ఆ కంపెనీలో వారానికి మూడు వీక్‌ ఆఫ్‌లు.. | Microsoft Japan Brings In Three Day Weekends | Sakshi
Sakshi News home page

ఆ కంపెనీలో వారానికి మూడు వీక్లీ ఆఫ్‌లు..

Nov 4 2019 1:49 PM | Updated on Nov 4 2019 1:58 PM

Microsoft Japan Brings In Three Day Weekends - Sakshi

తమ ఉద్యోగులకు వారానికి మూడు వీక్‌ఆఫ్‌లు అమలు చేసిన టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ మెరుగైన ఉత్పాదకతను రాబట్టింది

టోక్యో : ఉద్యోగులతో వీలైనంత ఎక్కువ సమయం పనితీసుకుని లాభాలు దండుకోవచ్చనే ఆలోచన ఏమాత్రం పసలేనిదని మరోసారి తేటతెల్లమైంది. వారాంతంలో బహుళజాతి కంపెనీలు రెండు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వడం మొదలైన తర్వాత ఉత్పాదకత పెరగడం గమనించిన కార్పొరేట్‌ కంపెనీలు ఇప్పుడు వారానికి మూడు రోజుల ఆఫ్‌ను పరిశీలిస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్‌ జపాన్‌లో తమ ఉద్యోగులకు శుక్ర, శని, ఆదివారాలు మూడు రోజుల వీక్‌ఆఫ్‌ను ప్రకటించి మెరుగైన ఫలితాలు రాబట్టింది. ఉద్యోగులు తమ ఇంటి, కార్యాలయ పనుల మధ్య సమతూకం పాటించేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్‌ ఒక నెలపాటు 2300 మంది ఉద్యోగులకు మూడు రోజుల వీకెండ్‌ను ప్రవేశపెట్టింది. వర్కింగ్‌ రిఫామ్‌ ప్రాజెక్టు కింద ఉద్యోగులకు ఇచ్చిన ఈ వెసులుబాటు అద్భుత ఫలితాలను రాబట్టింది.

మూడు రోజుల వీకెండ్‌ ఫలితంగా ఉద్యోగులు అందించిన ఉత్పాదకత ఏకంగా 39.9 శాతం పెరిగింది. ఉత్పాదకత పెరగడంతో పాటు అదనంగా ఇచ్చిన మరో వీక్‌ఆఫ్‌తో 23.1 శాతం విద్యుత్‌ ఆదా అవడం సంస్థకు కలిసివచ్చింది. వారంలో నాలుగు రోజులే పనిచేయడంతో లక్ష్యాలను పూర్తిచేసేందుకు సమావేశాలను రద్దు చేయడం, ముఖాముఖి భేటీల స్ధానంలో వర్చువల్‌ సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలతో ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. నెలరోజల పాటు పైలట్‌ ప్రాజెక్టుగా అమలైన వారానికి మూడు రోజుల సెలవు తమకు చాలా సంతృప్తికరంగా ఉందని 92.1 శాతం మంది ఉద్యోగులు సంబరపడుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో  మరోసారి ఈ తరహా నాలుగు రోజుల పనిదినం పద్దతిని పరిశీలించేందుకు మైక్రోసాఫ్ట్‌ సంసిద్ధమైంది. మరోవైపు సాధారణ వ్యాపారాలకు మైక్రోసాఫ్ట్‌ భిన్నంగా ఉంటుందని, ఇది అన్ని కార్యాలయాల్లో మెరుగైన ఫలితాలు ఇస్తుందని చెప్పలేమని నిపుణులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement