ఎవరైనా సరే తాను రౌడీనంటూ రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.
నేరాల సమీక్షలో ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్
చిత్తూరు (అర్బన్): ఎవరైనా సరే తాను రౌడీనంటూ రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం చిత్తూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో గత అర్ధ సంవత్సరం జరిగిన నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో గడిచిన రెండేళ్లకంటే ఈ సారి నేర తీవ్రత తగ్గిందన్నారు. కొన్ని సంఘటనలు పోలీసు శాఖ పనితీరును ప్రశ్నించాయన్నారు. ఇకమీదట అలాంటి పొరపాట్లు జరగకూడదన్నారు. గత ఏడాది జరిగిన తప్పులు పునరావృతం కాకుండా మరింత కష్టపడి పనిచేయాలని ఆదేశించారు.
పొరపాట్లు చేస్తూ వెళితే ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. జిల్లాలోని మదనపల్లె, పలమనేరు, చిత్తూరు, పుంగనూరు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, దీన్ని తగ్గించడానికి ప్రణాళికలు రూపొందిం చాలన్నారు. కమ్యూనిటీ పోలీస్‌కు సంబంధించి ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు వృత్తిపట్ల మరింత గౌరవంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఏఏస్పీలు అన్నపూర్ణారెడ్డి, రత్న పాల్గొన్నారు.