నారావారిది నరకాసుర పాలన

YCP MLA Roja Fires On TDP Government  - Sakshi

రక్తం పీల్చే జలగల్లా టీడీపీ నాయకులు

 దోచుకుని దాచుకుంటున్న చంద్రబాబు టీం

 మహిళా సదస్సులో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే రోజా

తణుకు: మహిళలంటే గౌరవం లేని, మహిళలకు రక్షణ లేని, మహిళా సాధికారత గురించి ఆలోచన లేని, మహిళా వ్యతిరేక పాలనలో మనం జీవిస్తున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా పేర్కొన్నారు. అధికారంలోకి రావడానికి రాష్ట్రంలోని మహిళల చేతులను పట్టుకుని అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. తణుకు పట్టణంలోని స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి మహిళా సదస్సులో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు.

నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రోజా మాట్లాడుతూ రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు వారిని అప్పులపాల్జేసి బ్యాంకుల్లో బ్లాకులిస్టులో పెట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు. అధికారంలోకి వచ్చాక బాధితులు ఫోన్‌ చేసిన అయిదు నిమిషాల్లో వచ్చి తాట తీస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పత్తా లేకుండా పోయాడన్నారు. కళ్లెదుటే అన్యాయం జరుగుతున్నా, తన ప్రజాప్రతినిధులే మహిళలపై దాడులకు తెగబడుతున్నా పల్లెత్తుమాట మాట్లాడకుండా వారిని వెనుకేసుకొస్తున్నారని విమర్శించారు.

 నిజాయితీ కలిగిన తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్‌ వ్యవహారాన్ని చంద్రబాబు సెటిల్‌మెంట్‌ చేయడం సిగ్గుచేటన్నారు. అంతేకాకుండా ఆయనకు ప్రభుత్వ విప్‌ పదవి కట్టబెట్టడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సైతం ఒక ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌ను కింద కూర్చోబెడితే ఎస్సైను బదిలీ చేశారు తప్ప ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 

ఇరగవరం మండలంలో ఇళ్లస్థలాల కోసం ప్రశ్నించిన మహిళల చాతీపై నెట్టివేసిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. నరసాపురంలో శ్రీగౌతమి హత్య కేసులో సైతం పక్కదోవ పట్టించిన ప్రజాప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. జిల్లాలోని తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకున్న మహిళలపై లాఠీఛార్జి చేయించి వారిని జైలులో పెట్టించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని విమర్శించారు. పేదలకు చెందాల్సిన 7.26 ఎకరాల ఇరిగేషన్‌ భూమిని తెలుగుదేశం పార్టీ నేతలకు లాభం చేకూర్చేవిధంగా వారికి కట్టబెట్టారని చెప్పారు. దండి మార్చి విగ్రహాలను సైతం వేరే ప్రాంతానికి తరలించి అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేయడం దారుణమన్నారు.

కేబినెట్‌లో కాలకేయులు
చంద్రబాబు కేబినేట్‌లో ఇద్దరు కాలకేయులు ఉన్నారని రోజా ఎద్దేవా చేశారు. అచ్చెన్నాయుడు, దేవినేని ఉమతోపాటు జిల్లాకు చెందిన చింతమనేని ప్రభాకర్‌ కూడా ఉన్నారని విమర్శించారు. నారావారి నరకాసుర పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు. రాజధాని భూములు, ఇసుక, మట్టి, ప్రాజెక్టులు ఇలా ఏదీ అవినీతికి అనర్హం కాదనే రీతిలో తెలుగుదేశం ప్రభత్వంలోని ప్రజాప్రతినిధులు దోచుకుని దాచుకుంటున్నారని అన్నారు. రేషన్, పింఛన్, ఇల్లు ఇలా ఏది కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల రక్తం పీల్చే జలగల్లా మారిపోయారని ఆరోపించారు. 

ఇక్కడ అ«ధికారంలో ఉండి ఏ ఒక్క హామీను అమలు చేయని చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ అధికారంలోకి వస్తే అన్నీ చేసేస్తాం అంటూ మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీలో కలిపేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. సిగ్గులేకుండా ఇప్పుడు చారిత్రాత్మక అవసరం అంటూ రాహుల్‌గాంధీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. ఓటు వేశాం కాబట్టి శాపగ్రస్తుల్లా బతకాల్సిన దుస్థితి తలెత్తిందని పేర్కొన్నారు.

అధికార పార్టీలోని ఎమ్మెల్యేలందరూ చట్టానికి చుట్టాలుగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్టీ  నేత జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఎక్కడ చూసినా అరాచకం, అన్యాయం జరుగుతోందని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దోచుకో దాచుకో అన్నచందంగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. అనంతరం రోజాను పార్టీ నేత కారుమూరి ఘనంగా సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో రీజనల్‌ మహిళా కోఆర్డినేటర్‌ పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరు ఉమాబాల, సాయిబాలపద్మ, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, గోపాలపురం, నిడదవోలు కోఆర్డినేటర్లు కొట్టు సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు, తలారి వెంకట్రావు, జి.శ్రీనివాసనాయుడు, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ బలగం సీతారామం, నియోజకవర్గ మహిళా అ«ధ్యక్షురాలు మెహర్‌ అన్సారీ, పట్టణ మహిళా అధ్యక్షురాలు నూకల కనకదుర్గ, పార్టీ నాయకులు ఎస్‌.ఎస్‌. రెడ్డి, బోడపాటి వీర్రాజు, పి.సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, మారిశెట్టి శేషగిరి, బలగం బాబి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top