
ఐటీ రిటర్న్ లో తప్పులు.. మళ్లీ దాఖలు చేయొచ్చా?
నేను ఇటీవలే ఐటీఆర్ దాఖలు చేశాను. అయితే స్టాక్ మార్కెట్లో వచ్చిన నష్టాలను...
నేను ఇటీవలే ఐటీఆర్ దాఖలు చేశాను. అయితే స్టాక్ మార్కెట్లో వచ్చిన నష్టాలను, ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయం తదితర వివరాలను ఐటీఆర్‌లో పేర్కొనడం మరచిపోయాను. సవరించిన ఐటీఆర్‌ను మళ్లీ దాఖలు చేయవచ్చా? దీనికేమైనా గడువుందా ?
-జగన్, హైదరాబాద్
మీరు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఏ విషయాన్నైనా తప్పుగా పేర్కొన్నా, ఏవైనా లోటుపాట్లున్నాయని మీరు భావించినా, సవరణలతో మీరు మళ్లీ ఐటీఆర్‌ను దాఖలు చేయవచ్చు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను గడువు తేదీలోగా అంటే ఈ ఏడాది ఆగస్టు 5లోపు దాఖలు చేసివుంటేనే మీరు సవరణలతో కూడిన ఐటీఆర్‌ను దాఖలు చేయడానికి వీలుంటుంది. ఇలా సవరణలతో కూడిన ఐటీఆర్‌ను వచ్చే ఏడాది మార్చి 31లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 5లోపు ఏ విధానంలో ఐటీఆర్‌ను సమర్పించారో, అదే విధానంలో సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయాలి.
నేను గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సావరిన్ గోల్డ్ బాండ్స్‌కు మార్చాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా? -ప్రశాంతి, విజయవాడ
పెట్టుబడులకు సంబంధించి గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోల్చితే సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉత్తమమని చెప్పవచ్చు. ఈ పుత్తడి బాండ్లపై 2.75 శాతం వడ్డీ వస్తుంది. ప్రతి ఆర్నెల్లకొకసారి మీరు ఈ వడ్డీ అందుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఆయా సంస్థలు 1 శాతం వరకూ నిర్వహణ చార్జీలు వసూలు చేస్తాయి. గోల్డ్ బాండ్లపై అలాంటి చార్జీలు లేవు. గోల్డ్ బాండ్స్ పెట్టుబడుల ఉపసంహరణపై ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. కానీ గోల్డ్ ఈటీఎఫ్‌లపై వచ్చే రాబడులపై స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ అంశాల దృష్ట్యా గోల్డ్ ఈటీఎఫ్‌ల కంటే కూడా సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉత్తమమైనవని చెప్పవచ్చు. తగిన కేవైసీ(నో యువర్ కస్టమర్) డాక్యుమెంట్లు సమర్పించి బ్యాంక్‌లు, పోస్టాఫీసుల్లో మీరు గోల్డ్ బాండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఒక్కో బాండ్ విలువ ఒక గ్రామ్ బంగారంతో సమానంగా ఉంటుంది. చిన్న ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా కనీస ఇన్వెస్ట్‌మెంట్ ఒక్క గ్రామ్‌కు తగ్గించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా మీరు 500 గ్రాముల విలువ వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ గోల్డ్ బాండ్ల కాలపరిమితి ఎనిమిది సంవత్సరాలు. ఐదేళ్ల తర్వాత ఈ బాండ్ల నుంచి వైదొలిగే ఆప్షన్ ఉంది. మీ అసలు ఇన్వెస్ట్‌మెంట్‌పై వార్షిక వడ్డీ 2.75 శాతంగా ఉంటుంది. వడ్డీని ఆరు నెలలకొకసారి చెల్లిస్తారు. ఈ బాండ్లు ఎక్స్చేంజీల్లో లిస్ట్ అవుతాయి. అంటే మెచ్యూరిటీకి ముందే మీకు డబ్బు అవసరమైన పక్షంలో మీరు సెకండరీ మార్కెట్లో ఈ బాండ్లను విక్రయించుకునే అవకాశముంది. అప్పటి మార్కెట్ ధర ప్రకారమే ఈ బాండ్లను విక్రయించుకోవచ్చు. ఈ బాండ్ల ఆధారంగా మీరు రుణాలు కూడా తీసుకోవచ్చు. ఈ బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మెచ్యురిటీ కాలం వరకూ కొనసాగిస్తే మూలధన లాభాల పన్ను (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) మినహాయింపు లభిస్తుంది. మెచ్యూరిటీకి ముందే బాండ్లను బదిలీచేస్తే ఇండెక్సేషన్ ప్రయోజనాలు లభిస్తాయి.
నేను అనుకోకుండా ఒక యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ రూ.3 లక్షల యులిప్ కాలపరిమితి 10 సంవత్సరాలు. తొలి ఏడాది ప్రీమియమ్ రూ.30,000 చెల్లించాను. ఈ పాలసీని రద్దు చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఎంత నష్టం వస్తుంది? -భవానీ శంకర్, విశాఖపట్టణం
ఆకర్షణీయమైన కమీషన్ల కారణంగా పలువురు ఏజెంట్లు యునిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్)ను ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. ఈ పాలసీ తీసుకున్న 15 రోజుల వరకూ ఫ్రీ-లుక్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలంలో మీరు వద్దనుకుంటే ఈ ప్లాన్‌ను రద్దు చేసుకోవచ్చు. ఈ 15 రోజుల కాలపరిమితి తీరిపోయింది కాబట్టి మీరు ఈ పాలసీని రద్దు చేసుకోలేరు. మీరు ఈ ప్లాన్‌ను సరెండర్ చేయవచ్చు. అయితే మీకు సొమ్ములు ఐదేళ్ల(ఈ ప్లాన్‌ల లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లు కాబట్టి) తర్వాతనే అందుతాయి.
అదీన్నూ ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించిన అన్ని చార్జీలను మినహాయించుకొని మీకు మిగిలిన మొత్తం చెల్లిస్తారు. బహుశా మీరు చెల్లించిన ప్రీమియమ్ మొత్తం మీరు నష్టపోవచ్చు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కలగలపకండి. జీవిత బీమా కోసం పూర్తిగా టర్మ్ ఇన్సూరెన్స్ పాల సీలు తీసుకోవాలి. ఈ తరహా ప్లాన్‌లలో బీమా కవరేజీ అధికంగానూ, ప్రీమియమ్ తక్కువగానూ ఉంటుంది. ఇక ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్), మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి.
నాకు ఈమధ్య పెళ్లి అయింది. నా భార్య ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయడం లేదు. పెళ్లికి ముందే నేను నా పేరు మీద ఒక ప్రజా భవిష్య నిధి(పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్- పీపీఎఫ్) ఖాతా తెరిచాను. ఏడాదికి రూ.లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నా భార్య పేరు మీద మరో పీపీఎఫ్ ఖాతా తెరవవచ్చా? నా భార్యకు చెందిన పీపీఎఫ్ ఖాతాలో కూడా రూ. లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చా? ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నాకేమైనా పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? -నాని, గుంటూరు
మీరు మీ భార్య పేరు మీద పీపీఎఫ్ ఖాతా తెరవవచ్చు. ఈ ఖాతాలో మీరు డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. కానీ ఆమెకు పన్ను వర్తించే ఆదాయమేదీ లేనందున ఈ పీపీఎఫ్ ఖాతాపై ఆమెకు ఎలాంటి పన్ను ప్రయోజనాలు లభించవు. అంతే కాకుండా ఆమె పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు ఎలాంటి పన్ను ప్రయోజనాలు లభించవు.