మార్కెట్ల ఈ ర్యాలీ నిలుస్తుందా?

How market rallies in near future: experts opinion - Sakshi

కార్పొరేట్‌ ఫలితాలపై లాక్‌డవున్‌ ఎఫెక్ట్‌

ఈపీఎస్‌ డౌన్‌గ్రేడ్స్‌తో ప్రీమియంలో నిఫ్టీ

2008 జనవరి గరిష్టాల స్థాయిలో మార్కెట్లు

గణాంకాలు, రిస్క్‌ సామర్థ్యం పెరిగితే ర్యాలీ

బ్రోకింగ్‌ సంస్థ జెఫరీస్‌ రీసెర్చ్‌ నోట్‌ వెల్లడి

కొద్ది రోజులుగాదేశీ స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న ర్యాలీ కారణంగా షేర్లు అధిక ధర పలుకుతున్నాయని బ్రోకింగ్‌ సంస్థ జెఫరీస్‌ పేర్కొంటోంది. కోవిడ్‌-19 కట్టడికి లాక్‌డవున్‌లను అమలు చేస్తున్న నేపథ్యంలో పలు కంపెనీల లాభార్జన నీరసించనున్నట్లు తెలియజేసింది. దీంతో షేరువారీ ఆర్జన(ఈపీఎస్‌)లు డౌన్‌గ్రేడ్‌ కానున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 19.7 రెట్లు ప్రీమియంలో ట్రేడవుతున్నట్లు తెలియజేసింది. అంటే దాదాపు 2008 జనవరి గరిష్టాల స్థాయిలో మార్కెట్లు కదులుతున్నట్లు వివరించింది. 2008లో అంతర్జాతీయంగా చెలరేగిన ఆర్థిక సంక్షోభం ఫలితంగా తదుపరి దశలో మార్కెట్లు పతనమైన విషయం విదితమే. రీసెర్చ్‌ నోట్‌లో జెఫరీస్‌ ఇంకా ఏమన్నదంటే..!

44 శాతం ర్యాలీ
మార్చి కనిష్టం నుంచి నిఫ్టీ 44 శాతం ర్యాలీ చేసింది.  7,511 పాయింట్ల కనిష్టం నుంచి 10,813 పాయింట్ల వరకూ ఎగసింది. అయితే  కోవిడ్‌-19 ప్రభావంతో ఇటీవల పలు కంపెనీల ఈపీఎస్‌లు డౌన్‌గ్రేడ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లలో కనిపిస్తున్న ర్యాలీ పటిష్టతపై సందేహాలు నెలకొనడం సహజం. ఇప్పటికే నిఫ్టీ ఈపీఎస్‌పై అంచనాలలో కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 28 శాతం.. వచ్చే ఏడాదిలో 14 శాతం చొప్పున నిఫ్టీ ఈపీఎస్‌పై  డౌన్‌గ్రేడ్స్‌ వెలువడ్డాయి. ఈ ఏడాది తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌) ఫలితాలు విడుదలయ్యాక ఈపీఎస్‌ అంచనాలు మరింత తగ్గే వీలుంది. 

నిధులు వెనక్కి
ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితుల కారణంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి. యాంఫీ(AMFI) వివరాల ప్రకారం జూన్‌లో ఫండ్స్‌ నుంచి ఇన్వెస్టర్లు రూ. 1800 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత ఆరేళ్లలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే. ఫండ్స్‌లోకి పెట్టుబడులు రావడానికి బదులుగా నిధుల ఉపసంహరణ జరగడం ప్రతికూల అంశం. అయితే మెరుగైన ఆర్థిక గణాంకాలు, ప్రపంచవ్యాప్తంగా రిస్క్‌లను ఎదుర్కొనగల సామర్థ్యం పెరగడం వంటి అంశాలు మార్కెట్లలో దిద్దుబాటు(కరెక్షన్‌)ను స్వల్ప కాలానికే పరిమితం చేయవచ్చు. నిర్మాణ రంగం పుంజుకోవడం, జీఎస్‌టీ వసూళ్లు పెరగడం వంటి అంశాలు ర్యాలీకి బలాన్నిచ్చే వీలుంది. ఈ బాటలో ఇకపై సిమెంటుకు డిమాండ్‌, ఇంధన విక్రయాలు వంటివి  ఊపందుకుంటే సెంటిమెంటు మరింత మెగుగుపడవచ్చు. ఇది ర్యాలీకి మరింత దోహదం చేయవచ్చు.

ఫేవరెట్‌ స్టాక్స్‌
ప్రస్తుత మార్కెట్లో వేల్యుయేషన్స్‌పరంగా ఇండస్‌ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కొంతమేర ఆకర్షణీయంగా ఉన్నట్లు జెఫరీస్‌ అభిప్రాయపడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top