లిమ్కా బుక్స్‌లో మేఘా ఇంజనీరింగ్‌ 

Megha Engineering enters Limca records for fastest execution - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మరో ఘనతను సాధించింది. లిమ్కా బుక్‌ ఆఫ్‌ నేషనల్‌ రికార్డ్స్‌తోపాటు ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను రికార్డు సమయంలో ఏడు నెలల్లోపే నిర్మించడంతో సంస్థకు ఈ గౌరవం దక్కింది. మేఘా పనితీరును మెచ్చి పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ‘బెస్ట్‌ డెబ్యూటెంట్‌ అవార్డు’తో సత్కరించింది. ‘అనంతపురం జిల్లా నంబూలపూలకుంట వద్ద 400/220 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణం 2015 సెప్టెంబరు 25న ప్రారంభించి, 2016 ఏప్రిల్‌ 25న ప్రారంభానికి సిద్ధం చేశాం. ఇటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి సాధారణంగా 15–18 నెలలు పడుతుంది. 18–20 నెలల్లో పూర్తి చేయాలని పవర్‌ గ్రిడ్‌ కోరింది. 3 షిఫ్టుల్లో సిబ్బందిని మోహరించి గడువు కంటే ముందే నిర్మించాం’ అని మేఘా డైరెక్టర్‌ బి.శ్రీనివాస్‌ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.  

అడ్డంకులను అధిగమించి.. 
నిర్మాణ ప్రాంతం ఎక్కువగా రాళ్లతో కూడి ఉందని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ శరధ్‌ దీక్షిత్‌ వివరించారు. ఆధునిక బ్లాస్టింగ్‌ పరిజ్ఞానాన్ని వినియోగించి రాళ్లను తొలగించామన్నారు. ‘సబ్‌ స్టేషన్‌ నుంచి సాంకేతిక సమస్యలు లేకుండా మూడేళ్లుగా నిరంతరం విద్యుత్‌ సరఫరా అవుతోంది. ఈ ప్రాజెక్టును ఉద్ధేశించి పవర్‌ గ్రిడ్‌ తన వెబ్‌సైట్లో మరో ముందడుగుగా అభివర్ణించింది’ అని తెలిపారు. కాగా, పట్టిసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్‌ రికార్డు సమయంలో పూర్తి చేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఇప్పటికే స్థానం దక్కించుకుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top