బడ్జెట్‌ ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత

Investors alert before the budget - Sakshi

సూచీలు అక్కడక్కడే.. 
గురు, శుక్రవారాల్లో ఎఫ్‌అండ్‌వో ఎక్స్‌పైరీ, అమెరికా ఫెడ్‌ రేట్లపై నిర్ణయం, కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండటం తదితర అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొత్త పొజిషన్లకు దూరంగా ఉంటున్నారు. దీంతో కీలకమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు బుధవారం పెద్దగా మార్పులు లేకుండా ముగిశాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 1.25 పాయింట్లు నష్టపోయి 35,591.25 వద్ద, నిఫ్టీ 0.40 పాయింట్లు నష్టపోయి 10,651.80 వద్ద క్లోజయ్యాయి.

దాదాపు అయిదు శాతం పైగా ఎగిసిన ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్‌ వంటి దిగ్గజాలు.. సూచీలు భారీగా పడిపోకుండా కాస్త అడ్డుకట్ట వేశాయి.  ‘అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ భయాలు, ఫెడ్‌ సమావేశం, బడ్జెట్‌ వంటి అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు‘ అని విశ్లేషకులు తెలిపారు. బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం ఏయే రంగాలకు ఊతం లభించనుంది, ప్రభుత్వం నిధులెలా సమకూర్చుకుంటుంది తదితర అంశాలన్నింటిపైనా ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉంటారని పేర్కొన్నారు.  

మెటల్, బ్యాంకింగ్‌ స్టాక్స్‌ ర్యాలీ... 
బుధవారం 200 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ 359 పాయింట్ల శ్రేణిలో తిరుగాడింది. రంగాలవారీగా చూస్తే మెటల్, బ్యాంకింగ్‌ స్టాక్స్‌ పెరగ్గా.. ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ స్టాక్స్‌లో అమ్మకాలు జరిగాయి. స్మాల్‌క్యాప్‌ సూచీ 0.78 శాతం,  మిడ్‌క్యాప్‌ సూచీ 0.22 శాతం పెరిగాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ అత్యధికంగా 6.05 శాతం పెరగ్గా, ఆగ్నేయాసియా వ్యాపార విక్రయంతో రుణభారం తగ్గుతుందన్న వార్తలతో టాటా స్టీల్‌ 5.14 శాతం పెరిగాయి.  

యాక్సిస్‌ జూమ్‌: మెరుగైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు 4.56% పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 7,745 కోట్లు ఎగిసి రూ. 1,77,563 కోట్లకు చేరింది. బీఎస్‌ఈలో సుమారు 18 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 4 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఇక హెచ్‌సీఎల్‌ టెక్, బజాజ్‌ ఫైనాన్స్, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, వేదాంత మొదలైనవి సుమారు మూడు శాతం దాకా పెరిగాయి. అటు బజాజ్‌ ఆటో, కోటక్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యస్‌ బ్యాంక్‌ మొదలైనవి 2.64 శాతం మేర క్షీణించాయి. 

రీట్స్, ఇన్విట్స్‌పై సెబీ సంప్రతింపుల పత్రం
వీటిని మరింత ఆకర్షణీయం చేసేందుకు యత్నాలు  రీట్స్, ఇన్విట్స్‌కు సంబంధించి నిబంధనలను మరింత సరళీకరించాలని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ యోచిస్తోంది. నిధుల  సమీకరణ విషయంలో వీటిని జారీచేసే సంస్థలకు మరింత వెసులుబాటును ఇవ్వడమే కాకుండా, వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడానిఇక ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి గాను నిబంధనలను మరింతగా సడలించాలని సెబీ ఆలోచిస్తోంది. దీని కోసం ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. వచ్చే నెల 18 వరకూ ఈ పత్రంపై అభిప్రాయాలు సేకరిస్తారు. తదనంతరం తుది నిబంధనలను విడుదల చేస్తారు.  2014లో రీట్స్, ఇన్విట్స్‌కు అనుమతి ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకూ మూడు ఇన్విట్స్‌ మాత్రమే లిస్ట్‌ కాగా, ఒక రీట్‌ ఐపీఓకు సిద్దమవుతోంది. 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top