కంటిపాపకు వెలుగు

YSR Kanti Velugu Program In krishna district - Sakshi

దృష్టిలోప నివారణకు ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’

అక్టోబర్‌ 10న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా శ్రీకారం

తొలిదశలో చిన్నారుల కంటి సమస్యలకు చెక్‌

అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లఅద్దాలు, శస్త్రచికిత్సలు

విశేష పథకాలు.. వినూత్న కార్యక్రమాలు.. విప్లవాత్మక మార్పులు.. ఇదీ రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన తీరు. ఈ క్రమంలోనే  ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ మరో బృహత్తర కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుడుతున్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న పెద్దల మాటలను ఉటంకిస్తూ ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ను ప్రారంభిస్తున్నారు. దీని ద్వారా దృష్టి లోపం ఉన్న వారికి ఉచితంగా పరీక్షలు చేయించి.. అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు.. ఇంకా అవసరమైతే శస్త్రచికిత్సలు కూడా ఉచితంగానే చేయించాలనే ఆదర్శప్రాయమైన విధానానికి నాంది పలుకబోతున్నారు. 

సాక్షి, కృష్ణా: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించాలనినే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నారులతో పాటు పెద్దల్లో దృష్టి లోప సమస్యల నివారణకు చర్యలు చేపట్టనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు, మందులు, శస్త్రచికిత్సలు కూడా నిర్వహించనున్నారు. అక్టోబర్‌ పదో తేదీ ప్రపంచ దృష్టి దినోత్సవం.. దీనిని పురస్కరించుకుని ఆ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పథకం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

రెండు దశల్లో..
ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తొలి దశలో 15 ఏళ్లలోపు పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. రెండో దశలో రాష్ట్రంలోని వారందరికీ నేత్ర పరీక్షలు.. అవసరమైతే శస్త్ర చికిత్సలు చేయనున్నారు.

చిన్నారులతో మొదలు..
చిన్నారుల్లో కంటి సమస్యలు మొదటి దశలోనే గుర్తించి అవసరమైన చికిత్సలు చేసి దృష్టిలోప సమస్యల నుంచి బయటపడవచ్చు. దురదృష్టవశాత్తు కొన్నేళ్లుగా విద్యార్థులకు కంటి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించడం లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమవుతూ వచ్చారు. దీని ద్వారా వేలాది మంది విద్యార్థులు కంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారు.  జిల్లాలోని 6,12,812 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు మొద టి ప్రాధాన్యత మండల, డివిజన్‌ స్థాయిలో కంటి వైద్య పరీక్షలు చేయనున్నారు.

స్క్రీనింగ్‌లో కనిపెడతారు..
వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తొలిదశలో గ్రామస్థాయిలో జిల్లాలోని విద్యార్థులకు (1 నుంచి 10వ తరగతి) అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా, టీచర్లు ప్రైమరీ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. దృష్టి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి, స్థానిక పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేసే క్యాంపులకు తీసుకువెళ్తారు. కంటి వైద్యనిపుణులు దృష్టి లోపంతో ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు మరోసారి కంటి పరీక్షలు నిర్వహించి, సమస్య ఉన్న వారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. మెల్లకన్ను, శుక్లం సమస్య ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలకు సిఫార్సు చేస్తారు.

2020 జనవరి నుంచి రెండో దశ..
రెండో దశలో పెద్దలు, వృద్ధులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 2020 జనవరిలో రెండో దశ కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆశా, అంగన్‌వాడీలు, కొత్తగా విధుల్లో చేరతున్న గ్రామ, వార్డు సచివాలయ వైద్య సహాయకులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తారు. కంటికి సంబంధించిన జబ్బులున్న వారిని గుర్తించి ఆరోగ్య ఉప కేంద్రానికి ప్రత్యేక శిబిరానికి తీసుకువెళతారు. మెడికల్‌ ఆఫీసర్, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ ప్రారంభదశలో చెక్‌ చేస్తారు. అవసరమైన వారికి కళ్లద్దాలు, శస్త్ర చికిత్సలకు సిఫారసు చేస్తారు.

అందరికీ కంటి పరీక్షలు..
ప్రభుత్వం వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం కింద ప్రజలందరికి కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించి ంది. మొదటి దశలో విద్యార్థులు, రెండోదశలో మిగిలిన వారికి. దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి అవసరమైన వారికి అద్దాలు ఉచితంగా ఇవ్వటంతో పాటు శస్త్రచికిత్సలు సిఫారుసు చేస్తాం. 
–టి. శ్రీరామచంద్రమూర్తి, డీఎంహెచ్‌ఓ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top