బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలకు.. మరో వరం

YS Jagan committed to promises given by him - Sakshi

అన్ని నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పనుల్లో 50 శాతం వారికే 

అందులో సగం.. ఆ వర్గాల మహిళలకే 

ఇచ్చిన హామీలకు కట్టుబడ్డ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు

నిరుద్యోగం నిర్మూలన దిశగా అడుగులు 

టెండర్లలో అక్రమాలకు తెరదించేందుకు న్యాయపరిశీలన–పారదర్శకత చట్టం–2019  

విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణకు కమిషన్‌

‘వైఎస్‌ఆర్‌ నవోదయం’తో సూక్ష్మ,చిన్నతరహా పరిశ్రమలకు ఊరట..

రూ.4 వేల కోట్ల రుణాలు వన్‌టైమ్‌ రీ స్ట్రక్చర్‌ 

ఉచిత కరెంటుతో 15,62,684 మంది ఎస్సీలకు లబ్ధి

వారికి రూ.411 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం

ఏఎంసీల గౌరవ చైర్మన్లుగా ఎమ్మెల్యేలు

పలు కీలక ముసాయిదా బిల్లులను ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం 

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధం

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయంగా, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పనుల్లో వారికి 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అంతేకాకుండా ఈ కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు సగం దక్కేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మిగిలిన 50 శాతంలో కూడా సగం మహిళలకే కేటాయించాలని నిర్ణయించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ వారికి పెద్దపీట వేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు వీలుగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పిస్తూ కూడా ముఖ్యమంత్రి మరో విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. టెండర్లలో అవినీతి, అక్రమాలను అరికట్టడంతోపాటు పారదర్శతకు పెద్దపీట వేస్తూ న్యాయపరిశీలనపై మరో కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారు. న్యాయపరిశీలన–పారదర్శకత చట్టం–2019 ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయాలన్నింటికీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ముసాయిదా బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి... 
 
ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి గొప్ప నిర్ణయం.. 
ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, ట్రస్టులు, మార్కెట్‌ యార్డుల పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు సగం కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. అలాగే దేవాలయాల కమిటీల్లో 50 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించాలని నిర్ణయించారు. ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీకి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించడమే కాకుండా ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో ఆమోదింప చేశారు. 
 
ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేషన్‌ పనుల్లో 50 శాతం 
ప్రభుత్వ నామినేషన్‌ కాంట్రాక్టులు, సర్వీసుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించే 50 శాతం పనుల్లో ఆయా వర్గాలకు చెందిన మహిళలకు సగం కేటాయించాలనే నిబంధన విధించారు.  
  
నిరుద్యోగాన్ని రూపుమాపే దిశగా కీలక అడుగు 
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకు చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీపీపీ ప్రాజెక్టుల కింద చేపట్టిన పరిశ్రమలు లేదా ఫ్యాక్టరీలు, జాయింట్‌ వెంచర్లు, ప్రాజెక్టుల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. పరిశ్రమల కోసం భూములు కోల్పోయినవారికి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ బిల్లు  దోహదపడనుంది. నిర్వాసితుల జీవనోపాధికి గ్యారంటీ కల్పించడం కూడా ఈ ముసాయిదా బిల్లులో ముఖ్యాంశం. 
 
పరిశ్రమల కోసం ‘వైఎస్సార్‌ నవోదయం’... 
సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ‘‘వైఎస్సార్‌ నవోదయం’’ పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది, మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేలా ఈ పథకాన్ని రూపొందించారు. జిల్లాలవారీగా 86,000 ఎంఎస్‌ఎంఈల ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాలకు చెందిన రూ.4 వేల కోట్ల రుణాలను వన్‌టైమ్‌ రీ స్ట్రక్చర్‌ చేయాలని నిర్ణయించారు. నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా అవకాశం కల్పించడంతోపాటు ఎంఎస్‌ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి అవకాశం కల్పిస్తారు. దీన్ని వినియోగించుకునేందుకు 9 నెలల వ్యవధి ఇవ్వనున్నారు. త్వరలోనే ఈ పథకం ప్రారంభం కానుంది. 
 
విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణ బిల్లుకు ఆమోదం 
రాష్ట్రంలో స్కూళ్లు, ఉన్నత విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించి ముసాయిదా బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించనున్నారు. తద్వారా విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణకు త్వరలో కమిషన్లు ఏర్పాటు అవుతాయి. నాణ్యతా ప్రమాణాలు, ఫీజుల నియంత్రణ, విద్యాహక్కు చట్టం అమలుపై ఇవి దృష్టి సారిస్తాయి. 
 

 శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ నియామకం 
1993 నాటి బీసీ కమిషన్‌ చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకు రావాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనివల్ల బీసీ కమిషన్‌ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు కానుంది. తద్వారా బీసీ వర్గాల స్థితిగతులపై నిరంతరం అధ్యయానికి వీలు కలుగుతుంది. పలు వర్గాలను బీసీల్లో చేర్చాలంటూ వస్తున్న డిమాండ్లు, కేటగిరీల్లో మార్పులపై వస్తున్న వినతులను కమిషన్‌ పరిశీలిస్తుంది.  
 
బీసీలకు మరో బొనాంజా.. 
రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సాయంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిద్వారా పాదయాత్రలో ఈ వర్గాలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్‌ నిలబెట్టుకున్నట్లైంది.  
 
200 యూనిట్ల వరకు ఎస్సీలకు ఉచిత విద్యుత్‌ 
రాష్ట్రంలో ఎస్సీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 15,62,684 మంది ఎస్సీలకు రూ.411 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.  
 
లోకాయుక్త చట్ట సవరణ 
1993 నాటి లోకాయుక్త చట్టాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పదవిలో హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ లేదా మాజీ జడ్జీల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోకాయుక్తగా ఇప్పటివరకు హైకోర్టు జడ్జి లేదా మాజీ చీఫ్‌ జస్టిస్‌లకు మాత్రమే అవకాశం ఉంది. ఈ అర్హత ఉన్నవారు అందుబాటులో లేకపోవడంతో చాలా సందర్భాల్లో లోకాయుక్త ఖాళీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో అర్హతలను సడలిస్తూ హైకోర్టు మాజీ జడ్జిని కూడా నియమించేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  
 
వ్యవసాయ మార్కెట్‌ గౌరవ చైర్మన్లుగా ఎమ్మెల్యేలు 
వ్యవసాయ మార్కెట్‌ల్లో గౌరవ చైర్మన్లుగా స్థానిక ఎమ్మెల్యేలను నియమించేందుకు వీలుగా 1966 ఏపీ మార్కెట్‌ చట్టానికి సవరణలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబందించిన ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర వేసింది.  
 
టీటీడీ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్‌ను నియమించేందుకు వీలుగా దేవదాయ చట్టంలో సవరణలు తేవడాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top