మహిళలుమహారాణులు


అనురాగం, అనుబంధం, ఆత్మీయతల కలబోత ఆమె. అన్యోన్యతకు నిలువెత్తు నిదర్శనం. తల్లిగా, చెల్లిగా, సహధర్మచారిణిగా మహిళ పోషించే ప్రతి పాత్ర అద్వితీయం.. అద్భుతం. భేషజాలకు తావులేని మమకారం, కష్టసుఖాలకుఒకే రకంగా స్పందించే స్థితప్రజ్ఞత స్త్రీమూర్తికి మాత్రమే సొంతమైన ఆభరణం. పురుషులతో సమానంగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఇల్లాలు సహనం, ఓర్పుతో అన్నింటా విజయదుందుభి మోగిస్తోంది. ‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే..’ అన్నట్టు చదువులోనూ సత్తా చాటుతోంది. ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయంగానూ కీలక పదవులు అధిరోహించి మహిళ అంటే మహారాణి అనే స్థాయికి చేరింది. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన  జిల్లాలో వివిధ రంగాల్లో దూసుకెళ్తున్న నారీలోకంలో కొందరిని ‘సాక్షి’ పరిచయం చేస్తోంది.

 

అంకితభావంతోనే విజయం



పారిశ్రామిక వేత్తగా రాణిస్తున్న బోడేపూడి సుధారాణి తండ్రి జాతీయ బ్యాంక్‌లో చిరుద్యోగి. 18 ఏళ్ల వయసులో ఆమె వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనుకున్నప్పుడు ‘ఆడపిల్లవి నీకెందుకు’ అంటూ చాలామంది నిరుత్సాహ పరిచారు. పట్టుదలతో ఒకే యంత్రంతో విజయవాడలో సాయిసుధా పైప్స్ ఇండస్ట్రీ స్థాపించారు. రైతులకు అవసరమైన ఎల్‌డీపీ పైపులు తయారుచేసే ఈ పరిశ్రమ ఇప్పుడు విశాఖపట్నం, హైదరాబాద్‌కు విస్తరించి వందల మందికి ఉపాధి కల్పిస్తోంది. 2004లో ఆదర్శ మహిళా రత్న అవార్డు పొందిన సుధారాణి 2006లో తక్కువ ధరకే రైతులకు పైపులను అందిస్తున్నందుకు అప్పటి తమిళనాడు గవర్నర్ పి.ఎస్.రామమోహనరావు చేతుల మీదుగా ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో ఉత్తమ వ్యాపార వేత్త అవార్డు అందుకున్నారు. వ్యాపారంలో విజయాలు సాధించినందుకు 2013లో విజయవాడలో చాంబర్ అఫ్ కామర్స్ అందించే స్వర్ణకంకణాన్ని సొంతం చేసుకున్నారు.  2014లో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు నుంచి ఆదర్శ సేవా రత్న అవార్డు అందుకున్నారు. తన విజయానికి తన తల్లిదండ్రులు సుశీలాదేవి, శివరామయ్య, భర్త మురళీకృష్ణ సహకారమే కారణమని సుధారాణి పేర్కొంటున్నారు. మహిళలకైనా, పురుషులకైనా ఏదైనా ఒక లక్ష్యం, దానిని సాధించాలన్న తపన ఉంటే విజయం కచ్చితంగా వరిస్తుందని సూచిస్తున్నారు.         

     - వ్యాపార వేత్త బోడేపూడి సుధారాణి

 

 మాతాశిశు మరణాల రేటు తగ్గించడమే లక్ష్యం



జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి స్వస్థలం గుంటూరు జిల్లాలోని యడ్లపాడు. ఆర్‌ఎంపీగా పనిచేసే తన పెద్దనాన్నను చూసి తానూ డాక్టర్ కావాలని ఆమె నిర్ణయించుకున్నారు. చదువులో రాణించి 1977లో గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక ప్రకాశం జిల్లాలో కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత గుంటూరు జిల్లాలో అనేక ప్రభుత్వాస్పత్రుల్లో విధులు నిర్వహిం చారు. ఆమె భర్త కూడా డాక్టర్ కావడంతో ఒకవైపు ఉద్యోగం, మరోవైపు ఇంటి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డెప్యూటీ సివిల్ సర్జన్‌గా ఉన్న సమయంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. విధి నిర్వహణలో ఇబ్బందులు  సహజమని, వాటిని చూసి బెదిరిపోకుండా సమర్థంగా వ్యవహరిస్తే పరిష్కారం లభిస్తుందని నాగమల్లేశ్వరి అంటున్నారు. జిల్లాలో మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ వందశాతం పూర్తి చేయడం, మాతాశిశు మరణాల రేటును తగ్గించడం తన లక్ష్యాలని వివరించారు.

 

నేటి ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఒకప్పుడు వ్యవసాయ రంగంలోనే మహిళల పాత్ర ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా నిలుస్తున్నారు. గృహిణిగా కుటుంబ భారాన్ని మోస్తూనే ఇటు రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో రాణించి సత్తా చాటుతున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా, ఎమ్మెల్యేలుగా, స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా జిల్లాలో ఎందరో మహిళలు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. అనేక మంది పలు రకాల ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు.

     - సాక్షి, విజయవాడ/విజయవాడ కల్చరల్/ గాంధీనగర్/లబ్బీపేట/ భవానీపురం/విజయవాడ స్పోర్‌‌ట్స  

 

 

కూతురి కోసం..

 

ఒక్కగానొక్క కుమార్తెగా పుట్టింట్లో అల్లారుముద్దుగా పెరిగింది. తల్లిదండ్రులు ఉన్నంతలో ఘనంగా ఆమె వివాహం చేశారు. భార్యాభర్తలు అన్యోన్యతకు గుర్తుగా కుమార్తె జన్మించింది. సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలో పెద్దకుదుపు. తాగుడికి బానిసైన అర్ధంతరంగా జీవితం చాలించాడు. ఒక్కసారిగా జీవితంలో చీకట్లు అలముకున్నాయి. అయితే కుమార్తెను చదివిస్తేనే ఆ చీకట్లు తొలగుతాయని భావించింది. ఎన్నడూ కష్టపడని ఆమె రిక్షాను నమ్ముకుంది... ఇదీ కైకలూరుకు చెందిన బేత వరలక్ష్మి ఉరఫ్ రిక్షా

లక్ష్మి కథ...

 


కైకలూరుకు చెందిన అప్పారావు, కుమారి దంపతుల ఏకైక సంతానం వరలక్ష్మి. ఆమెకు కృష్ణతో వివాహమైంది. వారి కుమార్తె జగదీశ్వరి. కూలిపనులు చేసే కృష్ణ మద్యానికి బానిసయ్యాడు. ఎంత చెప్పినా వినలేదు. మూడేళ్ల కిత్రం కిడ్నీలు దెబ్బతిని మృతి చెందాడు. దీంతో వరలక్ష్మి జీవి తంలో చీకట్లు అలముకున్నాయి. కుమార్తెను చదివించాలన్న నిర్ణయంతో రిక్షాను నమ్ముకుంది. ఆ రిక్షాపై రోజూ సమీప గ్రామాల్లో ఉదయం ముగ్గు విక్రయిస్తోంది. ఇంటికి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోకుండా కిరాయికి అదే రాక్షాపై వివిధ రకాల సామగ్రిని తరలి స్తుంది. అలా వచ్చే సంపాదనతో కూతురిని 8వ తరగతి చదివిస్తోంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే రూ.150 రావడమే కష్టం. ఇంటికి నెలకు రూ.700 అద్దె చెల్లించాలి. ఒక్కొక్క సారి రిక్షాలో బరువు ఎక్కువైనప్పుడు శక్తినంతా కూడదీసుకోక తప్పదు. నా బిడ్డను చదివించుకోవాలంటే ఈ కష్టాన్ని భరించాల్సిందేనని చమర్చిన కళ్లతో లక్ష్మి పేర్కొంటోంది.  - కైకలూరు

 

నారీ భేరి


 

బాలిక పుడితే తల్లిదండ్రులు బాధపడేవారు.. ఆడపిల్లకి చదువు ఎందుకంటూ వంటింటికే పరిమితం చేసేవారు. ఇదంతా గతం.. తరం మారుతోంది.. స్వరమూ మారుతోంది.. విద్య, ఉద్యోగం, వ్యా పారం రంగమేదైనా బాణంలా దూసుకెళ్తూ విజ యాలు సాధిస్తున్నారు. సొంతంగా వ్యాపార సామ్రాజ్యాలను స్థాపిస్తున్నారు. ఇంటితోపాటు పనిచేసే కార్యాలయాల్లోనూ సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.    

 

చట్టాలు కాదు.. మార్పు రావాలి



ఏటా మహిళా దినోత్సవాలు జరుపుకోవడంవల్ల ప్రయోజనం లేదు. దాని ప్రధాన ఉద్దేశం నెరవేరడం లేదు. చట్టాలవల్ల ఉపయోగంలేదు. ప్రజల్లో, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి. నిర్భయ చట్టం వచ్చిన తరువాత మహిళలపై దాడులు మరిన్ని పెరిగాయి. వెలుగుచూసే కేసులకంటే చూడనివే ఎక్కువ. చట్టాల అమలులో ప్రభుత్వాల వైఫల్యమే కారణం. మహిళలు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా భద్రత లేదు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుగుతున్నాయి. బాలురకు ఇంటిదగ్గర తల్లిదండ్రులు, స్కూల్లో ఉపాధ్యాయులు నైతిక విలువలు బోధించాలి. పోలీసులు రాజకీయాలకు ప్రభావితం కాకుండా, కేసులను పక్కదారి పట్టించకుండా, సరిగా దర్యాప్తు చేస్తే కొన్ని నేరాలైనా తగ్గించవచ్చు. చార్జిషీట్ దాఖలులో జాప్యం చేస్తే కేసు నీరుగారుతుంది. పోలీసులు, కోర్టులు సమష్టిగా వ్యవహరిస్తే మహిళలకు మేలు జరుగుతుంది.

 - డి.లక్ష్మి, రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్

 

 వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి



‘మహిళా సాధికారతను జరగనిద్దాం’ అన్న ఈ ఏడాది మహిళా దినోత్సవ నినాదంతో ముందుకు వెళ్లాలి. అంటే ఇప్పటి వరకు కొన్ని అవాంతరాలు ఉన్నట్టే కదా. వాటిని అధిగమించడమే లక్ష్యంగా పని చేయాలన్నది మా ఉద్దేశం. ఏ స్థాయిలో పని చేస్తున్నా తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం, తద్వారా ఆత్మగౌరవాన్ని పొందగలగడం ప్రధానం. ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారత సాధించినప్పుడే మహిళలు ముందుకు వెళ్లగలరు. గతంలోకంటే రాజకీయ సాధికారత పెరిగింది. ఆర్థికంగానూ మహిళల్లో స్వావలంబన పెరిగింది. అయితే సామాజికపరంగా సాధికారిత సాధించలేకపోయాం. అవగాహన రాహిత్యంవల్ల అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకర్షణలకు లోనవడం, ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావంతో బాలికల్లో ఆలోచనా ధోరణి పెడదారిపడుతోంది.

 - కె.కృష్ణకుమారి, జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్

 

శక్తిగా ఎదిగినప్పుడే సాధికారత




సమాజంలో మహిళలు ఒక శక్తిగా ఎదిగినప్పుడే సాధికారత సాధ్యమవుతుంది. గతం కంటే మహిళల స్థితిగతులు మెరుగుపడ్డాయి. నిత్య జీవితంలో మహిళలకు అవసరమైన ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఆభరణాల తయారీ వంటి అనేక కోర్సుల్లో ఉచితంగా శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందగులుగుతున్నారు. శిక్షణ అనంతరం ఇచ్చే సర్టిఫికెట్‌తో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని సొంత కాళ్లపై నిలబడగులుగుతన్నారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్‌పై 2007 నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాం. శ్రీస్ పేరుతో భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణకు విశేష స్పందన లభిస్తోంది. 200 మంది మహిళలు ఫ్యాషన్ డిజైనింగ్‌లో, ఆభరణాల తయారీలో శిక్షణ తీసుకుంటున్నారు.

  పద్మశ్రీ నాదెళ్ల, డెరైక్టర్, సెల్ఫ్ రూరల్ ఎంపవర్‌మెంట్ అండ్

 ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్(శ్రీస్)

 

 మహిళలను గౌరవించాలి



మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అన్నది నానుడి. నేడు మహిళ తన కాళ్లపై తాను నిలబడుతున్నా హక్కుల కోసం పోరాడాల్సి రావడం విచారకరం. పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. అర్ధరాత్రి ఒంటరిగా మహిళ బయటకు వెళ్లిన రోజు పూర్తి స్వతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ అన్నారని విన్నాం. అయితే రెండేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దురదృష్టకరం. బాలురకు చిన్నప్పటి నుంచే మానవతా విలువలను తెలపాలి. మహిళలతో గౌరవంగా మెలగాలని తల్లిదండ్రులు హితవుచెప్పాలి. మహిళ సమాజంలో భాగం అయితే ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. తరాలు మారుతున్నా మహిళల స్థితిగతుల్లో మార్పు రావడంలేదు.

 - గద్దె అనూరాధ, జెడ్పీ చైర్‌పర్సన్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top