్చువల్ ఐడీ, నగదు మొత్తాన్ని టైప్ చేసి ఓకే చేయాలి. అప్పుడు అటువైపు వ్యక్తి యాప్‌లో నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేస్తే.. నగదు జమ అయిపోతుంది. నగదు లావాదేవీలను తగ్గించే లక్ష్యంతో ఆర్‌బీఐ ప్రస్తుత ఐఎంపీఎస్ విధానాన్ని ఆధునీకరించి యూపీఐను తీసుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement