అత్తారింటి ఎదుట కోడలు మౌనదీక్ష

Wife Protest in Front of Husband's House Prakasam - Sakshi

భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆందోళన

పెద్ద మనుషుల పంచాయతీలో ఇరువర్గాల ఘర్షణ

సాక్షి, యర్రగొండపాలెం(ప్రకాశం): తన భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని, అత్తమామలు ఇంట్లోకి రానివ్వడం లేదని ఓ యువతి తన అత్తారింటి ఎదుట మౌనదీక్షకు కూర్చొంది. ఈ సంఘటన మండలంలోని కొలుకుల ఎస్సీ పాలెంలో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బరిగెల పిలుపు, మరియమ్మలు ప్రేమించుకున్నారు. వారు వివాహం చేసుకోవాలని అనుకుంటున్న తరుణంలో మరియమ్మ తల్లిదండ్రులు ఏసయ్య, దీవెనమ్మలు పెద్దారవీడు మండలం తంగిరాలపల్లె గ్రామానికి చెందిన ఒకరితో కుమార్తెకు వివాహం చేశారు. అయినా పిలుపు తరుచూ తంగిరాలపల్లె వెళ్లి వస్తుండేవాడు.

ఈ విషయం గమనించిన భర్త..ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత పిలుపు ఆమెను గుంటూరు తీసుకెళ్లాడు. ఈ వ్యవహారంపై పెద్దారవీడు పోలీసుస్టేషన్‌లో కేసులు కూడా పెట్టుకున్నారు. పిలుపు, మరియమ్మలకు పోలీసులు దండలు మార్పించి వివాహం చేశారు. పోలీసుస్టేషన్‌ నుంచి వారిద్దరు స్వగ్రామానికి చేరకుండా పనుల కోసం హనుమాన్‌ జంక్షన్‌కు చెరకు కోతలకు వెళ్లారు. అక్కడి నుంచి బేల్దారి పనుల కోసం హైదరాబాద్‌ వెళ్లారు. ఆయా ప్రాంతాల్లో దాదాపు రెండు, మూడు నెలలు పనులు చేసుకున్నారు. దంపతుల మధ్య పొరపొచ్చాలు చోటుచేసుకోవడంతో పిలుపు తన భార్యను స్వగ్రామం కొలుకులలోని ఆమె పుట్టింట్లో వదిలి పెట్టి వెళ్లాడు. పిలుపు 20 రోజుల క్రితం గ్రామానికి చేరాడు.

ఈ నేపథ్యంలో మరియమ్మ బంధువులు పెద్ద మనుషులు వారిద్దరినీ కలిపేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పెద్దలతో సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సలహా ఇచ్చినట్లు తెలిసింది. తిరిగి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరుగుతున్న సమయంలో ఇరు కుటుంబాలకు చెందిన వారు ఘర్షణకు దిగారు. ఇంట్లోకి వెళ్లేందుకు మరియమ్మ ప్రయత్నించగా భర్త అడ్డుకున్నాడు. భర్తతో పాటు అత్తమామలు తనను ఇంట్లోకి రానివ్వడం లేదని మరియమ్మ అక్కడే మౌనదీక్షకు కూర్చుంది. కేసు దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ ముక్కంటి తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top