యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ గిగా స్పీడ్‌ | ACT Fibernet Launches 1Gbps Wired Broadband Service | Sakshi
Sakshi News home page

యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ గిగా స్పీడ్‌

Mar 31 2017 12:16 AM | Updated on Sep 5 2017 7:30 AM

యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ గిగా స్పీడ్‌

యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ గిగా స్పీడ్‌

ఇంటర్నెట్‌ సర్వీసుల రంగంలో ఉన్న యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ గిగా స్పీడ్స్‌ జాబితాలోకి చేరింది. భారత్‌లో 1 జీబీపీఎస్‌ (1024 ఎంబీపీఎస్‌) డౌన్‌లోడ్‌ వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తున్న తొలి కంపెనీగా రికార్డుకెక్కింది.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంటర్నెట్‌ సర్వీసుల రంగంలో ఉన్న యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ గిగా స్పీడ్స్‌ జాబితాలోకి చేరింది. భారత్‌లో 1 జీబీపీఎస్‌ (1024 ఎంబీపీఎస్‌) డౌన్‌లోడ్‌ వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తున్న తొలి కంపెనీగా రికార్డుకెక్కింది. అయితే ఈ సేవలకు హైదరాబాద్‌ వేదిక కావడం విశేషం. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ గిగా ప్లాన్‌ను గురువారమిక్కడ ఆవిష్కరించింది.

దేశంలో ఇంటర్నెట్‌ సగటు వేగం 2.5 ఎంబీపీఎస్‌ ఉంది. దేశ సగటు కన్నా హైదరాబాద్‌లో నెట్‌ స్పీడ్‌ 400 రెట్లు అధికం అయిందని కంపెనీ సీఈవో బాల మల్లాది ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఇంటర్నెట్‌ విస్తరణ పరంగా భాగ్యనగరి దేశంలో టాప్‌–1లో ఉందన్నారు. ప్రపంచంలో కొన్ని దేశాల్లోనే గిగా స్పీడ్‌ అందుబాటులో ఉందని చెప్పారు.  విస్తరణకు రెండేళ్లలో రూ. 1,200 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. యాక్ట్‌ గిగా ప్లాన్‌ ధర నెలకు రూ.5,999గా నిర్ణయించారు. దీని కింద 1 టీబీ (1024 జీబీ) డేటా ఉచితం.

3,000 వైఫై హాట్‌స్పాట్స్‌..: గిగా స్పీడ్‌ జాబితాలో హైదరాబాద్‌ చేరడం గర్వంగా ఉందని తారక రామారావు అన్నారు. భాగ్యనగరిలో బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లు నెలకు సగటున 75 జీబీ డేటా వాడుతున్నారని గుర్తు చేశారు. నగరంలో 3,000 వైఫై హాట్‌స్పాట్స్‌ ఏర్పాటవుతున్నాయని వెల్లడించారు. వీటిలో 1,000 హాట్‌స్పాట్స్‌ను యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ నెలకొల్పుతోందని చెప్పారు. సెక్రటేరియట్, రాజ్‌ భవన్, సీఎం క్యాంప్‌ కార్యాలయానికి గిగా స్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందించాల్సిందిగా కోరారు. కంపెనీ ప్రస్తుతం 200 ప్రభుత్వ స్కూళ్లకు ఉచితంగా ఇంటర్నెట్‌ను అందిస్తోంది. మరిన్ని స్కూళ్లకు ఈ సేవలను విస్తరించాలని మంత్రి సూచించారు. వైఫై ప్రాజెక్టు ఏప్రిల్‌లో ప్రారంభం అవుతోందని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరులో నంబర్‌–1 బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీగా యాక్ట్‌ నిలిచింది.

ఆడి క్యూ3 కొత్త వేరియంట్‌ : 32.2 లక్షలు
ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి, క్యూ3 మోడల్‌లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. 1.4 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కొత్త వేరియంట్‌ ధర రూ.32.2 లక్షలుగా (ఎక్స్‌ షోరూమ్, న్యూఢిల్లీ) నిర్ణయించినట్లు  కంపెనీ తెలిపింది. ఈ ఆడి క్యూ3 పెట్రోల్‌ వేరియంట్‌ 16.9 కి.మీ. మైలేజీనిస్తుందని, 0–100 కిమీ. వేగాన్ని 8.9 సెకన్లలోనే అందుకుంటుందని తెలియజేశారు. పెట్రోల్‌ ఇంజిన్‌తో కూడిన కంపెనీ ఏకైక ఎస్‌యూవీ ఇదొక్కటే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement