
న్యూఢిల్లీ: భూషణ్ స్టీల్ టేకోవర్ కోసం లిబర్టీ హౌస్ దాఖలు చేసిన బిడ్‌ను రుణదాతల కమిటీ (సీఓసీ) తిరస్కరించింది. బిడ్‌లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 8 అని, కానీ ఇంగ్లండ్‌కు చెందిన లిబర్టీ హౌస్ ఈ నెల 20న బిడ్‌ను దాఖలు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అందుకే రుణదాతల కమిటీ లిబర్టీ బిడ్‌ను తిరస్కరించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇక భూషణ్ స్టీల్ రేసులో టాటా స్టీల్, జీఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలే మిగిలాయి.
బుధవారం జరిగిన సమావేశంలో ఈ రెండు కంపెనీల బిడ్‌ల వివరాలను సీఓసీకి నివేదించడం జరిగిందని, న్యాయ సలహాదారులు ఈ బిడ్‌లను మదింపు చేస్తున్నారని సమాచారం. వచ్చే నెల 6న జరిగే సీఓసీ సమావేశంలో భూషణ్ స్టీల్ ఎవరి పరమయ్యేది వెల్లడవుతుంది. అయితే సంబంధిత పరిణామాలపై వ్యాఖ్యానించడానికి రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్‌పీ) మహేందర్ కుమార్ నిరాకరించారు. భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ రుణ దాతలకు రూ.45,000 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. రుణ దాతలకు రూ.17,000 కోట్లు, భూషణ్ స్టీల్ కార్యకలాపాల కోసం రూ.7,200 కోట్లు ఇవ్వడానికి టాటా స్టీల్ ఆఫర్ చేసిందని సమాచారం.