భారీ చోరీ : 3.80 లక్షల లావాదేవీలపై ప్రభావం

British Airways Suffers Massive Data Breach, 3.80 Lakh Payments Hit - Sakshi

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ దాడులు పెరగడమే కాని, తగ్గడం కనిపించడం లేదు. బడా బడా కంపెనీలు, దిగ్గజ సంస్థలు, పెద్ద బ్యాంక్‌లు సైతం వీటి బారిన పడుతున్నాయి. తాజాగా దిగ్గజ ఎయిర్‌లైన్‌ సంస్థ బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ కూడా సైబర్‌ నేరగాళ్లు బారిన పడింది. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన వెబ్‌సైట్‌, మొబైల్‌ అప్లికేషన్‌పై సైబర్‌ నేరగాళ్లు దాడి చేసి, కస్టమర్ల డేటాను దొంగలించారు. ఈ విషయాన్ని ఆ విమానయాన సంస్థనే ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. యూకేలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ అతిపెద్ద విమానయాన సంస్థ. 

కస్టమర్ల వ్యక్తిగత డేటా, ఆర్థిక సమాచారం దొంగతనం పాలైన విషయంపై ఈ సంస్థ తమ కస్టమర్లకు క్షమాపణ కూడా చెప్పింది. ఈ డేటా చోరిపై విచారణ చేపట్టినట్టు పేర్కొంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 5 మధ్యలో కస్టమర్ల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం దొంగతనానికి గురైందని, దాదాపు 3,80,000 లావాదేవీలు దీని బారిన పడినట్టు బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ వెల్లడించింది. అయితే పాస్‌పోర్టు లేదా ప్రయాణ వివరాలు మాత్రం దొంగతనానికి గురికాలేదని పేర్కొంది.   

‘ 21 ఆగస్టు 2018,  22:58 బీఎస్‌టీ(బ్రిటీష్‌ స్టాండర్డ్‌ టైమ్‌) నుంచి 5 సెప్టెంబర్‌ 2018, 21:45 బీఎస్‌టీ వరకు ఏ కస్టమర్లైతే, మా వెబ్‌సైట్‌, యాప్‌లో బుకింగ్స్‌ను, షెడ్యూల్‌ మార్పులను చేపట్టారో, వారి వ్యక్తిగత, ఆర్థిక వివరాలన్నీ చోరికి గురయ్యాయి’ అని బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ సైబర్‌ దాడి బారిన పడినట్టు అనిపిస్తే, వెంటనే బ్యాంక్‌లు, క్రెడిట్‌ కార్డు ప్రొవైడర్ల సూచనలు తీసుకోవాలని కస్టమర్లను ఎయిర్‌లైన్స్‌ ఆదేశించింది. తదుపరి సమాచారం కోసం ఓ లింక్‌ను అప్‌డేట్‌ చేయనున్నట్టు పేర్కొంది. కస్టమర్లను వ్యక్తిగతంగా సంప్రదించి, తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది. 

ప్రభావితమైన కస్టమర్ల నగదును పూర్తిగా రియంబర్స్‌ చేస్తామని, క్రెడిట్‌ చెకింగ్‌ సర్వీసుకు చెల్లించనున్నట్టు పేర్కొంది. తాజా సమాచారంపై ఎప్పడికప్పుడు కస్టమర్లకు అప్‌డేట్‌ చేస్తామని తెలిపింది. ప్రస్తుతం దీన్ని పరిష్కరించామని, తదుపరి బుకింగ్స్‌పై దీని ప్రభావం ఏ మాత్రం ఉండదని చెప్పింది. పోలీసులు, సంబంధిత అధికారులు ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top