అదానీ గ్రీన్‌ - కావేరీ సీడ్‌.. భల్లేభల్లే

Adani green- Kaveri seed jumps in volatile market - Sakshi

10వ రోజూ అదానీ స్పీడ్‌

30 రోజుల్లో 210% అప్‌

ఏడాది గరిష్టానికి కావేరీ సీడ్‌

2 వారాల్లో 58 శాతం ప్లస్‌

కొద్ది రోజులుగా దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నప్పటికీ విభిన్న వార్తల నేపథ్యంలో రెండు కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మరోసారి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుదుత్పత్తి టెండర్‌ను గెలుచుకోవడంతో అదానీ గ్రీన్‌ ఎనర్జీ దూకుడు చూపుతోంది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో అగ్రికల్చర్‌ కంపెనీ కావేరీ సీడ్‌ షేరు స్పీడందుకుంది. వివరాలు చూద్దాం..

అదానీ గ్రీన్‌ ఎనర్జీ
ప్రయివేట్‌ రంగ విద్యుదుత్పత్తి కంపెనీ అదానీ గ్రీన్‌ ఎనర్జీ వరుసగా 10వ రోజు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై రూ. 382 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! అదానీ గ్రూప్‌లోని పునరుత్పాదక ఇంధన కంపెనీ అదానీ గ్రీన్‌ గత మూడు నెలల్లో 210 శాతం ర్యాలీ చేసింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 10 శాతమే లాభపడింది. ఈ నెల 9న 8 గిగావాట్ల ఫొటోవోల్టాయిక్‌ పవర్‌ ప్లాంటుతోపాటు.. 2 గిగావాట్ల సోలార్‌ సెల్‌ మాడ్యూల్‌ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి టెండర్‌ను పొందింది. ఇందుకు రూ. 45,000 కోట్లను ఇన్వెస్ట్‌ చేయవలసి ఉంటుంది. కంపెనీ ఇప్పటికే 2.5 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని అందుకోగా.. మరో 3.5 జీడబ్ల్యూ సామర్థ్యంగల ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. దీనికితోడు గతేడాది క్యూ4లో ఆకర్షణీయ పనితీరు చూపడం ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
 
కావేరీ సీడ్‌ కంపెనీ
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో అగ్రికల్చరల్‌ ప్రొడక్టుల కంపెనీ కావేరీ సీడ్‌ పటిష్ట ఫలితాలు సాధించింది. ఫలితంగా ఈ కౌంటర్‌ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 630కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం కాస్త వెనకడుగు వేసి స్వల్ప లాభంతో రూ. 610 వద్ద ట్రేడవుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ కావేరీ సీడ్‌ షేరు 50 శాతం జంప్‌చేయడం విశేషం! గత 13 ట్రేడింగ్‌ సెషన్లలో 58 శాతం ఎగసింది. ​‍కాగా.. క్యూ4లో కంపెనీ టర్న్‌అరౌండ్‌ సాధించి రూ. 7.6 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 11 కోట్ల నికర నష్టం ప్రకటించింది. నికర అమ్మకాలు సైతం 18 శాతం పెరిగి రూ. 63 కోట్లను అధిగమించాయి. ఈ క్యూ4లో రూ. 18 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించగా.. అంతక్రితం క్యూ4లో రూ. 3 కోట్ల నష్టం నమోదైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top