మిట్టల్‌ చేతికి ఎస్సార్‌ స్టీల్‌

Essar Steel creditors' panel approves ArcelorMittal's acquisition bid - Sakshi

రూ. 42 వేల కోట్లకు బిడ్‌ వేసిన ఉక్కు దిగ్గజం

దీనికి రుణదాతల కమిటీ ఆమోదముద్ర

చేతికొచ్చాక మరో రూ. 8 వేల కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో వేలానికి వచ్చిన ఎస్సార్‌ స్టీల్‌ను ఎట్టకేలకు ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌ దక్కించుకుంది. దీంతో భారత మార్కెట్లో అడుగుపెట్టడానికి ఆర్సెలర్‌ మిట్టల్‌కు అవకాశం లభించినట్లయింది. ఈ డీల్‌కు సంబంధించి తాము దాఖలు చేసిన రూ.42,000 కోట్ల బిడ్‌కు ఎస్సార్‌ స్టీల్‌ రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదముద్ర వేసినట్లు ఆర్సెలర్‌ మిట్టల్‌ శుక్రవారం వెల్లడించింది. బ్యాంకర్లకు సమర్పించిన పరిష్కార ప్రణాళిక ప్రకారం.. కంపెనీ రుణభారం సెటిల్మెంట్‌ కోసం రూ. 42,000 కోట్లు ముందుగా చెల్లించనున్నట్లు, ఆ తర్వాత కార్యకలాపాల నిర్వహణ, ఉత్పత్తిని పెంచుకోవడం మొదలైన వాటి కోసం మరో రూ.8,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది.

మరోవైపు, ఆర్సెలర్‌ మిట్టల్‌తో కలిసి ఎస్సార్‌ స్టీల్‌ను సంయుక్తంగా నిర్వహించనున్నట్లు జపాన్‌కి చెందిన నిప్పన్‌ స్టీల్‌ అండ్‌ సుమితొమో మెటల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఎంసీ) వెల్లడించింది. ఈ డీల్‌కు అవసరమైన నిధులను ఈక్విటీ, రుణం రూపంలో సమకూర్చుకోనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు రూ. 49,000 కోట్ల బాకీలను రాబట్టుకునేందుకు దివాలా చట్టం కింద ఎస్సార్‌ స్టీల్‌ను బ్యాంకులు వేలం వేసిన సంగతి తెలిసిందే. న్యూమెటల్, వేదాంత మొదలైన దిగ్గజాలు కూడా పోటీపడిన ఈ వేలం ప్రక్రియ అనేక మలుపులు తిరిగింది.

చివరికి అత్యధికంగా కోట్‌ చేసిన బిడ్డరుగా అక్టోబర్‌ 19న ఆర్సెలర్‌ మిట్టల్‌ పేరును సీవోసీ ప్రకటించింది. అయితే, కంపెనీని చేజారిపోకుండా కాపాడుకునేందుకు ఎస్సార్‌ స్టీల్‌ ప్రమోటర్లయిన రుయా కుటుంబం దాదాపు రూ.54,389 కోట్లతో బాకీలను పూర్తిగా కట్టేస్తామంటూ ఆఖరు నిమిషంలో అక్టోబర్‌ 25న పరిష్కార ప్రణాళికను ప్రతిపాదించింది. కానీ, అదే రోజున ఆర్సెలర్‌ మిట్టల్‌ బిడ్‌కు రుణదాతలు తుది ఆమోద ముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఎస్సార్‌ స్టీల్‌ ప్రమోటర్ల ప్రతిపాదనను బ్యాంకులు కనీసం పరిశీలించాయా లేదా అన్నది కూడా తెలియరాలేదని వివరించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top