‘అభివృద్ధి’లో ఈ తప్పుడు లెక్కలు ఏమిటి?

India's economic growth figures raise doubts  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో దేశాభివృద్ధి అంటే జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రేటు 7.3 శాతమని, అంతకుముందు యూపీఏ ప్రభుత్వం హయాంలో ఈ జీడీపీ రేటు 6.7 శాతంగా ఉందని ‘సెంట్రల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌’, నీతి అయోగ్‌ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు అనుసరించిన ఆర్థిక సూత్రం లెక్కల  ప్రకారం యూపీఏ హయాంలో జీడీపీ వద్ధిరేటు 7.75 ఉండగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పన్ను కారణంగా జీడీపీ రేటు 5.7కు పడిపోయిందని తేలింది. ఈ లెక్కలను మోదీ ప్రభుత్వం తప్పని తిరస్కరించడమే కాకుండా జీడీపీని లెక్కిస్తున్న సూత్రమే తప్పని తేల్చింది. మరో ఆర్థిక సూత్రాన్ని అనుసరించి కొత్త జీడీపీ రేటును లెక్కించాల్సిందిగా సెంట్రల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ను మోదీ ప్రభుత్వం ఆదేశించింది.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీడీపీ రేటును లెక్కించాలని ప్రభుత్వం పెద్దలు ముందుగా సూచించారు. కొత్త ఆర్థిక సూత్రం ప్రకారం జీడీపి రేటును లెక్కించాల్సి వచ్చినప్పుడు అంతకుముందు ఐదేళ్ల క్రితం జీడీపీ రేటు ఎంత ఉందో కూడా లెక్కించడం చట్ట ప్రకారం తప్పనిసరని అధికారులు, ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో అలాగే కానిమ్మని మోదీ ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ఆర్థిక సూత్రం ప్రకారం మోదీ ప్రభుత్వం హయాంలో జీడీపీ రేటు 7.6 శాతం ఉన్నట్లు తేలింది. అంతకుముందు ఐదేళ్ల క్రితం అంటే, యూపీఏ ప్రభుత్వం హయాంలో జీడీపీ రేటు 10.1 శాతం ఉన్నట్లు తేలింది. ఈ వివరాలను వెల్లడించడం కోసం నవంబర్‌ 12వ తేదీన సీఎస్‌ఓ పత్రికా విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎలాంటి కారణం చెప్పకుండా హఠాత్తుగా నాడు ఆ విలేకరుల సమావేశాన్ని రద్దు చేసింది. అంతకుముందు సీఎస్‌ఓ వెబ్‌సైట్లో పేర్కొన్న యూపీఏ హయంలోని జీడీపి రేటు 10.1 శాతాన్ని తొలగించింది.

ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చైర్మన్‌గా వ్యవహరించే ‘నీతి అయోగ్‌’ సీఎస్‌ఓతో కలిసి భారత జీడీపీ రేటు అంచనాలకు కసరత్తు చేసింది. నీతి ఆయోగ్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫామ్‌ ఇండయా)వైస్‌ చైర్మన్‌ను ప్రభుత్వం నియమిస్తుంది. ప్రస్తుతం ఆ పదవిలో రాజీవ్‌ కుమార్‌ కొనసాగుతున్నారు. ఇలా ప్రభుత్వం చేతుల్లో ఉండే రాజకీయ విభాగం సీఎస్‌ఓ లెక్కల్లో జోక్యం చేసుకోవడం ఏమిటో! సంప్రదాయం ప్రకారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించాల్సిందిపోయి ఓ ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించడం ఏమిటో, అప్పోడోరకం, ఇప్పుడోరకం లెక్కలేమిటో విజ్ఞులకే తెలియాలి?

ఏదోరకంగా నరేంద్ర మోదీ హయాంలో జరిగిన జీడీపీ రేటును లెక్కించడానికి లేదా అంచనా వేయడానికి ప్రభుత్వానికి మూడేళ్లు పట్టింది. రఘురామ్‌ రాజన్‌ నుంచి అర్వింద్‌ పనగారియా వరకు, ఆ మాటకొస్తే మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్‌ సుబ్రమణియం లాంటి మహా మహా ఆర్థిక నిపుణలు మోదీ హయాంలోనే పనిచేశారు. వారిలో ఎవరిని అడిగినా చిటికలో లెక్కలు తేల్చేవారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top