
పేదల గుండె చప్పుడు.. వైఎస్ఆర్: మాచర్ల వైఎస్ఆర్ జనభేరిలో జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా మాచర్లలో నిర్వహించిన వైఎస్ఆర్ జనభేరికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.
మాచర్ల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా మాచర్లలో నిర్వహించిన వైఎస్ఆర్ జనభేరికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. సభ ఆలస్యంగా ప్రారంభమైనా జగన్ రాక కోసం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. జగన్ రాక సందర్భంగా మాచర్ల రోడ్లు జనసంద్రమయ్యాయి.
జగన్ ప్రసంగం ఆరంభించగానే ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తనను ఓ కుటంబ సభ్యుడిగా ఆదరిస్తూ, ఎనలేని అభిమానం చూపిస్తున్న ప్రజలకు జగన్ ధన్యవాదాలు చెప్పారు. దివంగత నేత వైఎస్ఆర్ ఎక్కడున్నారంటే.. జనం తమ గుండెల మీదు చేయిపెట్టుకుని గుండెల్లో ఉన్నారని చెబుతారని జగన్ అన్నారు. ప్రతి గుండె చప్పుడు వైఎస్ఆర్ను కోరుకుంటుందని చెప్పారు. 'వైఎస్ఆర్ పాలనకు ముందు చంద్రబాబు నాయుడనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అవి భయానక రోజులు. అప్పట్లో గ్రామాలకు వెళ్లేవాడిని. అవ్వా తాతలు నా దగ్గరకు వచ్చి కాస్త పెన్షన్ ఇప్పించు నాయనా అని అడిగేవారు. పేదలకు ముష్టి వేసినట్టు ఫించన్ ఇచ్చేవారు. అధికారులకు చెబితే గ్రామానికి కొంతమందికి ఇస్తున్నామని, కొత్తవారికి ఇవ్వాలంటే లబ్దిదారులు ఎవరైనా చనిపోవాలని చెప్పేవారు. చదువుకునే పిల్లలు వచ్చి తమ కష్టాలు చెప్పుకునేవారు. చంద్రబాబు ఏ రోజునైనా విద్యార్థులు, పేదల కష్టాల గురించి తెలుసుకున్నారా? ప్రజలు అనారోగ్యంతో, పేదరికంతో కష్టాలు పడ్డ ఆ రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి' అని జగన్ అన్నారు.
'చంద్రబాబు నాయుడు పదవీ కాంక్ష కోసం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు. కొంతమంది నన్ను కూడా అలాంటి హామీలు ఇవ్వాలని చెప్పారు. తానెప్పటికీ ప్రజలను మభ్యపెట్టను. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పను. వయసులో ఆయన కంటే నేను 25 ఏళ్ళు చిన్నవాడిని. ఎన్నికల తర్వాత చంద్రబాబు పార్టీ ఉండదు. ఎన్ని రోజులు బతికామన్నది కాదు ఎలా బతికామన్నదే ముఖ్యం. విశ్వసనీయత పాలన అందించడమే నా లక్ష్యం. అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమం కోసం నాలుగు సంతకాలు పెట్టబోతున్నా' అని జగన్ అన్నారు.