జీఎస్‌పీసీని సగం ధరకే కొన్నాం..

ONGC bought GSPC gas field stake for half the asking price - Sakshi

ఓఎన్‌జీసీ మాజీ చైర్మన్‌ డీకే సరాఫ్‌

న్యూఢిల్లీ: కేజీ–బేసిన్‌ క్షేత్రంలో గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (జీఎస్‌పీసీ) వాటాలు, హెచ్‌పీసీఎల్‌ కొనుగోలు డీల్స్‌ను ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ మాజీ చైర్మన్‌ డీకే సరాఫ్‌ సమర్ధించుకున్నారు. కేజీ బేసిన్‌ క్షేత్రంలోని దీన్‌దయాళ్‌ బ్లాక్‌లో జీఎస్‌పీసీ వాటాలను మార్కెట్‌ రేటుకన్నా సగానికే కొనుగోలు చేసినట్లు వివరించారు. ఈ వాటాలకు రూ. 20,000 కోట్లు పలుకుతుండగా, ఓఎన్‌జీసీ రూ. 8,000 కోట్లకే (1.2 బిలియన్‌ డాలర్లు) కొన్నట్లు పేర్కొన్నారు.

దశాబ్దాలుగా చమురు, గ్యాస్‌ ఉత్పత్తి వ్యాపారంలో ఉన్న ఓఎన్‌జీసీ .. సరైన అవకాశం లభించడంతోనే జీఎస్‌పీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అలాగే, హెచ్‌పీసీఎల్‌లో మెజారిటీ వాటాల కొనుగోల వల్ల ఉత్పత్తి కంపెనీ ధరలపరంగా ఎదుర్కొనే రిస్కుల్లో కొంత భాగాన్ని హెడ్జింగ్‌ చేసుకునేందుకు వీలు లభించినట్లయిందని సరాఫ్‌ చెప్పారు.

భారీ రుణభారమున్న జీఎస్‌పీసీని గట్టెక్కించడానికి, హెచ్‌పీసీఎల్‌లో వాటాల విక్రయంతో డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాలను సాధించడానికి ఈ డీల్స్‌ కుదుర్చుకునేలా ఓఎన్‌జీసీపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సరాఫ్‌ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. సరాఫ్‌ ఓఎన్‌జీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే ఈ రెండు ఒప్పందాలు కుదిరాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top