ఐఓసీ నికర లాభం  రూ.6,099 కోట్లు 

Indian Oil Corporation Q4 results today; here's what analysts expect - Sakshi

17% వృద్ధి  

తగ్గిన రిఫైనరీ మార్జిన్‌  

ఆదుకున్న ఇన్వెంటరీ, కరెన్సీ మారకం లాభాలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.6,099 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం రూ.5,218 కోట్లతో పోలిస్తే 17 శాతం వృద్ధి సాధించామని ఐఓసీ తెలిపింది. షేర్‌ వారీ ఆర్జనను చూస్తే నికర లాభం రూ.5.51 నుంచి రూ.6.46కు పెరిగిందని ఐఓసీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. రిఫైనరీ మార్జిన్లు తక్కువగా ఉన్నా, ఇన్వెంటరీ లాభాలు, కరెన్సీ మారకంలో లాభాలు కారణంగా నికర లాభం  ఈ స్థాయిలో పెరిగిందని           వివరించారు. స్థూల రిఫైనరీ మార్జిన్‌ (జీఆర్‌ఎమ్‌–బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చడం వల్ల వచ్చే మార్జిన్‌) 9.12 డాలర్ల నుంచి 4.09 డాలర్లకు తగ్గిందని తెలిపారు. టర్నోవర్‌ రూ.1.36 లక్షల కోట్ల నుంచి రూ.1.44 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.    

ఇన్వెంటరీ లాభాలు రూ.4,172 కోట్లు.. 
అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.676 కోట్ల కరెన్సీ మారకం నష్టాలు రాగా, గత క్యూ4లో రూ.837 కోట్ల కరెన్సీ మారకం లాభాలు వచ్చాయని  సంజీవ్‌ సింగ్‌  తెలిపారు. అయితే ఇన్వెంటరీ లాభాలు మాత్రం రూ.4,172 కోట్ల నుంచి రూ.2,655 కోట్లకు తగ్గాయని వివరించారు. ముడి చమురును ఈ కంపెనీ కొనుగోలు చేసిన ధర కంటే, ఈ చమురును ప్రాసెస్‌ చేసి ఇంధనంగా రిఫైనరీలకు సరఫరా చేసే సమయానికి ధర అధికంగా ఉంటే, వచ్చే లాభాలను ఇన్వెంటరీ లాభాలుగా పరిగణిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ, కిరోసిన్‌ సబ్సిడీలు చెల్లించడంలో జాప్యం జరుగుతుండటంతో రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని, కంపెనీ రుణభారం రూ.86,359 కోట్లకు పెరిగిందని కంపెనీ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) ఏ.కె. శర్మ తెలిపారు. కేంద్రం నుంచి వంట ఇంధనం సబ్సిడీలు రూ.19,000 కోట్లు రావలసి ఉన్నాయని వివరించారు.  
ఏడాది లాభం 21 శాతం డౌన్‌.... 
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.21,346 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 21 శాతం తగ్గి రూ.16,894 కోట్లకు తగ్గిందని సింగ్‌ తెలిపారు. టర్నోవర్‌ మాత్రం రూ.5.06 లక్షల కోట్ల నుంచి రూ.6.05 లక్షల కోట్లకు ఎగసిందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐఓసీ షేర్‌0.7 శాతం నష్టంతో రూ.150 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top