breaking news
Act fiber net
-
యాక్ట్ ఫైబర్‌నెట్ గిగా స్పీడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ సర్వీసుల రంగంలో ఉన్న యాక్ట్ ఫైబర్‌నెట్ గిగా స్పీడ్స్ జాబితాలోకి చేరింది. భారత్‌లో 1 జీబీపీఎస్ (1024 ఎంబీపీఎస్) డౌన్లోడ్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తున్న తొలి కంపెనీగా రికార్డుకెక్కింది. అయితే ఈ సేవలకు హైదరాబాద్ వేదిక కావడం విశేషం. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా యాక్ట్ ఫైబర్‌నెట్ గిగా ప్లాన్‌ను గురువారమిక్కడ ఆవిష్కరించింది. దేశంలో ఇంటర్నెట్ సగటు వేగం 2.5 ఎంబీపీఎస్ ఉంది. దేశ సగటు కన్నా హైదరాబాద్‌లో నెట్ స్పీడ్ 400 రెట్లు అధికం అయిందని కంపెనీ సీఈవో బాల మల్లాది ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఇంటర్నెట్ విస్తరణ పరంగా భాగ్యనగరి దేశంలో టాప్–1లో ఉందన్నారు. ప్రపంచంలో కొన్ని దేశాల్లోనే గిగా స్పీడ్ అందుబాటులో ఉందని చెప్పారు. విస్తరణకు రెండేళ్లలో రూ. 1,200 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. యాక్ట్ గిగా ప్లాన్ ధర నెలకు రూ.5,999గా నిర్ణయించారు. దీని కింద 1 టీబీ (1024 జీబీ) డేటా ఉచితం. 3,000 వైఫై హాట్‌స్పాట్స్..: గిగా స్పీడ్ జాబితాలో హైదరాబాద్ చేరడం గర్వంగా ఉందని తారక రామారావు అన్నారు. భాగ్యనగరిలో బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు నెలకు సగటున 75 జీబీ డేటా వాడుతున్నారని గుర్తు చేశారు. నగరంలో 3,000 వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటవుతున్నాయని వెల్లడించారు. వీటిలో 1,000 హాట్‌స్పాట్స్‌ను యాక్ట్ ఫైబర్‌నెట్ నెలకొల్పుతోందని చెప్పారు. సెక్రటేరియట్, రాజ్ భవన్, సీఎం క్యాంప్ కార్యాలయానికి గిగా స్పీడ్ ఇంటర్నెట్ను అందించాల్సిందిగా కోరారు. కంపెనీ ప్రస్తుతం 200 ప్రభుత్వ స్కూళ్లకు ఉచితంగా ఇంటర్నెట్ను అందిస్తోంది. మరిన్ని స్కూళ్లకు ఈ సేవలను విస్తరించాలని మంత్రి సూచించారు. వైఫై ప్రాజెక్టు ఏప్రిల్‌లో ప్రారంభం అవుతోందని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరులో నంబర్–1 బ్రాడ్‌బ్యాండ్ కంపెనీగా యాక్ట్ నిలిచింది. ఆడి క్యూ3 కొత్త వేరియంట్ : 32.2 లక్షలు ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి, క్యూ3 మోడల్లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. 1.4 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కొత్త వేరియంట్ ధర రూ.32.2 లక్షలుగా (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆడి క్యూ3 పెట్రోల్ వేరియంట్ 16.9 కి.మీ. మైలేజీనిస్తుందని, 0–100 కిమీ. వేగాన్ని 8.9 సెకన్లలోనే అందుకుంటుందని తెలియజేశారు. పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన కంపెనీ ఏకైక ఎస్యూవీ ఇదొక్కటే. -
ఇక యాక్ట్ ఫైబర్ వైఫై జోన్లు
డిసెంబర్‌కల్లా హైదరాబాద్ అంతటా - ఏప్రిల్ నుంచి వైజాగ్‌లో ఇంటర్నెట్ సేవలు - 3-5 ఏళ్లలో మరో రూ. 2,000 కోట్ల పెట్టుబడి - ఇక నుంచి యాక్ట్ ఫైబర్‌నెట్‌గా పేరు: బీమ్ టెలీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమ్ టెలీ పేరిట బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలందిస్తున్న బీమ్ ఫైబర్ పేరు మారింది. యాక్ట్ ఫైబర్‌నెట్‌గా పేరు మార్చుకున్న ఈ సంస్థ... వైఫై జోన్లను ఏర్పాటు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ ఇనార్బిట్ మాల్లో తొలిసారిగా వైఫై జోన్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం అనుమతిస్తే డిసెంబర్‌కల్లా హైదరాబాద్‌లో ఈ జోన్లను అందుబాటులోకి తేనుంది. వినియోగదార్లకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ జోన్ల ద్వారా నాణ్యమైన ఇంటర్నెట్ను అందిస్తామని యాక్ట్ (అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్) ఎండీ సి.ఎస్.సుందర్ రాజు చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తామని, తమ సేవలతో దేశంలో సంచలనం సృష్టిస్తామని తెలిపారు. సోమవారమిక్కడ సంస్థ సీఈఓ బాల మల్లాది, ఇండియా వా ల్యూ ఫండ్ పార్ట్నర్ ప్రమోద్ కోబ్రతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టెక్నాలజీపై భారీగా వెచ్చిస్తున్నామని, దేశంలో అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తున్నామని తెలియజేశారు. ఏటా ఒక నగరం.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బీమ్‌ను బెంగళూరు కంపెనీ యాక్ట్ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది. యాక్ట్‌లో మెజారిటీ వాటా ఇండియా వాల్యూ ఫండ్‌కు (ఐవీఎఫ్) ఉంది. బెంగళూరు, చెన్నై, విజయవాడ, నెల్లూరు, ఏలూరులో యాక్ట్ పేరుతో, హైదరాబాద్‌లో బీమ్ బ్రాండ్‌తో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ఉంది. ఇక నుంచి దేశవ్యాప్తంగా యాక్ట్ ఫైబర్‌నెట్‌గా సేవలందించనుంది. ఏప్రిల్‌లో వైజాగ్‌లో ప్రవేశించటంతో పాటు సంస్థ ఏటా ఒక ప్రధాన నగరంలో అడుగు పెట్టనున్నట్లు గ్రూప్ సీఈవో బాల మల్లాది చెప్పారు. ఇప్పటికే రూ.1,000 కోట్లు వ్యయం చేశామని, 3-5 ఏళ్లలో రూ.2,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పారు. మూడేళ్లుగా పరిశ్రమ వృద్ధి 3 శాతమైతే, యాక్ట్ 43 శాతం వృద్ధి నమోదు చేసిందని ప్రమోద్ కోబ్ర తెలిపారు. దక్షిణాదికే బ్రాండ్ పరిమితమైనప్పటికీ, వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో భారత్‌లో బీఎస్ఎన్ఎల్, భారతి ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్ తర్వాతి స్థానం యాక్ట్దేనని ఆయన చెప్పారు. 100 ఎంబీపీఎస్ స్పీడ్.. రిటైల్ కస్టమర్ల కోసం ఇన్క్రెడిబుల్ 100 ఎంబీపీఎస్ స్పీడ్ ప్యాక్‌ను యాక్ట్ ఫైబర్‌నెట్ ప్రకటించింది. నెలవారీ చార్జీ రూ.2,799తో 200 జీబీ డేటా ఉచితంగా అందిస్తారు. అలాగే కంపెనీల కోసం 1 టీబీ డేటా లిమిట్‌తో 250 ఎంబీపీఎస్ స్పీడ్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. నెలవారీ చార్జీ రూ.4 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్పీడ్‌తో ప్యాక్‌లు రావడం భారత్‌లో తొలిసారి. కాగా, యాక్ట్ గ్రూప్‌కు 6.5 లక్షల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షనుండగా వీటిలో హెదరాబాద్లో 4.5 లక్షలున్నాయి. నెలకు 20 వేల కొత్త కనెక్షన్లు వస్తున్నాయి. కనెక్షన్లను ఈ ఏడాదిలో 10 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.