పుత్తడివైపు మళ్లీ ఇన్వెస్టర్ల చూపు.. | Gold prices extend gains, now at 5-month high | Sakshi
Sakshi News home page

పుత్తడివైపు మళ్లీ ఇన్వెస్టర్ల చూపు..

Feb 8 2016 12:40 AM | Updated on Sep 3 2017 5:08 PM

పుత్తడివైపు మళ్లీ ఇన్వెస్టర్ల చూపు..

పుత్తడివైపు మళ్లీ ఇన్వెస్టర్ల చూపు..

ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు క్రమేపీ బలహీనపడుతుండటం, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ 2016లో వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు సన్నగిల్లడంతో..

న్యూయార్క్/ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు క్రమేపీ బలహీనపడుతుండటం, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ 2016లో వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు సన్నగిల్లడంతో ఇన్వెస్టర్లు తిరిగి పుత్తడిలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని బులియన్ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ చమురు, ఈక్విటీలు క్షీణించగా, బంగారం ధర మాత్రం 10 శాతంవరకూ పెరిగింది. గత శుక్రవారం అమెరికాలో ఉద్యోగాల గణాంకాలు బలహీనంగా వుండటంతో న్యూయార్క్ ట్రేడింగ్‌లో ఔన్సు బంగారం ధర ఒక్కసారిగా 16 డాలర్ల మేర పెరిగి 1,173 డాలర్ల స్థాయికి చేరింది.

వరుసగా మూడు వారాల నుంచి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పెరుగుదలతో ముగియడం విశేషం. అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్నదన్న సంకేతాలు ఈ జాబ్స్ డేటా ద్వారా అందాయి. దాంతో ఫెడ్ ఇక వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు తక్కువేనన్న అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ నెలలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన తర్వాత ఇప్పటివరకూ అక్కడ పుత్తడి ధర 1,045 డాలర్ల నుంచి క్రమేపీ ర్యాలీ జరపడం గమనార్హం.
 
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తడం, అనిశ్చితి సమయాల్లో సురక్షిత ఆస్తిగా పుత్తడికి వున్న గుర్తింపు తాజా కొనుగోళ్లకు కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అలాగే అమెరికా ఆర్థికాభివృద్ధికి సంబంధించిన గణాంకాలు అయోమయంగా వెలువడుతున్నందున, బంగారంలో ఇన్వెస్టర్లు ఇటీవలకాలంలో పెట్టుబడుల్ని పెంచుకుంటున్నారని విశ్లేషణా సంస్థ క్యాపిటల్ ఎకనామిక్ విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది. అనిశ్చితి సమయాల్లో సురక్షిత సాధనంగా బంగారానికి వున్న గుర్తింపు తాజా కొనుగోళ్లకు కారణమని కామర్జ్ బ్యాంక్ కార్పొరేట్స్ అండ్ మార్కెట్స్ ఒక నోట్‌లో విశ్లేషించింది. అమెరికా డాలరు ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే క్రితం వారం బలహీనపడటం, ఈక్విటీ మార్కెట్లు క్షీణించడం కూడా బంగారం పెరుగుదలకు సహకరించినట్లు కామర్జ్‌బ్యాంక్ పేర్కొంది.
 
భారత్‌లో 8 నెలల గరిష్టస్థాయి...
ఇక భారత్‌లో ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర గత శుక్రవారం అంతక్రితం వారం ఇదే రోజుతో పోలిస్తే భారీగా రూ. 880 మేర పెరిగి రూ. 27,580 స్థాయికి చేరింది. ఇండియాలో ఈ ధర 8 నెలల గరిష్టం. అంతర్జాతీయ ట్రెండ్‌కు తోడు ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్ మొదలుకావడంతో జ్యువెల్లర్స్ నుంచి పుత్తడికి డిమాండ్ ఏర్పడిందని బులియన్ ట్రేడర్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement