
సాక్షి, గుడివాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) గుడివాడలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లింగవరం రోడ్ కే కన్వెన్షన్‌లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. అలాగే ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును ఆసక్తిగా తిలకించారు. జాతీయ ఎడ్ల పోటీలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్‌తో పాటు మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం వైఎస్ జగన్ సాయంత్రం 5.30 గంటకలు తాడేపల్లిలోని నివాసానికి చేరకుంటారు.
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’అని పేర్కొన్నారు.