రాశి ఫలాలు (సౌరమానం)

Weekly Rasi Phalalu 24-08-2019 - Sakshi

జన్మనక్షత్రం తెలియదా? నో ప్రాబ్లమ్‌! మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (ఆగస్టు 24 నుంచి30 వరకు) మీ రాశి ఫలితాలుడా‘‘ మైలవరపు శ్రీనివాసరావుజ్యోతిష్య పండితులు

మేషం(మార్చి 21 –ఏప్రిల్‌ 19)
ఏదో తెలియని తీరులో ఊహించకుండా ఎందుకో ధనం వచ్చే అవకాశముంది. దాంతో కొద్దిగా ఇంటినో వాహనాన్నో మరి దేన్నో మరమ్మతు చేయించుకుందామనే ఆలోచన రావచ్చు. మంచిదే. అయితే ఆదాయం ఎంత వచ్చిందో దానికి సరిపడ్డంత మరమ్మతునే చేయించండి తప్ప, స్థాయి మించి ఆదాయానికి మించి ఖర్చు చేయకండి. విశేషించి రుణం చేసి మరీ ఆ పనిని పూర్తి చేయాలని అనుకోకండి. మంచిది కాదు. మరమ్మతుని నాలుగు భాగాలుగా విభజించుకుని ఏ విభాగం వరకు సరిపోతుందో గమనించుకుని అంతవరకే పూర్తి చేసుకోండి.
గురు శని కేతువుల అననుకూలత కారణంగా చిన్న చిన్న ఆపదలూ వాగ్వివాదాలూ తాత్కాలిక అనారోగ్యాలూ రావలసి ఉన్నా, ఒకవేళ వచ్చినా అవన్నీ సమసిపోతాయే తప్ప కుత్తుక మీదికి రానే రావు. దీనిక్కారణం మీకు ప్రస్తుత దశలో ఉన్న దైవ అనుకూలత మాత్రమే. ముఖ్యంగా ఉద్యోగంలో అపనిందా ఒడిదొడుకులూ ఉండకపోవడమంటే దైవకృప మాత్రమే కారణం.
ఇనుమే అయినా కొంతకాలానికి ఎలా చల్లబడుతుందో, వేసవి ఎండ కారణంగా వాతావరణం వేడితో నిండినా చినుకు పడితే ఎలా ప్రశాంతమౌతుందో అలా కోపం వచ్చినా చల్లబడటం కోసం పూనికతో ప్రయత్నించండి. విజయం మీదే. మానసిక శాంతీ మీదే. ఇబ్బందీ విఘ్నమూ లేకుండా లేదు. అయితే వెంటనే ఆ వచ్చిన కష్టాన్ని దాటగల ఉపాయం బుద్ధికి తోచే కారణంగా ‘ఇబ్బంది వచ్చింద’నే విషయాన్ని దాదాపుగా గుర్తుంచుకోనే గుర్తుంచుకోరు– గుర్తించలేదు కూడా. అంతమాత్రాన పట్టించుకోకుండా ఉండకండి. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగానే వ్యవహరిస్తూ ఉండండి. మొత్తం మీద సుఖ దుఃఖ మిశ్రమ వాతావరణమే ఉంటుంది ఈ వారంలో. భయపడిపోవాల్సిన అవసరం మాత్రం లేదు.

లౌకిక పరిహారం: వాద వివాదాలకి వెళ్లకండి. ప్రణాళికని మించి వ్యయం చేసుకోకండి.
అలౌకిక పరిహారం: కృష్ణాష్టమి సందర్భంగా పిల్లలకి తీపి పదార్థాన్ని పంచుకోండి.

వృషభం  (ఏప్రిల్‌ 20 –మే 20)
చెరువు నిండుగా ఉన్నప్పటికీ వెళ్లే మార్గం మొత్తం జిగురు బురదతో ఉన్న పక్షంలో ఎలా ఆ నీటిని వాడుకోలేమో, చూసి మాత్రమే సంతోషిస్తామో అలాగే చేతినిండుగానూ, బ్యాంకుల్లోనూ పుష్కలంగా సొమ్ముండి కూడా దేనిమీదనూ సాహసించి పెట్టుబడి పెట్టలేని స్థితిలో ఉంటూ అనుక్షణం అవకాశం జారిపోతోందనే మానసిక చింతతో గడపచ్చు ఈ వారాన్ని. అదీ మంచికే. ఎక్కడో పెట్టుబడి పెట్టి నష్టపోయామని తెలిశాక, తిరిగి లాక్కోలేక తీవ్ర మనస్తాపంతోపాటు పిల్లల మాటల్ని పడడం కంటే నిర్ణయాన్ని తీసుకోకపోవడమే మంచిది. అనుకూలురితోపాటు అననుకూలురు కూడా మీ వద్దకి రావచ్చు ఏదో పనిమీద. నాలుక చివరినుండి మాత్రమే మాట్లాడి పంపండి తప్ప, హృదయపూర్వకంగా పలకరిస్తూ పరిచయానికి చిగుళ్లు తొడిగేలా చేసుకోకండి. ఒకప్పుడు పరిచయం కావడం తెగిపోవడమంటూ అయ్యాక మళ్లీ వాళ్లు మీ దగ్గరకి రావడంలో దృష్టి సరిగా   ఉండదని గ్రహించుకోండి. నటనే అని గమనించుకోండి. పాదాలకీ మోకాళ్లకీ సంబంధించిన రుగ్మత గాని అనిపిస్తే వైద్యచికిత్స చేయించుకోవడం కంటె వాటికి విశ్రాంతినిస్తూ వ్యాధిని పెరిగేలా చేసుకోకుండా ఉండడమే మంచిది. నూతన పరిచితులతో ఎంత వరకుండాలో–అలాగే వారినెంతలో ఉంచాలో తెలుసుకుని ప్రవర్తించడం ఎంతైనా అవసరం. అష్టమ శని కారణంగా అప్రమత్తంగానే ఉండి పరిస్థితిని తారుమారు కాకుండా రక్షించుకుంటూ ఉండండి. వ్యవసాయదారులకీ లోహ వ్యాపారులకీ పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకి పని ఒత్తిడి పెరగచ్చు. మానసికమైన ఆందోళనగా ఉండచ్చు. వృత్తిని నిర్వహించుకునే వారికి ముడివస్తువులూ పని చేసేవాళ్లూ లభించకపోవచ్చు. ముందుకి ముందే పనులు పూర్తిగా పూర్తి కావనే నిశ్చయ బుద్ధితో ఉంటే నిరుత్సాహ పడాల్సిన అవసరం ఉండదు.

లౌకిక పరిహారం: పూర్తిగా పనులు పూర్తి కావనే స్థిరాభిప్రాయంతో ఉండండి. దిగులు పడద్దు.
అలౌకిక పరిహారం: కృష్ణాష్టమి సందర్భంగా దేవాలయంలో భగవద్గీతని యథాశక్తి చదువుకోండి.

మిథునం(మే 21 –జూన్‌ 20)
కుటుంబంలో దంపతుల మధ్య సయోధ్య అంతగా ఉండకపోవచ్చు. దాంతో జీవితాల్ని యాంత్రికంగా నెట్టుకుంటూ వస్తూండవచ్చు. భార్య/ భర్త తమంత తాముగా ఓ నిర్ణయాన్ని స్వతంత్రించి తీసుకోవడమనే మౌలిక విధానాన్ని గనక అవలంబిస్తే తప్పక పరిస్థితులు తోవకి వస్తాయి. శరీరంలో ఆకలి లేని పక్షంలో అన్నం తినలేం. తినని కారణంగా శారీరక నీరసం. దాని కారణంగా మానసిక నిరుత్సాహం ఎలాగో అలాగే దాంపత్య అన్యోన్యత లేమి అనేది చేస్తుండే వృత్తి ఉద్యోగ వ్యాపారాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఆలోచించుకుని ఉభయులూ ప్రవర్తించండి పరిష్కార దిశగా.
ఏదైనా దూరభార ప్రయాణమే గనక చేయాల్సి వస్తే సిగ్గుపడకుండా– ఆ ప్రయాణం వల్ల కలిసొచ్చేది ఎంత? అని ఆలోచించుకుని కేవలం ప్రయాణ  శ్రమ మాత్రమే మిగులుతుందన్న  పక్షంలో ఏదో వంక చెప్పి తప్పించుకుని తర్వాత నలుగురిలో దొరికి పోవద్దు. నిష్టూరంగా నిర్భయంగా నిజాన్నే చెప్తూ– రాలేనని ముందుకి ముందే చెప్పెయ్యండి. కారణాన్ని అడిగితే ఓ చిరునవ్వు నవ్వండి. చాలు.
ఇళ్లూ పొలాలూ భూములూ ఇతరమైన కట్టడాలూ గాని ఉన్నట్లయితే కనీసం పక్షం (15 రోజులకైనా ఓమారు పోయి పరిశీలించుకుంటూ ఉండండి తప్ప, ఎవరో బీదలకి ఆశ్రయమిస్తున్నానుకుంటూ ఎవరినీ చేరనీయకండి. ఆప్తులు, బంధువులు, ఇంకా ఎరిగున్నవాళ్లు సిఫారసు చేసినా కూడా ప్రస్తుతపు దశ సరిగా లేని కారణంగా ఎవరికీ చోటు పెట్టకండి.  వివాహ ప్రయత్నాల్లో మీరు మధ్యవర్తిత్వాన్ని వహించద్దు. పరస్పర వాగ్వివాదాల్లో తీర్పరిగా అసలుండద్దు. ‘నా కుటుంబంలోనే ఒడిదుడుకులుంటే ఎదుటివారి వివాదాలు నాకెందుకు?’ అనే దృక్పథంతో ఉండండి. అత్తమామలతో తగుమాత్రంగానే ఉండండి. విరోధం వద్దు. తలిదండ్రుల ఆరోగ్యస్థితిని గమనిస్తూ ఉండండి తరచు.

లౌకిక పరిహారం: దంపతులొక చోట కూర్చొని అన్యోన్యత గురించి ప్రశాంతంగా మాట్లాడుకోండి.
అలౌకిక పరిహారం: కృష్టాష్టమి సందర్భంగా వెన్నని నివేదన చేసి పిల్లలకి పంచండి.

కర్కాటకం (జూన్‌ 21 –జూలై 22)
చేయాల్సి ఉన్న ఎన్నో పనుల్ని ఓ చోట రాసుకుని ఏ పనినీ దాదాపుగా ప్రారంభించ(లే)క, ప్రారంభించిన ఏ కొన్నిటినో ముగింపుకి తేలేక అవస్థ పడుతూ ఉండచ్చు. దీనికి సంతానం దూరప్రాంతాల్లో ఉండటమో లేక మీరు చేస్తున్న పని పట్ల వాళ్లకి ఆసక్తి లేకపోవడమో... కారణం కావచ్చు. అందరి నిరుత్సాహం అసహకారం మీకు ఉన్న దశలో మీరొక్కరే ఆ పనుల్ని తలన వేసుకోడం సరైన పని కాదు. నష్టపోతున్నామనే భావన మీ ఒక్కరికీ ఉన్నంత మాత్రాన పనులు జరిగిపోవు. కొత్త ఉద్యోగం కోసం అన్వేషించాలని అనుకోవడం సరికాదు. ఉన్న ఉద్యోగాన్ని పటిష్టంగా చేసుకోవడం సరైన పని.
ఉద్యోగానికి సరైన వేళలో వెళ్లడం దగ్గర్నుండి నిర్ణీత కాలానికి నిర్ణీతమైన పనిని ముగించడం వరకూ సక్రమంగా మీరుంటే తప్పక పై అధికారుల దృష్టిలో మీ ప్రవర్తనకి ప్రశంస లభిస్తుంది. మీరు ఉద్యోగం మారాలని అనుకోవడంలో– ఆ ఊహ రావడంలో మీదైన  క్రమశిక్షణా రాహిత్యం కూడా కారణమే. లోలోపల ఆలోచించుకోండి. మీరిచ్చిన సొమ్ము తిరిగి వసూలు చేసుకోవాలంటే బెదిరింపులూ దౌర్జన్యాలూ సరికావు. మధ్యవర్తులూ పనికి రారు. బీద అరుపులు అరుస్తూ అత్యవసరంగా సొమ్ము అవసరం ఇతనికి వచ్చిందనే నమ్మకం కలిగేలా మీరు ప్రవర్తించడం తప్ప మరో మార్గం లేదు ప్రస్తుత దశ ప్రకారం. డబ్బు పోయి శని పట్టె అనే సామెతని గుర్తుంచుకోండి.
ఇంత చేసినా మొత్తం వస్తుందనే నమ్మకం తక్కువే. కొత్త ఉగాది వచ్చేలోగానే మీకు ఆ బాకీల రాక. ఆ మీద హుళక్కి అని గుర్తుంచుకోండి. ‘ఇచ్చి అడుక్కోవడమంటే ఇదే! స్థిరమైన ఆస్తుల్ని అమ్మి కొత్తవీ ఖరీదైనవీ కొనుక్కోవాలని భావిస్తారు. అది మాత్రం మంచి ఆలోచనే. తగిన విధంగా పత్రాలని పరిశీలించుకుని ఆ వ్యవహారాన్ని పూర్తి చేసుకోండి.

లౌకిక పరిహారం: ఉద్యోగపు మార్పు ఆలోచన వద్దు. బాకీలని నిదానంగా వసూలు చేసుకోండి.
అలౌకిక పరిహారం: కృష్ణాష్టమి సందర్భంగా పిల్లలకు ఆవుపాలని పంచండి.

సింహం (జూలై 23 –ఆగస్ట్‌ 22)
ఆర్థికమైన విషయాల్లో సోదరులతోనూ తలిదండ్రులతోనూ విభేదాలు వచ్చే అవకాశముంది. అది కూడా మీరు ఒకప్పుడు తీసుకుని తీర్చ(లే)ని రుణం కారణంగా మీరు అడగవలసి రావడం, వాళ్లు ప్రస్తుతం కాదనడం... తో సమస్య ప్రారంభమౌతుంది. ఆవేశాన్నీ సాహసాన్నీ చూపడం కాకుండా ఓ వారం రోజులపాటు సమస్యని వాయిదా వేసి పరిష్కారం కోసం ప్రయత్నించండి. మీరనుకున్నంత రాకపోయినా కొద్దిగా అనుకూలంగానే సమస్యకి తాత్కాలిక పరిష్కారం దొరుకుతుంది.
తలిదండ్రుల ఆరోగ్యంలో చిన్న మార్పులు గోచరించవచ్చు. వైద్యపరీక్షల్ని చేయించాల్సిన అవసరమే వస్తే అశ్రద్ధ వద్దు. ముఖ్యంగా న్యాయస్థానాల్లో ఉన్న అభియోగాల విషయమై తీరుబడి లేకుండా ఉండొచ్చు. మధ్యవర్తులతో రాజీమార్గం కోసం ప్రయత్నించుకోవడం మంచిది. లేనిపక్షంలో మీరు ఏ పనిని చేయబోయినా దొంగపోటు కంటె వాడి మెడలో ఉన్న లింగంపోటు (శివలింగపు పెట్టె కొనలు గుచ్చుకుంటూ ఉండడం) ఎక్కువన్నట్టు ప్రతి సందర్భంలోనూ న్యాయస్థానానికి వెళ్లాల్సిన అవసరాలు మరింత రావచ్చు.
ఆర్థికమైన ఇబ్బందులు ఉండవు. అయితే వస్తున్న ధనాదాయాన్ని ఏ గృహమో.. కార్యాలయమో... వంటి వాటికి వినియోగిస్తూ ఉండే కారణంగా– ఎంత వస్తోంది? ఎంత ఖర్చౌతోంది? మొత్తం ప్రణాళిక (ఎస్టిమేషన్‌) ఎంత? వంటివి తెలియకుండా పనుల్ని చేస్తూ ఉంటారు. ఇది సరికాదు.
సంతానానిక్కూడా ఈ న్యాయస్థానానికి వెళ్లాల్సిన అవసరాలు కొనసాగుతాయా? అనే దిశగా మానసిక క్షోభ జరుగుతోంది. అయితే భగవత్కృప సంపూర్ణంగా మీదెస ఉంది కాబట్టి తొందరలోనే పరిష్కారమయ్యే అవకా ముంది.

లౌకిక పరిహారం: రాజీమార్గమే మంచిది. సొమ్ముని సద్వినియోగం చేసుకోవాలి.
అలౌకిక పరిహారం: కృష్ణాష్టమి కారణంగా – పిల్లలందరికీ పప్పు బెల్లాలని పంచుకోండి.

కన్య (ఆగస్ట్‌ 23 –సెప్టెంబర్‌ 22)
భూమిలో విత్తనాలని చల్లేస్తే కాదు– పెరుగుతున్న దశలో చీడపీడలని తొలగించడానికి ఎలా కృషి చేయాల్సి ఉంటుందో అలాగే మీరు నిజాయితీగానే ఉన్నాం కదా! అనే దృష్టితో ఉండడం సరికాదు. నిష్కారణంగా మీ కార్యాలని చెడగొట్టే శత్రుభావం ఉందని గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిందే!
మిత్రులతో కలసి వినోదాలూ విహారాలూ వంటివి మానసిక ఆనందాన్ని పెంచుకోగల వారం ఇది. ఉద్యోగంలో వస్తుండే మానసిక ఆందోళన, ఆకస్మిక ఆవేశం, నోటి దూకుడుతనం వంటివన్నీ నిదానించే వారం కూడా ఇదే. సంయమనంతో ఉండడానికి అవకాశం ఉంది ఈ వారంలో. దాంతో రావాల్సిన– వచ్చే అవకాశమున్న ఘర్షణలు రాకుండా పోతాయి. ఉల్లాసంగా ఉండడానికి తోడ్పడతాయి.
మీ కుటుంబానికి ఏ తీరు చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించే తీరులో కుటుంబ సభ్యులతో పాటు సోదర సంబంధాలు కూడా మంచిగా ఉండే కారణంగా ఏ దిగులూ ఉండదు మీకు. వాహనాలని నడిపేటప్పుడూ ప్రయాణించేటప్పుడూ వీటితో పాటు యంత్రాల స్థితిగతులూ వంటి విషయాలోల భద్రతని పాటించాలి. రుణాలని చేబదులుగా ఇచ్చి పుచ్చుకోవడాల్లో కూడా రాతకోతలుండడం మంచిది. ఆ మీదట వాద వివాదాలు పడడం కంటె.
మధ్యవర్తిగా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదుగాని, ధర్మబద్ధమైన సూచన మీ వద్ద ఉన్న పక్షంలో చెప్పడం మాత్రం తప్పు కాదు. ఎదుటివారు ఆ సూచన/ సలహాని పాటించని పక్షంలో అవమానించినట్లుగా అసలు అనుకోవద్దు. మధ్యవర్తిత్వం అనేది ఎంతగా మీ విషయంలో లేకుంటే అంతగా ఆనందించండి. ఇది మీ స్వవిషయం కాదుగా! దిగులెందుకు?

లౌకిక పరిహారం: సలహా ఇయ్యడం వరకే తప్ప అవతలివారు పాటించే వరకూ వెంట పడకండి.
అలౌకిక పరిహారం: కృష్ణాష్టమి సందర్భంగా  పిల్లలకి ఆవు పెరుగుతో దధ్యోదనాన్ని చేసి పంచండి.

తుల(సెప్టెంబర్‌ 23 –అక్టోబర్‌ 22)
న్యాయస్థానంలో సాగుతున్న విషయంలో విజయానికి గట్టి అవకాశముంది. అయితే విలువైన జీవితకాలం కాస్తా ఎప్పటికప్పుడు దూరం దూరం జరిగిపోతూ ఇతమిత్థమైన నిర్ణయం ఇంకా రాని కారణంగా ఏం కాబోతోందో? ఏ నిర్ణయాన్ని తీసుకోవలసి ఉందో? రాబోయే కాలానికి ప్రణాళిక ఏమిటో... అనేదంతా అగమ్యగోచరంగా ఉంటుంది ఓ పక్క.
ఆర్థికంగా క్రమంగా కుదుటపడుతున్న కారణంగా కుటుంబ నేపథ్యంలో వచ్చిన కష్టాలూ ఎదుర్కొన్న క్లిష్ట సంఘటనలూ మీకు ఏమాత్రమూ గుర్తుకు రావు. మంచి అనుభవం కూడా వచ్చినట్లుగా భావిస్తారు. అయితే సంతానానికి చదువు విషయంలో కొంత వెనుకబాటుతనం వచ్చే అవకాశముంది గనక కొంత మనోఘర్షణ కలగవచ్చు.
సంతానాన్ని మీ వద్దే పెంచుకుంటూ ఉన్న పక్షంలో కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగరీత్యా సంతానం తలిదండ్రులూ ఉండే చోటుకే రావడం కోసం ప్రయత్నాలని ప్రారంభిస్తారు. తల్లి/ తండ్రి అనేవాళ్లు సంతానానికి దూరంగా గాని ఉన్న పక్షంలో సంతానపు ప్రవర్తన లో మార్పుని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండడం అవశ్యం.
వృద్ధులైన తల్లి/తండ్రి ఆరోగ్యంలో కొంత మార్పు కనిపిస్తూ ఉండే అవకాశముంది. తేలికపాటి ఆరోగ్యపరీక్షలు మంచిది. వీలయినంతవరకూ అస్త్ర సన్యాసం చేసి ఉండడం మంచిది.
ఇతరుల ద్రవ్యాన్ని పొందాలనే దురుద్దేశం ఉండవచ్చు. దానికోసం తపన పడడం, రాలేదే అనే చింతతో ఉండడం మంచిది ఏమాత్రమూ కాదు. సుఖమయ జీవితానికి దుఃఖాన్ని పులుముకుంటున్నట్లే. గమనించి మానుకోండి పరద్రవ్యాసక్తిని.

లౌకిక పరిహారం: మీకున్నదానితో తృప్తి పడండి. అధర్మార్జనపట్ల ఆసక్తి వద్దు.
అలౌకిక పరిహారం: కృష్ణాష్టమి సందర్భంగా చిన్న పిల్లలకు జున్నుని పంచండి.

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఏది ఎలా ఎప్పుడు జరిగితే అలాగే జరగనీ! ఆ పరిస్థితిని ఆనందకరంగా ఆహ్వానిద్దాం! అనే తీరు వైరాగ్య దృక్పథం బాగా వచ్చేసి ఉండచ్చు మీకు. నిజంగా ఆ మనోధైర్యం ఉన్న పక్షంలో ఆటుపోటులు మిమ్మల్ని ఏమీ చేయ(లే)వు ప్రస్తుత దశలో. దాదాపు 6 సంవత్సరాలుగా శని ప్రభావానికి కిందూ మీదూ పడుతున్న మీకు మంచిరోజులు రాబోతున్నాయి. కొంత లోతుగా ఆలోచిస్తే మీ సంతానాన్ని కూడా మీరు చూసుకునే వీలు ఉంyì  ఉండకపోవచ్చు అవతలివారి పట్టుదల కారణంగా. తట్టుకోక తప్పదు దశా ప్రభావం వల్ల. పర స్త్రీ/ పుర పురుష సంబంధాలు ఏమాత్రమూ మంచివి కావని గ్రహించి, మీకు మీరు ఒకటికి రెండు మార్లు ఆ విషయాన్ని గురించి ఆలోచించుకుని, కుటుంబాలెన్నో మిమ్మల్ని మీరు తోవలో పెట్టుకోండి. లేనిపక్షంలో పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లవుతుంది. ఆ మీదట చింతించి ప్రయోజనం లేదు. పరిస్థితులు కారాగారం దాకా కూడా వెళ్లచ్చు. చేస్తున్న లేదా ఎంచుకున్న ఉద్యోగంలో పని ఒత్తిడి ఊహించిన దానికంటె మరింతగా ఉండే కారణంగా మీ కుటుంబాన్ని గురించి ఆలోచించుకునేందుక్కూడా సమయం చిక్కక పోవచ్చు. ఉద్యోగపు స్థిరత్వం కోసం కొత్త చదువుని కూడా చదవ వలసిన అవసరం రావచ్చు. ఓ దశలో ఈ ఉద్యోగం నుండి మరో ఉద్యోగానికి మారడమే మంచిదనే తలంపుకి వచ్చే అవకాశముంది కూడా. అయితే ప్రస్తుత దశలో ఉద్యోగపు మార్పు మంచిది కాదు– సాధ్యం కాదు కూడా. అనుభవించడమే చేయగల పని.
నూతనమైన ఇంటినీ పొలాన్నీ లేదా రెంటినీ సమకూర్చుకోగలుగుతారు. నిలవ చేసుకున్న దానితో మంచి సౌకర్యాలని అనుభవించడం కోసం తగిన ప్రణాళికల్ని మీదైన శైలిలో వేసుకుంటారు. ఇల్లంతా పటిష్టంగా ఉన్నా ప్రధాన ద్వారం లేనట్టుగా జీవిత కష్టం కారణంగా నిరాశతో ఉంటారు.

లౌకిక పరిహారం: ఏది ఎలా జరిగితే అది మీ మంచికేనన్న ధోరణిలోనే ఉండండి.
అలౌకిక పరిహారం: కృష్ణాష్టమి సందర్భంగా పిల్లలతో మంచి ఆటల్ని ఆడించండి ఓ రోజున.

ధనుస్సు(నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఉద్యోగం, వృత్తి, వ్యాపారమనే వాటిని మీరెంతో కాలం నుండి చేస్తున్నప్పటికీ సమయ నియమపాలనమనేది ఇంకా మీకు అలవడి ఉండకపోవచ్చు. ఈ కారణంగా ఓ చిన్న ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశముంది కాబట్టి ఈ వారంలో మాత్రమే సమయ నియమాన్ని పాటించడం కాకుండా ఆ నియమాన్ని గట్టిగా పాటించి తీరాల్సిందే! అనే దృఢాభిప్రాయానికి రండి. దెబ్బ తగిలాక వైద్యం చేయించుకోవడం కంటె ముందే జాగ్రతపడడం మంచిది. దూర భార ప్రయాణాలని మిత్రుల జన్మదినాల కోసం, బంధువుల ఇళ్లలో ఉత్సవాల కోసమంటూ చేయకండి. శారీరకమైన చిన్న అనారోగ్యం – ముఖ్యంగా కీళ్ల పట్టుల్లో చిన్న తేడాలూ అలాగే మడమలూ నడుమూ వంటి ప్రదేశాల్లో బెణుకునొప్పులూ వంటివి వచ్చి ఉండడం లేదా వచ్చే అవకాశాలున్న కారణంగా వ్యాధుల వైపుగా శరీరాన్ని పరిగెత్తేలా చేయడం ఎంత మంచిది? ప్రయాణాలని తక్కువ చేయండి. ఉద్యోగపు ఒత్తిడీ వ్యాపారంలో మానసిక చింతా వృత్తిలో గట్టిపోటీ ఉండి తీరుతుంది ప్రస్తుత గ్రహస్థితి కారణంగా. ఆ కారణంగా తీవ్ర ఆలోచనలని చేస్తూ కాలం సహకరించక – సకాలంలో భోజనం సకాలంలో నిద్రా మీకు కలిసొచ్చినట్లూ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలిసొచ్చినట్లూ మీదే విజయం అయినట్లూ భావిస్తారు గాని శారీరక ఆరోగ్యాన్ని నష్టపరుచుకుని సంపాదించి, ఆ ద్రవ్యాన్ని వైద్యులకి పెట్టాల్సి వస్తుందనే తీరులో ఆలోచించుకోండి. మన సంపాదనని మన కుటుంబ సభ్యులు కదా అనుభవించాలి. యోచన చేసుకోండి. కార్మికులకి నాయకునిగా, ఉద్యోగులకి ప్రతినిధిగా ఉండవలసిందిగా ప్రోత్సాహాలూ ఒత్తిడులూ రావచ్చు. ఓ దశలో మీకూ ఆనందమన్పించవచ్చు. అది పూర్తిగా ప్రమాదకరం. వద్దు వద్దు.

లౌకిక పరిహారం: ఓ సంస్థకో కొంతమందికో ప్రతినిధిగా ఉంటూ సమస్యా పరిష్కారాలకి ప్రయత్నించడం మానుకోండి. ఎవరికీ నాయకత్వం వహించవద్దు.
అలౌకిక పరిహారం: కృష్ణాష్టమి సందర్భంగా పిల్లలందరికీ కృష్ణ కథని అర్థమయ్యేలా చెప్పండి.

మకరం(డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఎప్పుడో నాటి మొక్క ఇప్పటికి అక్కరకు వచ్చి పువ్వుల్నీ పిందెల్నీ కాయల్నీ కాసి మొత్తానికి రుచికరమైన ఫలాలని అందించినట్టుగా, గతంలో ఎప్పుడో కొందరికి మీరు చేసిన మేలు మీకు విశేష సహాయానికి తోడ్పడుతుంది. మానసికమైన ధైర్యాన్ని కలుగజేస్తుంది. దాదాపుగా ఇక మీకు వివాహమే కాదనుకున్న నిర్ణయానికి వచ్చేసిన కాలంలో అనూహ్యంగా వివాహ ప్రయత్నం నెరవేరుతుంది. ఎంత ఆదాయం వస్తుందో అంతకి సరిపడిన వ్యయం దాదాపుగా సిద్ధంగా ఉండచ్చు కాబట్టి వ్యయాన్ని కొంత అదుపులో ఉంచుకోవడం అవసరం. ఆదాయం అంతే ఉంటుంది. అది మన చేతిలో లేదు గాని వ్యయమనేది మన చేతిలో ఉండేదేగా! గమనించుకోండి. ఎక్కువగా బంధుమిత్రులకి ఆడంబరం అట్టహాసం చేస్తూ ఖర్చు చేసినంతకాలం పొగిడినవాళ్లే ఒక్క రూపాయిని రుణంగా అడిగితే చాలు.. వాళ్ల నిజరూపాన్ని చూపించేస్తారు. మీకు మానసికంగా తీవ్ర నిరుత్సాహాన్ని కలగజేసేస్తారు. జాగ్రత! ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని పన్నులనీ – అలాగే ప్రభుత్వానికి చూపవలసిన అన్ని లెక్కలనీ – సమర్పించాల్సిన పత్రాలనీ సకాలంలో చేసుకోవడం మంచిది. ప్రస్తుత దశ అంత గొప్పగా లేని కారణంగా జరిమానా రూపంలో ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ తీవ్ర ఆర్థిక మాంద్యానికి లోను కావచ్చు. ఇటు చెల్లించక తప్పదు. అటు మానసికమైన దిగులునీ పడచ్చు. ‘ఎందుకంత చేసుకోవాలి?’ అని ముందుకి ముందే జాగ్రతపడండి. నిండుకుండా పాడికుండా వంటి ఈ ఉద్యోగం నుండి మరో ఉద్యోగానికి మారుదామనే ఆలోచనని పూర్తిగా విరమించుకోండి. ‘తెలిసిన దయ్యం కంటె తెలియని పిశాచం మంచి’దనే ఊహతో ఉండకండి. సొమ్ముని జీతంగా ఇచ్చే సంస్థలన్నీ కఠినంగానే వ్యవహరిస్తాయి. మానసిక బాధని కలిగిస్తూనే ఉంటాయి. సున్నితమైన హృదయాన్ని దెబ్బకొడుతూనే ఉంటాయి. అది సర్వసాధారణమని అనుకోండి.

లౌకిక పరిహారం: ఈ ఉద్యోగం మానేస్తే లభించబోయే ఉద్యోగం ఇంతకంటె గొప్పదని అనుకోకండి.
అలౌకిక పరిహారం:కృష్ణాష్టమి సందర్భంగా పిల్లలకి కృష్ణవేషాలని వేసి వినోదించేలా చేయండి.

కుంభం  (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వ్యాపారాభివృద్ధికోసం ఎవరెవరి దగ్గర రుణాలని తీసుకున్నారో, వాటన్నింటినీ క్రమంగా తీర్చే ప్రణాళికని వేసుకోవడం, రుణదాతలని సమావేశపరిచి మీరు తీర్చే విధానాన్ని విడమరిచి చెప్పడం మంచిది. మీరు క్రమంగా వ్యాపారాన్ని విదేశాలక్కూడ విస్తరింప జేసే ఆలోచనలతో ఉంటూ రుణదాతలతో సంప్రదింపుల్లేకుండా ఉన్న కారణంగా కొంత వ్యతిరేకత వాళ్లలో పెరిగి ఉండచ్చు. పరిస్థితిని సరిచేసుకోండి. వాగ్దానాలని చేయద్దు. నిజంగా చేయగలపనినైనా ‘చేసే అవకాశముంది. చేయగలనని అనుకుంటున్నా’ననే తీరుగా మాట్లాడండి తప్ప హామీలనీయద్దు. వివాహాలకి సంబంధించిన ప్రయత్నాలని కుటుంబంలోని వారి విషయంలో చేయదలిస్తే ప్రతి విషయాన్నీ కూలంకషంగా చర్చించుకున్న మీదటే – అంటే – వివాహాన్ని చేసుకునే ఉద్దేశ్యముందా? ఎలాంటి వ్యక్తి? ఎవరినైనా చేసుకోవాలనే ఊహ ఇంతకుముందే ఉందా? – వంటి వాటిని గమనించి మాత్రమే ఆ ప్రయత్నాలకి దిగండి. సంతానానికి విద్యలో మంచి ప్రావీణ్యం లభిస్తుంది. వాళ్ల ప్రవర్తన కూడ చక్కగా ఉండే కారణంగా మనశ్శాంతితో ఉండగలుగుతారు. మెడ నడుము మోకాళ్లు మడమలు వంటి సంధిభాగాల్లో నొప్పులు వచ్చే అవకాశముంది కాబట్టి వీలయినంత విశ్రాంతిని ఆ భాగాలకి ఈయడం మంచిది. ఔషధసేవ కంటె ముందు జాగ్రత మంచిది. వ్యవసాయదారులైన పక్షంలో పెట్టుబడులకి ఎక్కువగా వ్యయం చేయవలసి రావచ్చు. అలాగే వ్యాపారులైన పక్షంలో వ్యాపారస్థలానికి తగిన మరమ్మతులూ చేయవలసి రావచ్చు. కొంత ఆర్థికమైన పెట్టుబడిన పెట్టవలసిన కారణంగానూ, అది సద్‌ వ్యయమే (అభివృద్ధి కోసం చేసే ఖర్చు) అయిన కారణంగానూ ఆనందంగానే ఉన్నా తాత్కాలికమైన ఆర్థిక మాంద్యానికి గురికావచ్చు. వీలైనంత తక్కువ మాట్లాడుతూ ఉండండి. రుణాలని మాట తప్పకుండా తీర్చే ప్రయత్నంలో ఉండండి.

లౌకిక పరిహారం:  రుణాలని తీర్చే ప్రణాళికని పటిష్ఠం చేసుకోండి. మాట తప్పకండి.
అలౌకిక పరిహారం:కృష్ణాష్టమి సందర్భంగా పిల్లలతో కృష్ణునికి పూజని చేయించండి.

మీనం(ఫిబ్రవరి 19 – మార్చి 20)
కొత్తగా మరో వ్యాపారాన్ని చేసే ఆలోచనలో భాగంగా భాగస్వాముల కోసం వెదుకుతూ ఉండచ్చు. అయితే వ్యాపారాన్ని సొంతంగానే చేసుకునే ఆలోచనే మంచిది. తగినంత పెట్టుబడి లేని పక్షంలో భాగస్వాములని రుణదాతలుగా మార్చుకుంటూ వారి నుండి రుణాన్ని తీసుకోవడం మంచిది. ఎంత అవసరమో అంతకంటె ఎక్కువ సొమ్ముని తీసుకోవద్దు. సంతానపు ప్రవర్తనా దాంతో పాటు విద్యలో అభివృద్ధీ అలాగే మంచి కళాశాలా ప్రవేశం వంటివన్నీ నెరవేరుతాయి. అయితే వాళ్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధని వహించక తప్పదు. ముఖ్యంగా స్త్రీ సంతానమయ్యుంటే తగిన వైద్యాన్ని చేయించండి. దంతాలూ ఉదరాన్ని గురించిన జాగ్రత తప్పనిసరి. పిత్రార్జితంగా వచ్చిన గృహాన్ని విక్రయించే ఆలోచనలో ఉండచ్చు. అది మంచి మూల్యానికే వెళ్లే అవకాశముంది. అయితే రాతకోతలతో కాలక్షేపం చేయడం కాకుండా ఒక్కసారిగా ధనాన్నిచ్చి కొనుగోలు చేసేవారికోసం ప్రయత్నాన్ని చేస్తే ఫలించవచ్చు. అది మీకు మనస్తాపాన్ని కల్గించేదిగా కాకపోవచ్చు. ఒకసారంటూ ఒప్పందపు పత్రాలని (అగ్రిమెంట్‌) రాసుకున్న పక్షంలో ఆలస్యం అయ్యే అవకాశం ఎందుకో కన్పిస్తోంది. చిల్లర వ్యాపారాలకంటె గుత్త వ్యాపారులకి (హోల్‌సేల్‌) మంచి లాభాలొచ్చే అవకాశముంది. అయితే వచ్చిన వస్తువుని వచ్చినట్టుగా స్వల్పలాభంతో నెట్టెయ్యడం మంచిది తప్ప, అత్యాశతో దాన్ని నిలవచేసుకుని ఎంతో మొత్తానికి కలల్ని కంటూ కూచోడం సరికాదు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశముంది. బంధుమిత్రుల రాకపోకలు జరిగే సూచనలూ ఉన్నాయి. ముఖ్యంగా సొంత ఊళ్లో ఉన్న స్థిరమైన ఆస్తుల ధరలు అనూహ్యంగా పెరిగి ఉన్న కారణంగా ఆర్థికమాంద్యాన్ని గురించి చింత లేకుండా గడపగలుగుతారు. కష్టాలంటూ ఏమీ లేవు. ఏవైనా రాబోతున్నాయంటే దానికి అత్యాశే కారణమని భావించండి.

లౌకిక పరిహారం: అత్యాశకి పోకండి. వ్యవహారాలని సత్వరం పరిష్కరించుకోండి. సాగదీతలు వద్దు.
అలౌకిక పరిహారం:కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి ఉత్సవాన్ని సామూహికంగా జరుపుకోండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top