ఆశావహంగా ఉండండి..

Google CEO Sundar Pichai Tells Graduates of 2020 - Sakshi

అసహనంగానూ ఉండాలి

దాని నుంచే కొత్త టెక్నాలజీ విప్లవం వస్తుంది

గ్రాడ్యుయేట్ల స్నాతకోత్సవంలో గూగుల్‌ సీఈవో సుందర్‌

న్యూఢిల్లీ: విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బైటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్లు ఆశావహంగాను, కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తిగాను ఉండాలని టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సూచించారు. అంతే కాకుండా కొంత అసహనంగా కూడా ఉండాలని, దాన్నుంచే కొత్త సాంకేతిక విప్లవం రాగలదని ఆయన పేర్కొన్నారు. 2020 గ్రాడ్యుయేట్ల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పిచాయ్‌ ఈ విషయాలు తెలిపారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దంపతులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఈ స్నాతకోత్సవం ఇలా జరుగుతుందని మీరెవరూ ఊహించి ఉండరు. మీరు వేడుకగా జరుపుకోవడానికి బదులు కోల్పోయిన అవకాశాలు, తల్లకిందులైన ప్రణాళికల గురించిన ఆందోళనతో జరుపుకోవాల్సి వస్తోందని మీరు బాధపడుతూ ఉండొచ్చు. ఇలాంటి కష్టకాలంలో ఆశావహంగా ఉండటం కష్టమే. కానీ ఆశావహంగా ఉండగలిగితే, ఈ ఏడాది గ్రాడ్యుయేట్లయిన మీరు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టగలరు. చరిత్రలో నిల్చిపోగలరు‘ అని సుందర్‌ చెప్పారు.  

మెరుగైన ప్రపంచం..
ఒక తరం సాధించిన పురోగతి మరో తరానికి పునాదిరాయి కాగలదని సుందర్‌ తెలిపారు. నేటి యువత ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పురోగతి సాధించాలంటే కాస్త అసహనం కూడా ఉండాలన్నారు. ‘కొన్ని టెక్నాలజీ సంబంధిత విషయాలు మీకు విసుగు తెప్పించవచ్చు. అసహనానికి గురిచేయొచ్చు. ఆ అసహనాన్ని కోల్పోవద్దు. దాన్నుంచే కొత్త సాంకేతిక విప్లవం సృష్టి జరగొచ్చు, మా తరం కనీసం కలలో కూడా ఉహించని కొత్తవన్నీ మీరు నిర్మించవచ్చేమో. కాబట్టి అసహనంగా ఉండండి. ప్రపంచానికి అవసరమైన పురోగతి దాన్నుంచే వస్తుంది‘ అని సుందర్‌ పేర్కొన్నారు.  

నేనూ సవాళ్లు ఎదుర్కొన్నా..
గూగుల్‌ సీఈవో స్థాయికి ఎదిగే క్రమంలో తానూ పలు సవాళ్లు ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా సుందర్‌ చెప్పారు. తన చిన్నతనంలో టెక్నాలజీ పెద్దగా అందుబాటులో ఉండేది కాదని, కానీ ప్రస్తుత తరం పిల్లలు కంప్యూటర్లతోనే పెరుగుతున్నారన్నారు. ‘నేను స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా రావడం కోసం మా నాన్న దాదాపు ఏడాది జీతం వెచ్చించి విమానం టికెట్‌ కొనిచ్చారు. నేను విమానం ఎక్కడం అదే మొదటిసారి. నన్ను అక్కడ (భారతదేశం) నుంచి ఇక్కడి దాకా (అమెరికా) తీసుకొచ్చినది కేవలం అదృష్టం ఒక్కటే కాదు. టెక్నాలజీ అంటే నాకున్న అమితాసక్తి, కొత్తవి నేర్చుకోవాలనే అభిలాష కూడా ఇందుకు కారణం‘ అని సుందర్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top