బాబును నమ్మితే ముంచడం ఖాయం

YSRCP Leaders Slams Chandrababu Naidu - Sakshi

600 హామీల్లో 60 కూడా నెరవేర్చలేదు

చంద్రబాబు పట్ల ప్రజల్లో         తీవ్ర వ్యతిరేకత

ఓటమి భయంతోనే ఇష్టారీతిన హామీలు

‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, ఐజయ్య

కర్నూలు(రాజ్‌విహార్‌): చంద్రబాబును మరోసారి నమ్మితే రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచుతారని ఆలూరు, నందికొట్కూరు      వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, ఐజయ్య అన్నారు. ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో ‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమం నిర్వహించారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు, విస్మరించిన తీరు, ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అధికార దాహంతో సీఎం చంద్రబాబు గత ఎన్నికల ముందుకు 600కు పైగా హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిలో 60కూడా అమలు నెరవేర్చలేదని, దీంతో ప్రజలు తీవ్రంగా మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతు, పొదుపు, చేనేత రుణమాఫీలతోపాటు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి విషయంలో ఆయా వర్గాలను నిండా ముంచారన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారన్నారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎంఏ హఫీజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ మాత్రమే పోరాడుతోందన్నారు. హోదా కోసం గళమెత్తిన వారిపై కేసులు పెట్టి జైలుపాలు చేస్తానని హెచ్చరించిన చంద్రబాబు యూ టర్న్‌ తీసుకొని ధర్మ పోరాట దీక్షలతో నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర పరాభవం తప్పదని చెప్పారు.  

కర్నూలు నగరంలోని సాయిబాబ సంజీవయ్య నగర్‌లో ఎంఎ హఫీజ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో నిన్ను నమ్మ బాబు కార్యక్రమం చేపట్టారు. కాలనీ అంతా కలియదిరిగి చంద్రబాబు మోసాలను వివరించారు.
కల్లూరు మండలం అశ్వర్థాపురంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం చేపట్టారు. ఇందులో గ్రామ స్తులతోపాటు మండల ప్రజలు పాల్గొన్నారు.
హాలహర్వి మండలం బిలేహాల్‌ గ్రామంలో ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు, ఎంపీపీ బసప్ప, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆలూరు మండల కన్వీనర్‌ చిన్న వీరన్న, ఎంపీటీసీలు నాగేంద్ర, నాగరాజు ఆధ్వర్యంలో ఆలూరు మండలం మణేకుర్తి, ఏ. గోనెహాలు, అంగస్గల్లు గ్రామాల్లో నిర్వహించారు.
బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పంచమపేటలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం నిర్వహించారు. మండల కన్వీనర్‌ చిన్నదస్తగిరి పాల్గొన్నారు.
డోన్‌ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు ఆధ్వర్యంలోమండలంలో వెంకటనాయుని పల్లెలో, ప్యాపిలి జెడ్పీటీసీ దిలిప్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో మండలంలోని అలేబాదు, మునిమడుగు గ్రామాల్లో కార్యక్రమం జరిగింది.
కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మురళీకృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని వర్కూరులో కార్యక్రమం నిర్వహించారు. మండల కన్వీనర్‌ సురేష్‌ పాల్గొన్నారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థారెడ్డి ఆధ్వర్యంలో తుమ్మలూరు, కృష్ణరావుపేటలో కార్యక్రమం నిర్వహించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top