వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రక్తంలో చక్కెర స్థాయి బాగా తగ్గిందని, దాంతో పాటు పల్స్, బీపీ కూడా తగ్గాయని వైద్యులు చెప్పారు.
ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్తో గుంటూరులో నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు గురువారం ఉదయం మరోసారి పరీక్షించారు. ఆమె రక్తంలో చక్కెర స్థాయి బాగా తగ్గిందని, దాంతో పాటు పల్స్, బీపీ కూడా తగ్గాయని వైద్యులు చెప్పారు.
సాధారణంగా బీపీ 120/80 ఉండాలి గానీ, విజయమ్మకు 110/70 మాత్రమే ఉందని, అలాగే రక్తంలో చక్కెర స్థాయి 80 నుంచి 130 మధ్య ఉండాల్సినది 76 మాత్రమే ఉందని తెలిపారు. వైఎస్ విజయమ్మ బాగా నీరసించారని, కనీసం ద్రవాహారమైనా తీసుకోవాల్సిందిగా తాము సూచించామని అన్నారు. కానీ దానికి కూడా ఆమె నిరాకరించారని, ఆమె ఆరోగ్యం బాగుపడాలంటే తక్షణమే దీక్ష విరమించి ఆహారం తీసుకోవాలని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి చెందిన డాక్టర్లు సూచించారు. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. సాయంత్రం 6 గంటల సమయంలో మరోసారి వైఎస్ విజయమ్మకు వైద్యపరీక్షలు చేయనున్నారు.