చక్కెర చిక్కులు | Worry suggesting deposition dharaleka sugar factories | Sakshi
Sakshi News home page

చక్కెర చిక్కులు

Jan 5 2014 12:56 AM | Updated on Sep 2 2017 2:17 AM

చక్కెర చిక్కులు

చక్కెర చిక్కులు

తీపిని పంచాల్సిన చక్కెరతో కర్మాగారాలకు మాత్రం చిక్కులు మిగులుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో వెంటాడుతున్న సమస్యలతో సుగర్ ఫ్యాక్టరీలు సతమతమవుతున్నాయి.

=పడిపోయిన రికవరీ
 =ధరలేక పేరుకుపోతున్న నిల్వలతో సుగర్ ఫ్యాక్టరీల వర్రీ
 =గత ఏడాది కన్నా తక్కువ రికవరీతో పరిస్థితి అయోమయం

 
తీపిని పంచాల్సిన చక్కెరతో కర్మాగారాలకు మాత్రం చిక్కులు మిగులుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో వెంటాడుతున్న సమస్యలతో సుగర్ ఫ్యాక్టరీలు సతమతమవుతున్నాయి. రికవరీపై ఆశలతో క్రషింగ్ ముందే ప్రారంభించినా ప్రతికూల ఫలితాలతో వర్రీలే వెంటాడుతున్నాయి. చలి ఎక్కువగా ఉంటే చక్కెర దిగుబడి బాగుంటుందని అంచనా వేస్తే, అంతా తలకిందులై జిల్లాలోని నాలుగు సహకార చక్కెర కర్మాగారాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత ఏడాది రికవరీ కూడా రాక యాజమాన్యాలు కలవరపడుతున్నాయి. ఇది చాలదన్నట్టు ధర పడిపోతూ ఉండడంతో పేరుకుపోతున్న చక్కెర నిల్వలు బెంబేలెత్తిస్తున్నాయి.
 
చోడవరం, న్యూస్‌లైన్ : ఈ ఏడాది సుగర్ ఫ్యాక్టరీలు ఒడిదుడుకుల మధ్య నడుస్తున్నాయి. రికవరీ కోసం క్రషింగ్ ముందుగా ప్రారంభించినా ఆశించిన దిగుబడి సాధించలేకపోతున్నాయి. చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి సుగర్ ఫ్యాక్టరీలు ఎప్పుడూలేని విధంగా ఈ ఏడాది సీజన్‌ను డిసెంబరు మొదటి, రెండవ వారాల్లోనే చేపట్టాయి. చలి ఎక్కువగా ఉండి గాలిలో తేమ బాగా ఉంటే రికవరీ బాగుంటుంది. అయితే నవ ంబరు, డిసెంబరుల్లో చలి ఎక్కువగా ఉన్నందున క్రషింగ్ ప్రారంభిస్తే మంచి దిగుబడి వస్తుందని ఆశించాయి. ఈ ఏడాది కొత్తగా వచ్చిన  చోడవరం, ఏటికొప్పాక ఫ్యాక్టరీల పాలకవర్గాలు కూడా ఇందుకు ఆమోదం తెలిపాయి. దీంతో ఈ ఫ్యాక్టరీలు డిసెంబరులోనే క్రషింగ్ చేపట్టాయి.

అయితే ఆశించిన మేర రికవరీ రావడం లేదు. గత ఏడాది ఈ సమయంలో ఆయా ఫ్యాక్టరీలు సాధించిన రికవరీ కూడా ప్రస్తుత సీజన్‌లో రాకపోవడంతో యాజమాన్యాలు కలవరపడుతున్నాయి. అసలే పాత యంత్రాలతో అంతంతమాత్రంగా నడుస్తున్న ఫ్యాక్టరీలు ముందస్తు క్రషింగ్‌తోనైనా కోలుకోవచ్చన్న ఆశలు సన్నగిల్లాయి. దీనికి తోడు క్రషింగ్‌కు ముందే తుఫాను వర్షాలు భారీగా కురిసి తోటల్లో నీరు నిల్వ ఉండిపోవడంతో దిగుబడి పడిపోయింది. గోవాడ లాంటి పెద్ద ఫ్యాక్టరీ శనివారం నాటికి ల క్షా12 వేల టన్నులు క్రషింగ్ చేసింది.

ఈ ఏడాది 5.30 టన్నులు లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే ఒక వంతు క్రషింగ్ చేసింది. 85,078 క్వింటాళ్ల పంచదార ఉత్పత్తి అయ్యింది. రోజు వారి రికవరీ 9.10 వచ్చినప్పటికీ సరాసరి మాత్రం 8.29శాతం నమోదైంది. గతేడాదితో పోల్చుకుంటే .55 శాతం తక్కువ. గత డిసెంబరు నెలాఖరులో క్రషింగ్ ప్రారంభించినప్పటికీ ఇదే సమయానికి 52 వేల టన్నులు క్రషింగ్ చేసి సరాసరి రికవరీ 8.83 సాధించింది.

ఆశించిన రికవరీ రాకపోవడం, క్రషింగ్ వేగంగా జరగడంతో ఫ్యాక్టరీలకు నష్టం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క మార్కెట్‌లో పంచదార ధర రోజురోజుకి క్షీణిస్తుండటం వల్ల గొడౌన్లలో చక్కెర నిల్వలు భారీగా పెరిగిపోతున్నాయి. గత జులై నుంచి అనుకున్న స్థాయిలో ఫ్యాక్టరీలు పంచదార  అమ్మలేకపోయాయి. ధర లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో యాజమాన్యాలు ఉన్నాయి. కనీసం జనవరిలోనైనా రికవరీ పెరిగి, మార్చి నెలాఖరు వరకు కొనసాగితే తప్ప లేకపోతే తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement