బీఎన్‌పీ పారిబా చేతికి షేర్‌ఖాన్ | BNP Pariba hand serkhan | Sakshi
Sakshi News home page

బీఎన్‌పీ పారిబా చేతికి షేర్‌ఖాన్

Jul 31 2015 12:50 AM | Updated on Sep 3 2017 6:27 AM

దేశీ బ్రోకరేజి సంస్థ షేర్‌ఖాన్‌ను ఫ్రెంచ్ బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్‌పీ పారిబా కొనుగోలు చేయనుంది

డీల్ విలువ రూ. 2,000 కోట్లు
 
 ముంబై : దేశీ బ్రోకరేజి సంస్థ షేర్‌ఖాన్‌ను ఫ్రెంచ్ బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్‌పీ పారిబా కొనుగోలు చేయనుంది. 100 శాతం ఈక్విటీ వాటాల కొనుగోలుకు సంబంధించి షేర్‌ఖాన్ వాటాదారులతో గురువారం ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీఎన్‌పీ పారిబా వెల్లడించింది. ఇరు కంపెనీలు డీల్ విలువ గురించి వెల్లడించకపోయినా.. దీని విలువ సుమారు రూ. 2,000 కోట్లు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.  బీఎన్‌పీ పారిబా పర్సనల్ ఇన్వెస్టర్స్ విభాగంలో షేర్‌ఖాన్ భాగం కానుంది. భారత్‌లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు, బ్రోకరేజి నుంచి పెట్టుబడి సర్వీసులు దాకా అందించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని బీఎన్‌పీ పారిబా ఇండియా కంట్రీ హెడ్ జొరిస్ డియర్క్ పేర్కొన్నారు. గతంలో ఎస్‌ఎస్‌కేఐ ఇన్వెస్టర్ సర్వీసెస్ పేరిట 1995లో షేర్‌ఖాన్ ఏర్పాటైంది. 2000లో సంస్థాగతేతర క్లయింట్లకు బ్రోకరేజి సర్వీసులు ప్రారంభించింది. శ్రీపాల్ మొరాఖియా, శ్రేయాస్ మొరాఖియా ఈ సంస్థను ప్రమోట్ చేశారు. షేర్‌ఖాన్‌కి ఖాతాల సంఖ్యాపరంగా 7 శాతం మార్కెట్ వాటా ఉంది. గడిచిన 12 సంవత్సరాలుగా నిలకడగా లాభాలు నమోదు చేస్తోంది. మరోవైపు, రిటైల్, కార్పొరేట్, సంస్థాగత బ్యాంకింగ్ సర్వీసులు అందించే బీఎన్‌పీ పారిబాకి 75 దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. 1,85,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2007లో జియోజిత్ సెక్యూరిటీస్‌లో బీఎన్‌పీ పారిబా 34 శాతం వాటాలు కొనుగోలు చేసింది. అనంతరం సంస్థ పేరును బీఎన్‌పీ జియోజిత్ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ కింద మార్చింది.

Advertisement
Advertisement