కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు దారుణం

YSRCP MLA Ravindranath Reddy Comments on CM Chandrababu - Sakshi

చంద్రబాబును చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతోంది

చిరంజీవిని ఆదర్శంగా తీసుకున్న చంద్రబాబు

కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ధ్వజం

కమలాపురం: టీడీపీ  కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకోవడం దారుణం అని, చిరంజీవి లాగే చంద్రబాబు కూడా త్వరలో టీడీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఖాయం అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్‌ పీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని, ఎన్‌టీఆర్‌ నుంచి చంద్రబాబు వరకు ఇందిరాగాంధి, సోనియా, రాహుల్‌లను విమర్శించిన వారేనన్నారు. అలాంటిది తిరిగి కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టడం దారుణం అని, ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చుతున్న చంద్రబాబును చూసి ఊసరివెల్లి కూడా సిగ్గు పడుతుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్‌ దక్కడం కష్టమేనని  జోస్యం చెప్పారు. 

ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తులు కుదుర్చుకున్నాడని, త్వరలో ఏపీలో కూడా అదే జరుగుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు ఇన్నాళ్లు ప్రజలను మాయ మాటలతో మోసం చేశారని, ప్రజలు అంతా గమనిస్తున్నారని, ఇక ప్రజలు  బాబును నమ్మరని స్పష్టం చేశారు. ఏపీలో జరిగినంత అవినీతి ఎక్కడా జరగలేదని, ఇంత చిన్న రాష్ట్రంలోనే చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్‌ లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు.   ధర్మ పోరాట సభకు సీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 1400 బస్సులు ఏర్పాటు చేసినా 25వేల మంది దాటలేదని ఎద్దేవా చేశారు.    ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మొదటి నిందితుడు ముఖ్యమంత్రి చంద్రబాబేనన్నారు. 

 బాబుతో పాటు ఆయన తోక పత్రికలకు హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు జగన్‌ అభిమానిగా కనిపిస్తున్నాడని దుయ్యబట్టారు. అభిమాని అయితే పూల మాల వేస్తాడు.. వీరాభిమాని అయితే వేలు కోసుకుని వీర తిలకం దిద్దుతాడే గాని హత్యాయత్నం చేస్తాడా అని ఆయన ప్రశ్నించారు. అలిపిరి ఘటన జరగ్గానే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దాడిని ఖండించి నిరసన వ్యక్తం చేశారని, అదీ వైఎస్‌ కుటుంబం హుందాతనం అని గుర్తు చేశారు. ఇక్కడ జగన్‌పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వి హేలన చేస్తాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ సమావేశంలో ఆ పార్టీ వైఎస్సార్‌ సీపీ జిల్లా నాయకులు సంబటూరు ప్రసాద్‌ రెడ్డి, సుమిత్రా రాజశేఖర్‌ రెడ్డి, ఎన్‌సీ పుల్లారెడ్డి, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, అల్లె రాజారెడ్డి, లక్ష్మి నారాయణరెడ్డి, సుధా కొండారెడ్డి, నారదా గఫార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top