పసుపుపంట కాపలాకు వెళ్లిన గిరిజన రైతు అగ్ని ప్రమాదానికి గురై సజీవదహనమయ్యాడు.
	పాకకు నిప్పంటుకోవడంతో దుర్ఘటన
	భోగి పండగ పూట డెయిరీనగర్‌లో విషాదం
	 
	చింతపల్లిరూరల్: పసుపుపంట కాపలాకు వెళ్లిన గిరిజన రైతు అగ్ని ప్రమాదానికి గురై సజీవదహనమయ్యాడు. మండలంలోని డె యిరీ నగర్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. చింతపల్లి పంచాయతీ శివారు డెయిరీనగర్‌లో ఉంటున్న కొర్రా లక్ష్మణరావు(35) గ్రామ సమీపంలోని గరువులో పసుపు పంటను చేపట్టాడు. దానికి కాపలాగా ఉండేందుకు అక్కడే చిన్న పాకను వేసుకున్నాడు. రోజూ భార్య బిమలతో కలిసి కొద్దికొద్దిగా పంటను సేకరించి ఉడకబెట్టి ఆరబెడుతున్నాడు. రోజూ మాదిరి మంగళవారం రాత్రి దంపతులు చలికి చిన్న మంట వేసుకుని ఇద్దరూ పాకలో నిద్రపోయారు. బుధవారం వేకువజామున అది పెద్దదైంది.
	
	అగ్నికీలలు ఎగిసిపడి పాకను చుట్టుముట్టాయి. భార్య బిమలమ్మ మేలుకొని కొద్దిపాటి గాయాలతో బయటపడింది. లక్ష్మణరావు అగ్నికీలల్లో చిక్కుకుపోయాడు. తప్పించుకునే అవకాశం లేక సజీవ దహనమయ్యాడు. బిమలమ్మ ఫిర్యాదు తో ఎస్‌ఐ తారకేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పండగపూట  సంఘటనతో డెయిరీనగర్‌లో విషాదం అలుముకుంది.
	 
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
