ప్రజాసేవలో తరించాలన్నదే వైఎస్‌ జగన్‌ ఆశయం

YS Bharathi Reddy Election Campaign in Ankalamma Guduru - Sakshi

అంకాలమ్మగూడూరు ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ భారతిరెడ్డి

సింహాద్రిపురం: దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజారంజక పాలన అందించి ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని వైఎస్‌ భారతిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సింహాద్రిపురం మండల పరిధిలోని అంకాలమ్మగూడూరులో వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జి ఎన్‌.శివప్రకాష్‌రెడ్డితో కలిసి వైఎస్‌ జగన్‌ సతీమణి భారతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతిరెడ్డి ప్రతి ఓటరును ఆప్యాయంగా పలకరిస్తూ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి ఓటు అభ్యర్థించారు. అందరి ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌ 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారని.. ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకున్నారని తెలిపారు.

ప్రజల కష్టాలు తీర్చడానికి నవరత్నాలు ప్రవేశపెట్టారని వివరించారు. డ్వాక్రా మహిళలను లక్షాధికారులుగా చూడాలనే సంకల్పంతో జగన్‌ వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మహిళలకు రూ. 75 వేల నగదు, రైతుల కష్టాలను తీర్చడానికి ప్రతి ఏటా రూ.12,500, ‘అమ్మఒడి’ పథకం కింద బడికి పిల్లలను పంపే ప్రతి తల్లి ఖాతాలోకి రూ.15 వేలు ఇలా ప్రతి ఒక్కరి కష్టాలు తీర్చేందుకు వైఎస్‌ జగన్‌ మీ ముందుకు వచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌ను దీవించి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ మండల శ్రేణులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top