జిల్లాలో నీరు-చెట్టు అవగాహన సదస్సులు ప్రహసనంగా మారాయి...
- జనాలు లేక వెలవెల బోతున్న నీరు-చెట్టు అవగాహన సదస్సులు
- పింఛన్ల రద్దుపై దుమారం
- కుప్పంలో అధికారులకు చుక్కెదురు
- రుణమాఫీ చేయాలంటూ నిలదీత
- నామమాత్రంగా సమాచార సేకరణ
సాక్షి ప్రతినిధి తిరుపతి: జిల్లాలో నీరు-చెట్టు అవగాహన సదస్సులు ప్రహసనంగా మారాయి. జనాలు రాక సభలు వెలవెలబోతున్నాయి. కొన్ని చోట్ల కొత్త పింఛన్లు ఇస్తాం రండి అంటూ అధికారులు మభ్యపెట్టి ప్రజలను తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రాతి నిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా ఈ సభలకు చుక్కెదురవుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల ‘నీరే లేదు చెట్లు ఎక్కడ నాటాల’ అంటూ జనం అధికారులను నిలదీశారు. మొత్తం మీద నీరు-చెట్టు అవగాహన సదస్సులను తుతూ మాత్రంగా నిర్వహించి మమ అనిపిస్తున్నారు. గ్రామ పంచాయతీల నుంచి నామమాత్రంగా సమాచారం సేకరించి సరిపెడుతున్నారు. దీంతో నీరు- చెట్టు లక్ష్యం నీరుగారిపోతోంది.
కుప్పంలో అధికారులకు చుక్కెదురు
కుప్పం నియోజకవర్గంలో సైతం నీరు-చెట్టు అవగాహన సదస్సులకు జనాలనుంచి స్పందన కరువైంది. శనివారం శాంతిపురం మండలంలోని మఠం గ్రామంలో సభలు ప్రారంభించారు. ఆ సభకు జనాలు లేకపోవడంతో ఉపాధి కూలీలను
తీసుకురావాల్సి వచ్చింది. దీంతో సదస్సు ఆలస్యంగా ప్రారంభమైంది. రెండోరోజు శివరామపురంలో జరిగిన సదస్సులో అధికారులకు చిక్కులు తప్పలేదు. పింఛన్ల రద్దుపై దుమారం రేగింది. అర్హులైన వారి పింఛన్లను తొలగించి అనర్హులకు ఇచ్చారని పలువురు దుమ్మెత్తిపోశారు. జన్మభూమి కమిటీల పేరుతో అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది రైతులు వేరుశెనగ పంటకు ఇన్‌పుట్ సబ్సిడీ రాలేదంటూ నిలదీశారు.
కొత్త పింఛన్లు ఇస్తామని..
జిల్లాలో నీరు-చెట్టు సదస్సుకు జనాలు రాకపోవడంతో పలమనేరు, గంగాధర నెల్లూరు, సత్యవేడు, కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాల్లో కొత్తగా పింఛన్లు ఇస్తామని సభలకు జనాలను తరలిస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో కొన్నిచోట్ల సభలు ప్రారంభం కాగానే నీరు-చెట్టు ఏమీ వద్దు మాకు రుణమాఫీ చేయాలంటూ రైతులు నిలదీయడంతో అధికారులు తెల్లముఖం వేశారు. కొన్నిచోట్ల జరిగిన సదస్సులకు అంగన్‌వాడీ వర్కర్లు, ఉపాధి కూలీలు, జన్మభూమి కమిటీ సభ్యులు తప్ప ఇతరులు ఎవరూ హాజరుకాలేదు.
తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలంలో అధికారుల తీరుకు నిరసనగా టీడీపీ ప్రజా ప్రతినిధులు కూడా సదస్సులకు హాజరుకాక పోవడం విశేషం. పీటీఎం మండలం మల్లెల గ్రామ సభలో ప్రజలనుంచి అధికారులకు చుక్కెదురైంది.. ‘ఇంతకు మునుపు జన్మభూమి సభలోనే మొక్కలు ఇస్తామన్నారు. ఇప్పటికీ ఇవ్వలేదు’ అని కొందరు మండిపడ్డారు. ‘అటవీ సంపద అక్రమంగా తరలిపోతున్నా పట్టించుకోరు. ముందు అటవీ సంపదను కాపాడండి. ఆతరువాత కొత్త మొక్కలు ఇవ్వండి’ అని మరికొందరు నిలదీశారు. ప్రతిచోటా పింఛన్ల తొలగింపుపై అధికారులకు నిరసనల సెగ తప్పలేదు.