భవిష్యత్తు మనదే

 YSRCP Booth Committee Training Meetings - Sakshi

పార్టీ పటిష్టతే లక్ష్యం 18 నుంచి

బూత్‌ కన్వీనర్లకు శిక్షణ

వారి పనితీరే కీలకం

వైఎస్సార్‌ సీపీ శ్రేణులకు ఎంపీ సుబ్బారెడ్డి దిశానిర్దేశం

నరసాపురం: పార్టీ పటిష్టతే లక్ష్యం.. బూత్‌ కన్వీనర్ల పనితీరును మెరుగుపరిస్తే భవిష్యత్తు మనదే అని వైఎస్సార్‌ సీపీ ఎంపీ, ఆ పార్టీ ఉభయగోదావరి జిల్లాల పరిశీలకుడు వై.వి.సుబ్బారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.  ఆదివారం నరసాపురం పార్టీ కార్యాలయంలో ఆయన నరసాపురం పార్లమెంటరీ జిల్లా పరిధిలోని పార్టీ కో–ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విభజన హామీలపై నాలుగేళ్లు నోరువిప్పని తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా డ్రామాలు ఆడుతోందని, ప్రజలను మోసం చేసేందుకు మరోమారు యత్నిస్తోందని, ఆ పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని నాయకులకు సూచించారు. నియోజకవర్గాల వారీగా విడివిడిగా ఆయన సమీక్షించారు. పార్టీ పటిష్టతపై చర్చించారు.

 సూచనలు, సలహాలు ఇచ్చారు.  రచ్చబండ, పల్లెనిద్ర, గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ సుదీర్ఘంగా జరిగిన సమీక్షలో స్థానికంగా ఉన్న ఇబ్బందులపైనా ఆరా తీశారు. నియోజకవర్గాలవారీగా దీర్ఘకాలంగా ఉన్న ప్రజా సమస్యలు, ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం ఆయా సమస్యల విషయంలో వ్యవహరించిన తీరును అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌ వైఎస్సార్‌ సీపీ దేనని ఈ దిశగా కార్యకర్తలను మరింత ఉత్సాహపరచాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వంపై ఉందని సూచించారు.

బూత్‌ కమిటీల పనితీరు కీలకం..
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బూత్‌ కమిటీల నియామకాలు పూర్తయ్యాయని సుబ్బారెడ్డి తెలిపారు. బూత్‌ కమిటీల పనితీరు పార్టీకి కీలకమని స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారీగా ఈనెల 18 నుంచి బూత్‌ కమిటీల కన్వీనర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాల్సి ఉందన్నారు. కేంద్ర బడ్జెట్‌ తరహా పరిణామాలు, చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం చూసిన తర్వాత టీడీపీ బండారం బయటపడిందని, ఆ పార్టీ వ్యవహారన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ నీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలను దీనికి వేదికగా చేసుకోవాలని చెప్పారు.  ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా స్థానిక సమస్యలపై ప్రజలతో కలిసి పోరాటాలు చేయాలన్నారు.

 ఎన్నికలు ఏక్షణంలో జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ వంక రవీంద్ర,  అసెంబ్లీ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు గుణ్ణం నాగబాబు(పాలకొల్లు), గ్రంధి శ్రీనివాస్‌(భీమవరం), కవురు శ్రీనివాస్‌( ఆచంట),ï ³వీఎల్‌ నర్సింహరాజు( ఉండి), కొట్టు సత్యనారాయణ(తాడేపల్లిగూడెం), పుప్పాల వాసుబాబు(ఉంగుటూరు), ఎం.ఈశ్వరి(ఏలూరు), అల్లూరి కృష్ణంరాజు(రాజోలు), పార్టీ పరిశీలకుడు చెల్లబోయిన వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, నరసాపురం పార్లమెంటరీ యూత్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు మంతెన యోగేంద్రవర్మ(బాబు), జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు మానుకొండ ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top