గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన యువ రైతు అనుమానాస్పద స్థితిలో ఊరి చెరువులో శవమై కనిపించాడు.
గుమ్మగట్ట (అనంతపురం జిల్లా) : గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన యువ రైతు అనుమానాస్పద స్థితిలో ఊరి చెరువులో శవమై కనిపించాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండల కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గుమ్మగట్టకు చెందిన తిప్పెస్వామి(22) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా వారం రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా ఎక్కడికో వెళ్లాడు. అయితే తల్లిదండ్రులు మాత్రం పని నిమిత్తం వెళ్లి ఉంటాడని భావించారు. కాగా మంగళవారం గొర్రెల కాపరులు గ్రామ శివారులో ఉన్న చెరువులో శవాన్ని చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో చెరువు దగ్గరకు చేరుకున్న గ్రామస్తులు మృతదేహాం తిప్పెస్వామిదిగా గుర్తించారు. చెరువు దగ్గరకు చేరుకున్న తిప్పెస్వామి తల్లిదండ్రులు.. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.