విశాలాంధ్రకు సీఎం జగనే | Sakshi
Sakshi News home page

విశాలాంధ్రకు సీఎం జగనే

Published Mon, Oct 21 2013 3:48 AM

ys jagan mohan reddy is the cm to vishalandhra

 నాయుడుపేటటౌన్, న్యూస్‌లైన్: విశాలాంధ్రకు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పసల పెంచలయ్య నాయుడుపేటలో తన నివాసంలో ఆదివారం మేకపాటి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పెంచలయ్యకు పార్టీ కండువా కప్పి మేకపాటి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మేకపాటి మాట్లాడుతూ ప్రజాసేవ కోసం తపించే నాయకులకు వైఎస్సార్‌సీపీ ద్వారా ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. బడుగు, బలహీన వర్గాల నేతగా అంచలంచెలుగా ఎదిగిన పెంచలయ్య పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు.
 
 పటిష్టమైన నాయకత్వ లక్షణాలతో మంత్రిగా, ఎంపీగా పెంచలయ్య  చేసిన సేవలు ప్రజల్లో చిరకాలం గుర్తుండిపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికార సాధనే పరమావధిగా తెలుగు గడ్డను చీల్చే యత్నం చేస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు అన్ని విధాలా పోరాడుతామన్నారు. సుప్రీంకోర్టులో న్యాయపోరాటం, విభజన వల్ల తలెత్తే సమస్యల తీవ్రతను రాష్ట్రపతికి  వివరించడం, అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించడం లాంటి అవకాశాలతో రాష్ట్ర విభజనను అడ్డుకుంటామన్నారు. వైఎస్సార్ పాలనలో ప్రజలు సువర్ణయుగం చూశారని, యువనేత జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆ రోజులు మళ్లీ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 
 
 ఇచ్చాపురం నుంచి తడ వరకు రాజకీయ సునామీ తథ్యం : పసల
 ఇచ్చాపురం నుంచి తడ వరకు  జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ సునామీ సృష్టించడం తథ్యమని, కుటీల రాజకీయ నాయకులు ఆ సునామీలో కొట్టుకుపోతారని మాజీ మంత్రి పసల పెంచలయ్య వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన వైఎస్సార్ ఆశయాలను జగన్‌మోహన్‌రెడ్డి సాధిస్తారన్నారు. రాష్ట్రంలో 75 శాతం సీట్లు సాధించి జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో 50 వేల ఓట్ల మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడే పటిష్టమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి ఒక్క జగన్‌మోహన్‌రెడ్డేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని, యువనేత పోరాటంతో ప్రజల జీవితాల్లో వెలుగురేఖలు ప్రసరిస్తాయన్నారు.
 
 సభకు అధ్యక్షత వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడే లక్షణాలు యువనేత జగన్‌లో ఉన్నాయన్నారు. సమైక్యాంధ్ర కోసం అకుంఠిత దీక్షతో పోరాడుతున్నారన్నారు. నియోజకర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య, రాష్ట్ర యువజన కార్యవర్గ సభ్యుడు ఓడూరు గిరిధర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వేణుంబాక విజయశేఖర్‌రెడ్డి, నాయకులు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, పుట్టు వెంకటరమణమూర్తి, వెందోటి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో సమష్టిగా పనిచేసి ముందుకెళ్తామన్నారు. పెంచలయ్య లాంటి నాయకులు పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. ఆయన చేరిక కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. 
 భారీగా వైఎస్సార్‌సీపీలో చేరిక
 మాజీ మంత్రి పసల పెంచలయ్యతో పాటు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులను మేకపాటికి ఓడూరు గిరిధర్‌రెడ్డి పరిచయం చేశారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన పాపాటి రవీంద్రరెడ్డి పలువురు సర్పంచ్‌లతో కలిసి వైఎస్సార్ సీపీలో చేరారు. అలాగే ఓజిలి మండలంలోని పలువురు సర్పంచులు వైఎస్సార్ సీపీలో చేరారు. 
 
 మేకపాటికి ఘనస్వాగతం
 మేకపాటి రాజమోహన్‌రెడ్డికి కిలివేటి సంజీవయ్య, ఓడూరు గిరిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పెంచలయ్య నివాసం వద్ద ఎంపీపై రోజాపూల వర్షం కురిపిస్తూ బాణసంచా కాల్చుతూ కోలాహలం సృష్టించారు. బస్టాండ్ నుంచి పెంచలయ్య నివాసం వరకు భారీ ఎత్తున స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు మద్దాలి సోమశేఖర్‌రెడ్డి, మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, నాయకులు ఓడూరు సుందరరామిరెడ్డి, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, కామిరెడ్డి రామకృష్ణారెడ్డి, పేర్నాటి రఘురామిరెడ్డి, రాజసులోచనమ్మ, దొరై, నాగరాజు, పీ హరినాధ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement