హైదరాబాద్‌లో దుబాయ్‌ గ్రూప్‌ ఆసుపత్రి | Dubai Group hospital in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో దుబాయ్‌ గ్రూప్‌ ఆసుపత్రి

Apr 12 2017 2:43 AM | Updated on Sep 5 2017 8:32 AM

హైదరాబాద్‌లో దుబాయ్‌ గ్రూప్‌ ఆసుపత్రి

హైదరాబాద్‌లో దుబాయ్‌ గ్రూప్‌ ఆసుపత్రి

దుబాయ్‌ కేంద్రంగా వైద్య సేవలందిస్తున్న తుంబె గ్రూప్‌ భారత్‌లో తొలి ఆసుపత్రిని బుధవారం ప్రారంభిస్తోంది.

మూడేళ్లలో 8–10 హాస్పిటల్స్‌: తుంబె గ్రూప్‌
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దుబాయ్‌ కేంద్రంగా వైద్య సేవలందిస్తున్న తుంబె గ్రూప్‌ భారత్‌లో తొలి ఆసుపత్రిని బుధవారం ప్రారంభిస్తోంది. హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లో ఉన్న న్యూలైఫ్‌ హాస్పిటల్‌ను తుంబె గ్రూప్‌ కొనుగోలు చేసి ఆధునీకరించింది. తుంబె హాస్పిటల్‌ న్యూ లైఫ్‌ పేరుతో ఈ 200 పడకల ఆసుపత్రిని నిర్వహిస్తామని సంస్థ మెడికల్‌ డైరెక్టర్‌ టి.శ్యామ్‌ సుందర్‌ చెప్పారు. హాస్పిటల్‌ సీవోవో బాలాజీ గోలి, గల్ఫ్‌ మెడికల్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవి తిప్పరాజుతో కలసి మంగళవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు.

చాదర్‌ఘాట్‌ హాస్పిటల్‌ కంటే పెద్ద ఆసుపత్రిని మాదాపూర్‌ సమీపంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. మూడేళ్లలో 1,500 పడకల సామర్థ్యానికి చేరుకోవాలన్నది గ్రూప్‌ లక్ష్యమని వెల్లడించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 8–10 ఆసుపత్రులు వచ్చే అవకాశం ఉందన్నారు. నర్సులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్టు శ్యామ్‌సుందర్‌ తెలిపారు. తుంబె గ్రూప్‌ను కర్ణాటకలోని మంగళూరుకు చెందిన తుంబె మొయిద్దీన్‌ ఏర్పాటు చేశారు. యూఏఈలో సంస్థకు నాలుగు ఆసుపత్రులున్నాయి. రియల్‌ ఎస్టేట్, రిటైల్, హాస్పిటాలిటీ రంగాల్లోనూ ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement