సీఎంపై మతవాది ముద్రవేయడం దారుణం: ఎంపీ

YSRCP MP Ragurama krishnamraju Slams Chandrababu Naidu - Sakshi

అ‍న్యమత ప్రచార ఘటనపై కఠిన చర్యలు

వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

సాక్షి, పశ్చిమ గోదావరి: పవిత్ర క్షేత్రమైన తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిపోతున్నదని రాష్ట్రప్రభుత్వంపై టీడీపీ నేతలు విషప్రచారం చేయడాన్ని నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు తీవ్రంగా ఖండిచారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అన్యమత ప్రచార టికెట్లు ముద్రితమయ్యాయని అన్నారు. గతంలో ప్రింటు చేసిన టికెట్లను కుట్రపూరితంగా తిరుపతి రూట్‌లో పెట్టారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం అమిరం వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ తప్పిదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ హెచ్చరించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూపి ఓర్వలేకనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయనపై మతవాది అని ముద్రవేయడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్టీసీ బస్‌ టిక్కెట్లు జారీ చేసే టిమ్‌ రోల్స్‌ వెనుక భాగంలో టీడీపీ సర్కారు పథకాలతో పాటు జెరూసలేం, హజ్‌ యాత్రలకు సంబంధించిన ప్రచారాంశాలను ముద్రించిన విషయం తెలిసిందే. తాజాగా దానిని సాకుగా చూపి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కుట్రకు పాల్పడుతున్నారు. ఆ టికెట్లను టీడీపీ ప్రభుత్వమే ముద్రించిందన్న విషయం సాక్ష్యాలతో సహా బైటపడడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తిరుమలలో బస్‌ టికెట్లపై అన్యమత ప్రచార ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది.

రైల్వే మంత్రికి ధన్యవాదాలు..
విశాఖపట్నం, విజయవాడ ఉదయ్‌ సూపర్‌పాస్ట్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు ఈనెల 26న ప్రారంభవుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తమ వినతి మేరకు తాడేపల్లిగూడెంలో హోల్ట్‌ ఇచ్చారని, ఈ సందర్భంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ధన్యవాదాలు తెలిపారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top