పెద్ద టీవీలకు క్రికెట్‌ జోష్‌!

ICC World Cup Helps To Big Screen TV Sales Increase - Sakshi

ప్రపంచ కప్‌తో 100 శాతం పెరిగిన అమ్మకాలు

మెట్రోలతో పాటు చిన్న పట్టణాల్లోనూ భారీ విక్రయాలు

ధర రూ. 50 వేల పైనే.. 

న్యూఢిల్లీ : క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు వర్షాల దెబ్బతో అభిమానులను నిరాశపరుస్తున్నా.. టీవీల అమ్మకాలకు మాత్రం బాగానే ఉపయోగపడుతున్నాయి. క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ పుణ్యమాని పెద్ద టీవీల అమ్మకాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. క్రికెట్‌ అభిమానులు భారీ స్క్రీన్‌లపై మ్యాచ్‌లను చూసేందుకు ఆసక్తి కనపరుస్తుండటమే ఇందుకు కారణం. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే సోనీ, శామ్‌సంగ్, ఎల్‌జీ, పానాసోనిక్‌ తదితర కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీల పెద్ద టీవీల (55 అంగుళాలు, ఆ పైన) అమ్మకాలు 100 శాతం దాకా పెరగడం దీనికి నిదర్శనం. కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరి మితం కాకుండా హుబ్లి, జబల్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, కొచి, నాగ్‌పూర్‌ వంటి చిన్న పట్టణాళ్లో కూడా ఈ ధోరణి కనిపిస్తోంది. మ్యాచ్‌లు నాకవుట్‌ రౌండ్స్‌ స్థాయికి వచ్చే సరికి పెద్ద టీవీల అమ్మకాలు మరింతగా పుంజుకోగలవని కంపెనీలు ఆశిస్తున్నాయి. ఆకర్షణీయ ఆఫర్లు, సులభతరమైన ఫైనాన్సింగ్, క్యాష్‌బ్యాక్‌లు మొదలైనవి ఇందుకు ఊతంగా ఉండగలవని భావిస్తున్నాయి. ఎన్ని యూనిట్స్‌ అమ్ముడైనదీ ఇథమిత్థంగా ఏ సంస్థా వెల్లడించకపోయినప్పటికీ.. విక్రయాల వృద్ధి రెట్టింపైనట్లు మాత్రం చెబుతున్నాయి. ఇంగ్లాండ్‌లో మే 30న ప్రారంభమైన ఐసీసీ వరల్డ్‌ కప్‌ జూలై 14 దాకా కొనసాగనుంది.  

లక్ష్యం పెంపు.. 
‘ప్రపంచ కప్‌ ప్రారంభమైనప్పట్నుంచీ పెద్ద స్క్రీన్స్‌.. ముఖ్యంగా 55 అంగుళాల కన్నా పెద్దవి, 4కే టీవీల అమ్మకాలు 100 శాతం ఎగిశాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే రెట్టింపు స్థాయికి చేరాయి‘ అని సోనీ ఇండియా బ్రావియా బిజినెస్‌ విభాగం హెడ్‌ సచిన్‌ రాయ్‌ తెలిపారు. వరల్డ్‌ కప్‌లో భారత్‌ టీమ్‌ ముందుకెళ్లే కొద్దీ టీవీల విక్రయాలూ పెరగగలవని శాంసంగ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ వ్యాపార విభాగం) రాజీవ్‌ భుటాని చెప్పారు. ‘మే నెలలో 55 అంగుళాలకు పైబడిన టీవీల (క్యూఎల్‌ఈడీలు సహా) అమ్మకాలు రెట్టింపయ్యాయి. 75 అంగుళాలు అంతకు మించిన టీవీల విక్రయాలు 5 రెట్లు పెరిగాయి. ఈ ప్రపంచ కప్‌ సీజన్‌లో పెద్ద స్క్రీన్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను ఇది సూచిస్తోంది‘ అని ఆయన తెలిపారు. మరోవైపు కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఇలాంటి క్రీడా సంరంభాలు అనువైన సమయంగా ఉంటాయని పానాసోనిక్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌ (కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగం) శరత్‌ నాయర్‌ తెలిపారు. ‘55 అంగుళాలు, అంతకు మించిన పెద్ద టీవీల విక్రయాల ఊతంతో వరల్డ్‌ కప్‌ 2019 సీజన్‌లో మా అమ్మకాలు 25 శాతం పెంచుకోవాలని నిర్దేశించుకున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఎల్‌జీ కూడా తమ ప్రీమియం టీవీల విభాగంలో ఇలాంటి ధోరణే ఉన్నట్లు తెలిపింది. ‘థింక్‌ ఏఐ ఫీచర్‌ గల స్మార్ట్‌ టీవీల అమ్మకాల్లో 35 శాతం వద్ధి అంచనా వేస్తున్నాం. ఓఎల్‌ఈడీ, నానోసెల్‌ టీవీల విక్రయాల్లోనైతే 200 శాతం వద్ధి అంచనాలు ఉన్నాయి‘ అని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ప్రతినిధి తెలిపారు.  

రూ. 60 లక్షల దాకా రేటున్న టీవీలు.. 
పేరొందిన బ్రాండ్స్‌ పెద్ద టీవీల ధర రూ. 50,000 నుంచి రూ. 1.75 లక్షల మధ్య ఉంటున్నాయి. ఇక కొన్ని మోడల్స్‌ రేట్లు మరింత ఎక్కువగా కూడా ఉంటున్నాయి. ఇటీవలే శాంసంగ్‌ సంస్థ 8కే యూహెచ్‌డీ టీవీని ప్రవేశపెట్టింది. దీని ధర ఏకంగా రూ. 10.99 లక్షల నుంచి రూ. 59.99 లక్షల దాకా ఉంది. గణాంకాల ప్రకారం దేశీ టీవీ మార్కెట్‌లో ఏటా 1.25 కోట్ల టీవీలు అమ్ముడవుతున్నాయి. వీటిలో 15 శాతం వాటా పెద్ద టీవీలది ఉంటోంది.  

ఆఫర్ల జోరు.. 
ఈ సెగ్మెంట్‌లో ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ అమ్మకాల వాటానే ఎక్కువగా ఉంటున్నా, ఆన్‌లైన్‌ సేల్స్‌ కూడా పుంజుకుంటున్నాయని టీవీ కంపెనీలు వెల్లడించాయి. విక్రయాలను పెంచుకునేందుకు బ్రాండింగ్, ప్రమోషన్స్‌ కార్యకలాపాలపై కూడా సంస్థలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. ‘టోర్నమెంట్‌లో భారత్‌ ముందుకు వెళ్లే కొద్దీ.. మరింత మంది వీక్షకులు పెద్ద టీవీల వైపు మళ్లే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అందుకే మేం జీరో డౌన్‌ పేమెంట్‌ ఫైనాన్స్‌తో పాటు క్యూఎల్‌ఈడీ టీవీలపై పదేళ్ల నో స్క్రీన్‌ బర్న్‌–ఇన్, ప్యానెల్స్‌పై రెండేళ్ల వారంటీ, 15% దాకా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ఇస్తున్నాం. అలాగే ప్రీమియం క్యూఎల్‌ఈడీ టీవీల కొనుగోలుదారులకు ఉచితంగా అమెజాన్‌ ఎకో ప్లస్, 4కే యూహెచ్‌డీ టీవీతో అమెజాన్‌ ఎకో డాట్‌ ఫ్రీగా ఇస్తున్నాం‘ అని భుటాని తెలిపారు. తామూ అకర్షణీయమైన ఫైనాన్స్‌ ఆఫర్లు అందిస్తున్నట్లు రాయ్‌ వివరించారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top