ఓటు విశ్వాసాన్ని కాపాడతాం

We Will Secure Vote Confidence By Electing Public Representatives - Sakshi

సాక్షి,కృష్ణా :  సార్వత్రిక సంగ్రామం రసవత్తరంగా మారింది. తొలి విడత పోలింగ్‌ గురువారం నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీలు గుప్పించాయి. మరో వైపు ఓటు హక్కు వినియోగంపై అధికార యంత్రంగం విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. తొలి సారిగా అధిక సంఖ్యలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో హామీలు గుప్పించి మోసం చేసిన నేతలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.. విలువలున్న నేతలనే ఎన్నుకుని ఓటుపై ఉన్న విశ్వాసం కాపాడతాం అని చెబుతున్నారు. ప్రతిఓటరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.  

ఓటు హక్కు ప్రాధాన్యం గుర్తించండి
ఓటు వజ్రాయుధం. సమాజాన్ని మార్చే శక్తి ఓటుకే ఉంది. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నూరుశాతం ఓటింగ్‌ జరగాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మోసగించే నేతలను దూరంగా ఉంచాలి. నిజాయితీతో పనిచేసే నాయకులను ఎన్నుకోవాలి. 
–జంపాన శ్రీనివాసగౌడ్, సామాజిక కార్యకర్త 

దేశ పౌరులుగా మన బాధ్యత
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది దేశపౌరుల చేతిలో వజ్రాయుధం లాంటిది. నిజాయితీపరుడు, ప్రజలకు నిస్వార్థసేవలు చేస్తాడని విశ్వసనీయత కలిగిన వ్యక్తులను తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపడం ద్వారా విలువలను కాపాడుకోవలసిన బాధ్యత మనదే. ఓటుహక్కు వినియోగించుకోలేనివారు దేశపౌరులుగా ఎలాంటి బాధ్యత కలిగి ఉంటారు? తప్పనిసరిగా ఓటువేయాలి. 
–బచ్చు శేషగిరిరావు, నాగాయలంక

ఓటును అమ్ముకోకండి...
ఓటును అమ్ముకోవద్దని ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశా. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును అమ్ముకోవటం సరైంది కాదు. ప్రజలు చైతన్య వంతులు కావాలి. ఓటు విలువ తెలుసుకోవాలి. ఐదేళ్లపాటు ఉండే ప్రజా నాయకుడిని ఎన్నుకోవాలి. నిస్వార్థంగా సేవ చేసేవారినే ప్రజాప్రతినిధిగా అవకాశం ఇవ్వాలి. హామీలతో మోసం చేసేవారిని నమ్మవద్దు.
– వైవీ మురళీకృష్ణ, సామాజిక కార్యకర్త, గుడివాడ 

మన భవిష్యత్‌ మన చేతుల్లో..
ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకోవాలి. రాజ్యాంగం మన పాలకులను ఎన్నుకునే అవకాశం కల్పించింది. దేశ ప్రగతిని మార్చే ఓటు అనే ఆయుధం మన చేతుల్లోనే ఉందని మరువకండి. ప్రజల అవసరాలను తీర్చే వారిని గుర్తించి వారికే ఓటు వేయండి. సాధారణంగా ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ఐదేళ్లు ప్రజలను పట్టించుకోరు. ఇప్పటి వరకు ఇదే రాజకీయాలను చూస్తున్నాం. మీ ప్రాంతంలో అలాంటివి జరిగితే ఇప్పుడు ఓటు కోసం వచ్చే వారిని నిలదీయండి. 
 – బొప్పన విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు

సరియైన నిర్ణయం తీసుకోండి
ఐదేళ్లకు పాలకులను ఎన్నుకుంటాం. తప్పుడు నిర్ణయం తీసుకుంటే మన భవిష్యత్‌ అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. పిల్లలపై దాని ప్రభావం ఉంటుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు పడతాం. అందువలన ఓటు విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాలి. లేకుండా ఇబ్బంది. ప్రసుత్తం ఎన్నికల రసవత్తరంగా ఉన్నాయి. మార్పు అవసరం.
–వడ్లమన్నాటి ప్రసాద్, సింగరాయపాలెం

నైతిక విలువలకు ప్రాధాన్యం
విలువలతో రాజకీయాలు చేసే వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. హామీల పేరుతో మోసగించే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలి. ఎన్నికల రాగానే మన చుట్టూ తిరుగుతున్న నేతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ఇబ్బందులు పడతాం. మాట ఇచ్చిన తప్పని నేతలను ఎన్నుకోవాలి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.                  
–విస్సంశెట్టి కోటేశ్వరరావు, పెదగొన్నూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top