జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న ఆరు మున్సిపాలిటీల్లో ఏడాదికే భారీగా ఓటర్లు పెరిగారు. 2013 జూలైలో మున్సిపాలిటీ వారీగా ఓటర్ల జాబితా ప్రకటించగా ఆరు మున్సిపాలిటీల్లో సుమారు 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న ఆరు మున్సిపాలిటీల్లో ఏడాదికే భారీగా ఓటర్లు పెరిగారు. 2013 జూలైలో మున్సిపాలిటీ వారీగా ఓటర్ల జాబితా ప్రకటించగా ఆరు మున్సిపాలిటీల్లో సుమారు 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా 2 లక్షలకు పైగా కొత్తగా నమోదు చేసుకున్నారు. ఈ ఆరు మున్సిపాలిటీల్లో 55 వేలకు పైగా కొత్తగా చేరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. కలెక్టర్ అహ్మద్‌బాబు ప్రత్యేక దృష్టి సారించి అన్ని చోట్ల ఓటరు నమోదు సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవడంతోనే ఇది సాధ్యమైంది.
పెరిగిన తీరు..
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 2013 జూలై ఓటరు జాబితాలో 75,997 ఓటర్లు ఉండగా 2014 జనవరి 1కి 95,372కు చేరుకుంది. 19,375 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. మంచిర్యాలలో 60,725 ఉండగా 73,985కు పెరిగారు. 13,220 కొత్తగా చేరారు. నిర్మల్‌లో 57,103 ఓటర్లు ఉండగా ప్రస్తుతం 10 వేలకు పైగా పెరిగి 67,576కు చేరుకుంది. కాగజ్‌నగర్‌లో 7 వేలకు పైగా, భైంసాలో 6 వేలకు పైగా, బెల్లంపల్లిలో 1500కు పైగా కొత్త ఓటర్లు వచ్చారు. పెరిగిన ఓటర్ల సంఖ్యతో మున్సిపాలిటీల్లో సమీకరణాలు కొంత మారే అవకాశాలు ఉన్నాయి. ఆయా కులాల ఓటర్ల సంఖ్యాబలం పెరిగింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వీటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాగా అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుష ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది.
పెరగనున్న పోలింగ్ కేంద్రాలు..
మున్సిపాలిటీలో ప్రతి 1,400 మందికి ఒక పోలింగ్ బూతును పరిగణలోకి తీసుకుంటారు. అయితే.. ఆయా ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా గతంలో పోలింగ్ కేంద్రాలను నిర్ణయించారు. తాజాగా ఓటర్ల సంఖ్య పెరగడంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌లో గత ఓటర్ల సంఖ్య ప్రకారం 81 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా తాజాగా 19 వేలకు పైగా ఓటర్లు పెరగడంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య మరింత పెరగనుంది. మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి. కాగా ఆదివారం రాత్రి ఓటర్ల జాబితాను అన్ని మున్సిపాలిటీల్లో ప్రదర్శించారు.