ఆలోచించి.. ఆరగించండి

ఆలోచించి.. ఆరగించండి


*మామిడి రంగుచూసి మోసపోవద్దు

* కాల్షియం కార్బైడ్‌తో కాయల పక్వం

*తింటే అనారోగ్యమే

* పట్టని అధికారులు


 

 తాళ్లూరు, న్యూస్‌లైన్: పీచు పదార్థాలతో పాటు ఏ, సీ విటమిన్లు పుష్కలంగా లభించే సీజనల్ ఫ్రూట్స్‌లో మామిడి ప్రధానమైంది. మామిడికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కాసులకు కక్కుర్తిపడి చెట్టుమీద కాయలు పండకుండానే కోసి మాగబెడుతున్నారు. తొందరగా పండటం కోసం కాల్షియం కార్బైడ్ వంటి వాటిని వాడుతున్నారు. మామిడి తోటల్లో నుంచి తెచ్చిన పచ్చి కాయల్ని ఒక గదిలో రాశిగా పోసి..ప్రతి 50 కాయల మధ్య 200 గ్రాముల కార్బైట్ ఉంచుతారు. కార్బైడ్ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తుంది. రసాయనాల ప్రతిచర్యతో ఉష్ణోగ్రతలు పెరిగి కాయలు పండ్లుగా మారుతాయి.



పచ్చని రంగు వస్తాయి. అనంతరం మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా పండిన పండ్లలో ఉండే పోషక విలువలు వీటిలో ఉండవు. ఈ పండ్లు తినడం  ఆరోగ్యానికి హానికరమని వైద్యులంటున్నారు. రసాయనాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లు తింటే గ్యాస్‌ట్రబుల్ రావడం, జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. నాడీ వ్యవస్థ నిర్వీర్యమవడంతో పాటు క్యాన్సర్ బారిన పడే  అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.



గర్భిణులకు ముప్పు....

కార్బైడ్‌తో మగ్గించిన పండ్లు తింటే గర్భిణులకు ప్రమాదకరం. ఒక్కోసారి అబార్షన్ అయ్యే అవకాశం కూడా ఉందని వైద్యులంటున్నారు. పిల్లలు అంగవైకల్యంతో పుట్టవచ్చని, వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుందని  హెచ్చరిస్తున్నారు.




ఎండు గడ్డితో పండేవి మంచివి...

 మామిడి కాయలు చెట్టు మీద పక్వానికి వచ్చిన తర్వాత కోస్తారు. వీటిని గంపల్లో వేసి ఎండు గడ్డి కప్పి వారం రోజుల పాటు మగ్గ బెడతారు. తర్వాత గడ్డిని తొలగించి చూస్తే మంచి వాసనతో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా.. రుచికరంగా ఉంటాయి.  



- రసాయనాలతో మాగబెట్టినప్పుడు పండ్ల తొక్కలపై అధిక ప్రభావం ఉంటుంది. తొక్కలోనే రసాయనాలు అధికంగా ఉంటాయి. పండ్లను ఉప్పునీటిలో కడిగి పైన తొక్కను తీసేసి తింటే కొంత మేలని వైద్యులు పేర్కొంటున్నారు.

- ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని గోడౌన్లలో మామిడి కాయల్ని కృత్రిమ పద్ధతుల్లో మాగబెట్టి..జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండలంలోని పండ్ల దుకాణాల్లో విక్రయించే వాటిని కూడా అక్కడి నుంచే తెస్తున్నారు. అధికారులు స్పందించి అటువంటి పండ్లను మార్కెట్‌లోనికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top