breaking news
technical revolution
-
ఆశావహంగా ఉండండి..
న్యూఢిల్లీ: విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బైటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్లు ఆశావహంగాను, కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తిగాను ఉండాలని టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సూచించారు. అంతే కాకుండా కొంత అసహనంగా కూడా ఉండాలని, దాన్నుంచే కొత్త సాంకేతిక విప్లవం రాగలదని ఆయన పేర్కొన్నారు. 2020 గ్రాడ్యుయేట్ల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పిచాయ్ ఈ విషయాలు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఈ స్నాతకోత్సవం ఇలా జరుగుతుందని మీరెవరూ ఊహించి ఉండరు. మీరు వేడుకగా జరుపుకోవడానికి బదులు కోల్పోయిన అవకాశాలు, తల్లకిందులైన ప్రణాళికల గురించిన ఆందోళనతో జరుపుకోవాల్సి వస్తోందని మీరు బాధపడుతూ ఉండొచ్చు. ఇలాంటి కష్టకాలంలో ఆశావహంగా ఉండటం కష్టమే. కానీ ఆశావహంగా ఉండగలిగితే, ఈ ఏడాది గ్రాడ్యుయేట్లయిన మీరు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టగలరు. చరిత్రలో నిల్చిపోగలరు‘ అని సుందర్ చెప్పారు. మెరుగైన ప్రపంచం.. ఒక తరం సాధించిన పురోగతి మరో తరానికి పునాదిరాయి కాగలదని సుందర్ తెలిపారు. నేటి యువత ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పురోగతి సాధించాలంటే కాస్త అసహనం కూడా ఉండాలన్నారు. ‘కొన్ని టెక్నాలజీ సంబంధిత విషయాలు మీకు విసుగు తెప్పించవచ్చు. అసహనానికి గురిచేయొచ్చు. ఆ అసహనాన్ని కోల్పోవద్దు. దాన్నుంచే కొత్త సాంకేతిక విప్లవం సృష్టి జరగొచ్చు, మా తరం కనీసం కలలో కూడా ఉహించని కొత్తవన్నీ మీరు నిర్మించవచ్చేమో. కాబట్టి అసహనంగా ఉండండి. ప్రపంచానికి అవసరమైన పురోగతి దాన్నుంచే వస్తుంది‘ అని సుందర్ పేర్కొన్నారు. నేనూ సవాళ్లు ఎదుర్కొన్నా.. గూగుల్ సీఈవో స్థాయికి ఎదిగే క్రమంలో తానూ పలు సవాళ్లు ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా సుందర్ చెప్పారు. తన చిన్నతనంలో టెక్నాలజీ పెద్దగా అందుబాటులో ఉండేది కాదని, కానీ ప్రస్తుత తరం పిల్లలు కంప్యూటర్లతోనే పెరుగుతున్నారన్నారు. ‘నేను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా రావడం కోసం మా నాన్న దాదాపు ఏడాది జీతం వెచ్చించి విమానం టికెట్ కొనిచ్చారు. నేను విమానం ఎక్కడం అదే మొదటిసారి. నన్ను అక్కడ (భారతదేశం) నుంచి ఇక్కడి దాకా (అమెరికా) తీసుకొచ్చినది కేవలం అదృష్టం ఒక్కటే కాదు. టెక్నాలజీ అంటే నాకున్న అమితాసక్తి, కొత్తవి నేర్చుకోవాలనే అభిలాష కూడా ఇందుకు కారణం‘ అని సుందర్ తెలిపారు. -
కంప్యూటర్ మార్కెట్
హైస్పీడ్ వర్క్‌కు కంప్యూటర్స్ కరీంనగర్ మార్కెట్హబ్ విక్రయాలు కరీంనగర్ బిజినెస్ : కంప్యూటర్ లేనిదే రోజు గడవని పరిస్థితి. సాంకేతికపరంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో ప్రతి పనికి కంప్యూటర్ను వినియోగిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వీటి సేవలను వినియోగిస్తున్నాం. గతంలో కంప్యూటర్లు కొనుగోలు చేయాలంటే హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం కరీంనగర్లో అన్ని రకాల కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి. నగరంలో రోజురోజుకు కంప్యూటర్ మార్కెట్ విస్తరిస్తోంది. సేల్స్‌తోపాటు సర్వీసెస్ అందుబాటులోకి రావడంతో చాలా మంది ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. అన్ని రంగాల్లో ప్రస్తుతం అన్ని రంగాల్లో కంప్యూటర్లు ప్రవేశించాయి. విద్యారంగం, వ్యాపార, వాణిజ్యరంగాలలోపాటు ఆటోమొబైల్, సూపర్‌మార్కెట్, సివిల్ ఇంజినీరింగ్‌లో బిల్డింగ్ డిజైన్లు, ఇంట్లో వాడుకునే పర్సనల్ కంప్యూటర్లు ఇలా చెప్పుకుంటూ పోతే అంతా కంప్యూటర్మయమైంది. విద్యార్థులకు వరం పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక విద్యాబోధన ఉండడంతో ఇంటి వద్ద ప్రాక్టీస్ చేసుకునేందుకు తల్లిదండ్రులు కంప్యూటర్లు కొనుగోలు చేస్తున్నారు. అదనంగా సమాచారం, సబ్జెక్టులను లోతుగా తెలుసుకునేందుకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు సైతం వారికి తెలియని విషయాలను తెలుసుకునేందుకు ఇంట్లో కంప్యూటర్లు వాడుతున్నారు. ల్యాప్‌టాప్‌లు ఒకే ప్రదేశంలో స్థిరంగా పనిచేసే వారు డెస్క్‌టాప్‌లు వాడుతుంటే.. ఎక్కడికి వెళ్లిన తమతోపాటు కంప్యూటర్ తీసుకెళ్లాల్సిన వారు ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తున్నారు. ల్యాప్‌టాప్‌లతో ఇంట్లో, బయట కూడా వర్క్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో స్లిమ్, టచ్, కన్వర్టబుల్, గేమింగ్ ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో సందది చేస్తున్నాయి. సేవలు వేగం గతంతో పోలిస్తే ప్రస్తుతం కంప్యూటర్ల ద్వారా వేగవంతమైన సేవలు పొందుతున్నారు. అంతకుముందు లేటెస్ట్ మోడల్ కంప్యూటర్లు కరీంనగర్లో లభిస్తున్నాయి. మార్కెట్లో లేటెస్ట్గా 32జీబీ వరకు ర్యామ్‌లు, కోర్ ఐ–7 సిక్త్స్ జనరేషన్ ప్రాసెసర్స్, 4 టెరాబైట్స్ వరకు హార్డ్‌డిస్క్‌లు, 4 జీబీ గ్రాఫిక్కార్డులు, మౌస్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్యాటరీలు, మ్యూజిక్, వాయిస్‌చాట్ కోసం హెడ్సెట్లు, హోం థియేటర్లు, యాంటి వైరస్లు, అదనపు సమాచారం భద్రపరుచుకునేందుకు ఎక్స్టర్నల్ హార్ట్డిస్క్లు, వెబ్‌క్యామ్‌లు, అన్నిల్యాప్టాప్ల చార్జర్లు, బ్యాటరీలు, ఇంటర్నెట్ సౌకర్యానికి కావాల్సిన రూటర్లు, అసెంబుల్డ్ బ్రాండెడ్ డెస్క్‌టాప్‌లు, ప్రింటర్లు ఇలా అన్ని లేటెస్ట్ మోడల్స్ కరీంనగర్‌లోనే లభిస్తున్నాయి. ధరలు(రూ..లలో) ల్యాప్‌టాప్‌లు 20వేలు– 1.5 లక్షలకు పైగా మినీల్యాప్లు 15 వేలు–20 వేలకు పైగా డెస్క్‌టాప్(అసెంబుల్డ్) 10వేలు–25 వేలు డెస్క్‌టాప్(బ్రాండెడ్) 20వేలు–లక్ష వరకు ప్రింటర్స్ 2వేలు–50వేలు హోం థియేటర్స్ 1000 –10 వేలు యాంటివైరస్లు 200–2 వేలు రూటర్స్ 800–2 వేలు పెన్‌డ్రైవ్‌లు 200–1000 మౌస్‌లు 100–500 కీబోర్ట్లు 200–2000 హెడ్‌ఫోన్స్ 150–5000 ఎక్స్టర్నల్ హార్ట్‌డిస్క్ 4వేల–కెపాసిటీని బట్టి అడాప్టర్స్, బ్యాటరీలు 500–4 వేలు వెబ్‌క్యామ్‌లు 500–1500 మానిటర్స్ 4వేలు–15 వేలు క్యాట్రేజ్‌లు 300–3000 వరకు వినియోగదారులు పెరుగుతున్నారు –జి.భరద్వాజ్, ల్యాప్స్టోర్ యజమాని కరీంనగర్లో కంప్యూటర్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విద్యార్థుల నుంచి మొదలుకొని అన్ని రంగాల వారు కంప్యూటర్ల సాయంతో పనిచేస్తున్నారు. అత్యంత వేగవంతమైన సేవలందించేలా మార్కెట్లో నూతనంగా లేటెస్ట్ హై స్పీడ్ కాన్ఫిగరేషన్ కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. రోజురోజుకు కంప్యూటర్లతో అవసరాలు పెరగడంతో గిరాకీ సైతం పెరుగుతుంది. మేము కేవలం అమ్మకాలే కాకుండా సేవలను కూడా అందించడంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.