ఎగుమతులకు త్వరలోనే వరాలు

Central Government Boost For Exports Soon - Sakshi

జెమ్స్‌, జ్యుయలరీకి సైతం

ప్రభుత్వం ప్రకటించే అవకాశం

న్యూఢిల్లీ: ఎగుమతులు పెంచుకునే దిశగా ప్రభుత్వం అతి త్వరలోనే పలు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశం నుంచి ఎగుమతులు స్తబ్దుగా ఉండడాన్ని చూస్తూనే ఉన్నాం. దీంతో ప్రోత్సాహక చర్యలపై కేంద్ర ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖల అధికారులు ఇప్పటికే పలు సార్లు భేటీ అయి చర్చలు కూడా నిర్వహించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) నుంచి పనిచేస్తున్న యూనిట్లకు పన్ను ప్రయోజనాల గడువును పొడిగించడం ప్రభుత్వం పరిశీలిస్తున్న వాటిల్లో ఒకటి. 2020 మార్చి 31లోపు సెజ్‌లలో ఏర్పాటయ్యే కొత్త యూనిట్లకు మాత్రమే పన్ను ప్రయోజనాలు ఉంటాయని 2016-17 కేంద్ర బడ్జెట్‌లో పేర్కొనడం కూడా జరిగింది. ఇక జెమ్స్‌, జ్యుయలరీ రంగానికి కూడా ప్రభుత్వ ప్రోత్సాహక చర్యల్లో చోటు దక్కనుంది. రంగు రాళ్లు, పాలిష్డ్‌ వజ్రాల దిగుమతులపై సుంకాలను తగ్గించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ ద్వారా ఎగుమతులకు ఇస్తున్న రుణ పరిమితిని 60 శాతం నుంచి 90 శాతానికి పెంచడం కూడా ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఉంది. దీనివల్ల ఎగమతులకు తక్కువ ధరలకే రుణాలు లభిస్తాయి. ఎగుమతి, దిగుమతి సరుకులకు సత్వర ఆమోదం తెలిపే విధానం అమలు చేయాలని కూడా భావిస్తోంది.

దేశీయ తయారీకి ప్రోత్సాహం
ఇక దేశీయ తయారీని ప్రోత్సహించడం, అదే సమయంలో దిగుమతులను తగ్గించుకునేందుకు... స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలున్న దేశాల నుంచి వచ్చే దిగుమతుల విషయంలో కఠిన నిబంధనలను అనుసరించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా పన్నులు తప్పించుకునేందుకు స్వేచ్ఛా వాణిజ్య దేశాల ద్వారా సరుకులను భారత్‌కు ఎగమతి చేయడం కష్టతరం అవుతుంది. పెద్ద ఫార్మా కంపెనీలకు వడ్డీ రాయితీలు, బాస్మతీయేతర బియ్యం తదితర ఎగుమతులకు ఎంఈఐఎస్‌ పథకం ప్రయోజనాలు వర్తింప చేయాలని మరోవైపు ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top