హెల్త్‌ప్రో వేదికపై అన్ని  ఆరోగ్య సేవలు

All health services on healthcare platform - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హెల్త్‌కేర్‌ టెక్నాలజీ కంపెనీ కేర్‌4యు తాజాగా ‘హెల్త్‌ప్రో’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆసియాలో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన తొలి యాప్‌ ఇదే. ఆసుపత్రులు, వైద్యులు, రోగ పరీక్ష కేంద్రాలు, మందుల షాపులు, బీమా కంపెనీలను రియల్‌ టైంలో ఒకతాటిపైకి తీసుకొస్తుంది. సమాచారం క్షణాల్లో చేరుతుంది. భారత్‌లో ఎస్తోనియా రాయబారి రిహో క్రూవ్‌ చేతుల మీదుగా హెల్త్‌ప్రో యాప్‌ను ఆవిష్కరించారు. కేర్‌4యు హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ కంపెనీని మ్యాక్సివిజన్‌ ఐ హాస్పిటల్స్‌ వ్యవస్థాపకులైన డాక్టర్‌ కాసు ప్రసాద్‌ రెడ్డి స్థాపించారు. యాప్‌ ద్వారా బీమా కంపెనీ నుంచి 30 సెకన్లలో ప్రీ–అప్రూవల్‌ వస్తుందని కేర్‌4యు డైరెక్టర్‌ ప్రబిన్‌ బర్దన్‌ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు.

సమయం ఆదా అవడమేగాక పారదర్శకత, సమాచార గోప్యత ఉంటుందని చెప్పారు. కేంద్రీకృత వ్యవస్థ మొత్తం లావాదేవీలను పరిశీలిస్తుందని, సమాచారం అంతా యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదవుతుందని గుర్తుచేశారు. 350 ఆసుపత్రులు, క్లినిక్స్‌తో కంపెనీ చేతులు కలిపింది. బిజినెస్‌ పార్టనర్‌గా బీమా సంస్థ ఫ్యూచర్‌ జనరాలీ వ్యవహరిస్తోంది. మరో 8 బీమా కంపెనీలతో కేర్‌4యు చర్చిస్తోంది. యాప్‌ సహకారంతో క్లెయిమ్‌ ప్రాసెస్‌ త్వరతగతిన పూర్తి అవుతుందని ఫ్యూచర్‌ జెనరాలీ ఎండీ కె.జి.కృష్ణమూర్తి రావు చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top