పనులు అరకొర... సాగేనా వంశధార? | Vansadhara project under the left and right tanks | Sakshi
Sakshi News home page

పనులు అరకొర... సాగేనా వంశధార?

Jul 17 2015 1:10 AM | Updated on Sep 3 2017 5:37 AM

వంశధార ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాల్వలకు సాగునీరందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

 నరసన్నపేట :వంశధార ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాల్వలకు సాగునీరందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. 1.48 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో శుక్రవారం ఉదయం 9.10 గంటలకు గొట్టాబ్యారేజి వద్ద కుడి, ఎడమ కాల్వలకు సాగు నీటిని విడుదల చేస్తారు. గత సీజన్‌లో ఉన్నమేరకు సక్రమంగా అందించిన అధికారులు ఈ ఏడాదికూడా అదేరీతిలో అందివ్వగలరా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వంశధార నిర్వహణ డివిజన్ పరిధిలో వివిధ పనులకోసం రూ. ఏడుకోట్లతో ప్రతిపాదించగా అందులో 80శాతం మాత్రమే పూర్తయ్యాయి. దీంట్లో టెండర్‌పనులు అన్నీ చివరిదశకు వచ్చాయని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. కానీ నరసన్నపేట సబ్‌డివిజన్ పరిధిలోని ఓపెన్‌హెడ్ ఛానల్ పనులు మాత్రం 50 శాతమే పూర్తయ్యాయి. దీనివల్ల శివారు రైతులు తమవరకూ నీరొస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
 
 ఏటా వారికి కష్టాలే...
 వంశధార ప్రాజెక్టు పరిధిలోని శివారు భూములకు ఏటా సాగునీరు సమస్యగానే ఉంటోంది. పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, నందిగాం తదితర మండలాల రైతులు సాగు నీటి కోసం ఏటా అవస్థలు పడుతున్నారు. అలాగే నరసన్నపేట, పోలాకి మండలాల్లో కూడా శివారు రైతులు కూడా సాగు నీటికోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజనులో ఆ పరిస్థితి రాదని అధికారులు అంటున్నా రైతులు మాత్రం అనుమానిస్తున్నారు. పలుచోట్ల షట్టర్ల మరమ్మతులు చేయలేదని, పలు చానల్స్‌లో పూడిక తీయలేదని రైతులు అంటున్నారు. అలాగే వంశధార చానల్స్‌లో కూడా పనులు ఆశించిన మేరకు జరగలేదని వారు చెబుతున్నారు. అలాంటపుడు నీరెలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పోలాకి, మబగాం ఓపెన్ హెడ్ చానల్స్ పనులు పూర్తి కానేలేదు. వంశధార నది నుంచి జాతీయ రహదారి వరకూ పనులు నిర్వహించారు. మిగిలిన బాగం పనులు చేయక పోతే నీరు పోలాల్లోకి ఎలా వస్తుందని రైతులు అనుమానిస్తున్నారు.
 
 అధ్వానంగా షట్టర్సు
 వంశధార చానల్స్‌తో పాటు ఓపెన్ హెడ్ చానల్స్‌లో ఉన్న ఫట్టర్సు అధ్వానంగా ఉన్నాయి. షట్టర్సు కుంభకోణం వ్యవహారం కొలిక్కి రాక పోవడంతో వాటి మరమ్మతు పనులు నిర్వహించడం లేదు. 2009 నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసు తేలితే తప్ప పనులు చేయలేమని అధికారులు తేల్చేస్తున్నారు. అయితే వంశధార ఇంజనీర్లు మాత్రం నీటి రెగ్యులేషన్‌కు ఇబ్బంది లేకుండా షట్టర్ల మరమ్మతు చేస్తున్నామని అంటున్నారు.
 
 అనుకూలంగా ఇన్‌ఫ్లో..
 శుక్రవారం నీటి విడుదలకు వంశధారలో ఇన్‌ఫ్లో అనుకూలంగా ఉంది. రెండు రోజుల క్రితం వరకూ నీటి ఇన్‌ఫ్లో తక్కువగా ఉండగా గురువారం సాయంత్రానికి 1950 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉందని అధికారులు తెలిపారు. గొట్టాబ్యారేజి వద్ద నీటి నిల్వ కూడా అనుకూలంగా ఉందని చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement