ఆర్థిక వ్యవస్థపై ‘రాజకీయ’ నీడ!

politics effect on Economy - Sakshi

వచ్చే ఏడాది మూడు కీలక రాష్ట్రాల ఎన్నికలు...

బడ్జెట్‌లో ప్రజాకర్షక నిర్ణయాలకు ఆస్కారం...

అసోచామ్‌ నివేదికలో అంచనా...  

న్యూఢిల్లీ: రానున్న ఏడాదిన్నర కాలంలో ఆర్థిక వ్యవస్థపై రాజకీయ అంశాల ప్రభావం అధికంగా ఉండొచ్చని పారిశ్రామిక మండలి అసోచామ్‌ పేర్కొంది. ప్రధానంగా 2018లో పలు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటమే దీనికి కారణమని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో 2018 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో పలు ప్రజాకర్షక నిర్ణయాలకు ఆస్కారం ఉందని కూడా అభిప్రాయపడింది.

‘2019 లోక్‌ సభ ఎన్నికలకు ముందు వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికల ప్రీ–ఫైనల్స్‌ జరగబోతున్నాయి. ఇందులో రాజస్తాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పలు ప్రజాకర్షక చర్యలను ప్రకటించడం ఖాయం’ అని అసోచామ్‌ పేర్కొంది. ఇక ప్రజలపై ప్రతికూల సెంటిమెంటుకు దారితీసే కార్మిక చట్టాల ప్రక్షాళన వంటి కఠిన సంస్కరణలకు ఆస్కారం లేదని దేశీ కార్పొరేట్లు భావిస్నున్నాయని తెలిపింది.

జీఎస్‌టీ రేట్లు మరింత తగ్గొచ్చు...
ప్రస్తుత రాజకీయ–ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తే... వస్తు–సేవల పన్ను(జీఎస్‌టీ) రేట్లలో రానున్న రోజుల్లో మరింత స్థిరీకరణకు ఆస్కారం ఉందని అసోచామ్‌ అభిప్రాయపడింది. పన్ను రేట్లల్లో ఇంకాస్త తగ్గుదల ఉండొచ్చని పేర్కొంది. ‘వ్యాపార వర్గాలకు జీఎస్‌టీ జమానా మింగుడుపడటం లేదు. తాజా గుజరాత్‌ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షాలన్నీ దీన్నే తమ అస్త్రంగా మలచుకున్నాయి. వచ్చే ఏడాది కీలక రాష్ట్రాల ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటంతో కేంద్రం దీనిపై దృష్టిసారించే అవకాశం ఉంది.

బడ్జెట్‌ ప్రతిపాదనల్లో చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్‌ఎంఈ)లకు కూడా ఊతం లభించవచ్చు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారీగా ఉద్యోగాలను కల్పించే విషయంలో మోదీ సర్కారు కొంత ఆందోళనకు గురవుతోంది. అందుకే వీటికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నాం. ఇక రైతులు, గ్రామీణ రంగాలు, వ్యవసాయ ఆధార మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి అనేక చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంతో ముడిపడిన కంపెనీలకు ఇది చాలా ప్రయోజనకరమైన అంశం’ అని అసోచామ్‌ వివరించింది.  

గత వారం హీరోలు

ఎందుకు పెరిగాయంటే...
హైదరాబాద్‌ ప్లాంట్‌కు అమెరికా ఎఫ్‌డీఏ నుంచి ఈఐఆర్‌ను పొందడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ఫార్మా షేర్‌ 9 శాతం దూసుకుపోయింది. వాహనాల ధరలను 3 శాతం వరకూ పెంచనుండటంతో మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 7 శాతం ఎగసింది. గతంలో పెట్‌కోక్‌ వినియోగంపై విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్ట్‌ తొలగించడంతో పెట్‌కోక్‌ను ఇంధనంగా వినియోగించే అల్ట్రాటెక్‌ సిమెంట్, శ్రీ సిమెంట్‌ వంటి సిమెంట్‌ రంగ షేర్లు 3–4 శాతం రేంజ్‌లో పెరిగాయి.

గత వారం జీరోలు

ఎందుకు తగ్గాయంటే...
భారతీ ఎయిర్‌టెల్‌ వాటా విక్రయం కారణంగా ఈ వారం కూడా భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ నష్టాలు కొనసాగాయి. సెన్సెక్స్‌ నుంచి తొలగిస్తుండటంతో సిప్లా షేర్‌ 5% పతనమైంది. అంతకు ముందటి వారం  బాగా పెరిగిన నేపథ్యంలో గత వారం లాభాల స్వీకరణతో అశోక్‌ లేలాండ్, సెయిల్, బ్రిటానియా  ఇండస్ట్రీస్, పిరమళ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 3–4 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. నిధుల సమీకరణ వ్యయం వచ్చే ఏడాది పెరుగుతుందన్న ఆర్‌ఈసీ సీఎండీ వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్‌ఈసీ షేర్‌ 4% పడింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top